చందా కొచర్‌ రాజీనామా? రెండుగా చీలిన బోర్డు | ICICI Board Divided Over Chanda Kochhar Future | Sakshi
Sakshi News home page

చందా కొచర్‌ రాజీనామా? రెండుగా చీలిన బోర్డు

Published Mon, Apr 9 2018 11:48 AM | Last Updated on Mon, Apr 9 2018 12:43 PM

ICICI Board Divided Over Chanda Kochhar Future - Sakshi

చందా కొచర్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చందా కొచర్‌ భవితవ్యంపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు రెండుగా చీలింది. వీడియోకాన్‌ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేయడంతో, చందా కొచర్‌కు పదవి గండం తెచ్చిపెట్టింది. చందా కొచర్‌ రాజీనామా చేయాల్సిందిగా కొంతమంది బోర్డు సభ్యులు కోరుతున్నారు. మరికొంత మంది సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. చందా కొచర్‌కు అండంగా నిలుస్తున్నారు. ఇలా బ్యాంకు బోర్డు సభ్యులు రెండుగా చీలినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. 

కొంతమంది వెలుపల ఉన్న డైరెక్టర్లు చందా కొచర్‌ ఐసీఐసీఐ సీఈఓగా కొనసాగడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నట్టు కూడా పేర్కొన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా కొచర్‌ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బోర్డులో మొత్తం 12 మంది సభ్యులున్నారు. చైర్మన్‌ ఎంకే శర్మ ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తోంది. 12 మంది సభ్యులో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ, ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లున్నారు. 

క్విడ్‌ ప్రో కో ప్రతిపాదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు చందా కొచర్‌ రుణం మంజూరు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంపై బోర్డు సమాధానం కూడా ఇచ్చింది. రుణాల జారీలో ఎలాంటి క్విడ్‌ ప్రో కో లేదని, సీఈఓ కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆమెపై ఆ విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్‌ కుటుంబీకులు ఉన్నట్లు ఆధారాలు వెలుగుచూడటంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. దీంతో సీఈవోగా చందా కొచర్‌ కొనసాగడంపై బోర్డు సభ్యులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌పై, వీడియోకాన్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ప్రారంభించింది. 

అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఐసీఐసీఐ అధికార ప్రతినిధి ఖండించారు. కొచర్‌ రాజీనామా చేయాలని బోర్డు సభ్యులు కోరుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా అధికార ప్రతినిధి ఈ మేరకు స్పందించారు. కొచర్‌ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఒకవేళ సీఈవోగా చందా కొచర్‌ రాజీనామా చేస్తే, షేర్లు మరింత కిందకి దిగజారనున్నాయని విశ్లేషకులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement