కొచర్‌పై వేటు తప్పదా..? | CICI board divided over Chanda Kochhar's future | Sakshi
Sakshi News home page

కొచర్‌పై వేటు తప్పదా..?

Published Tue, Apr 10 2018 12:32 AM | Last Updated on Tue, Apr 10 2018 7:41 AM

CICI board divided over Chanda Kochhar's future  - Sakshi

ముంబై: వీడియోకాన్‌ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3,250 కోట్లు రుణమిచ్చిన వ్యవహారం మరింత ముదురుతోంది. చివరికి కొచర్‌ పదవికి ఎసరు పెట్టే స్థాయికెళుతోంది. ఈ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్ష లబ్ధి చేకూరిందంటూ ఆరోపణలు రాగా తొలుత ఆమెకు బ్యాంకు బాసటగా నిలిచింది. కొచర్‌ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ తెరిచిన ప్రతి ఒక్కరికీ... బోర్డు బాసటగా నిలుస్తోందన్న విషయం స్పష్టంగా కనిపించింది.

అయితే, ఈ అంశంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేస్తుండడం వంటి పరిణామాలతో కొచర్‌ విషయంలో బోర్డు రెండుగా చీలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొచర్‌ తన పదవి నుంచి తక్షణం తçప్పుకుంటే బావుంటుందని కొందరు డైరెక్టర్లు కోరుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కొచర్‌ పదవిలో కొనసాగటాన్ని స్వతంత్ర డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తదుపరి కార్యాచరణ తేల్చేందుకు బోర్డు ఈ వారంలోనే సమావేశం కానుంది.

వాస్తవానికి కొచర్‌ ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంది. అయితే, కొచర్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కొందరు బోర్డు సభ్యులు కోరుతున్నట్టు వచ్చిన వార్తలు అసత్యమని బ్యాంకు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో 12 మంది సభ్యులున్నారు. వీరిలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు. ఇందులో బ్యాంకు చైర్మన్‌ ఎంకే శర్మ, ఎల్‌ఐసీ హెడ్‌ కూడా ఉన్నారు. ఒకరు ప్రభుత్వ నామినీ కాగా, ఐదుగురు బ్యాంకు తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు.

కొచర్‌పై ఆర్‌బీఐ తేలుస్తుంది: ఆర్థిక శాఖ
ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌ చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణలను ఆర్‌బీఐ పరిశీలిస్తోందని, ఇందులో తమ పాత్ర ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కొచర్‌ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా కొనసాగాలా, లేదా అన్నది ఆర్‌బీఐ తేలుస్తుందని పేర్కొంది. ఆర్‌బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుకు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందని వివరించింది.


3 కోట్ల ఐసీఐసీఐ షేర్లను కొన్న మెరిల్‌ లించ్‌
డీల్‌ విలువ రూ.823 కోట్లు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌పై ప్రతికూల వార్తలు హల్‌చల్‌ చేస్తున్నప్పటికీ, ఈ షేర్లను విదేశీ సంస్థలు జోరుగా కొనుగోలు చేస్తున్నాయి. మెరిల్‌ లించ్‌ మార్కెట్స్‌ సింగపూర్‌ పీటీఈ సంస్థ సోమవారం 2.94 కోట్ల ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసింది.

ఈ కొనుగోలు విలువ రూ.823.40 కోట్లుగా ఉంటుందని అంచనా. ఒక్కో షేర్‌ సగటు కొనుగోలు ధర రూ.280. బెయిల్లీ గిఫోర్డ్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ ఈ షేర్లను విక్రయించింది. సోమవారం ఐసీఐసీఐ  షేర్‌ బీఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ.280.45 వద్ద ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement