ముంబై, న్యూఢిల్లీ : కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. క్విడ్ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సందేహాస్పదమయిందని అనిపించకమానదు.
ఒక పరిశోధనాత్మక కథనం ప్రకారం డిసెంబర్ 2008లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌తో పాటు ఆమె మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... ఆపై కేవలం రూ.9 లక్షలకు న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్‌కి బదలాయించేశారు.
అయితే, వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ‘న్యూపవర్’ కంపెనీ చేతులు మారటం చర్చనీయమైంది. ఇందులో లబ్ధిదారు చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబీకులు కావడంతో ఆమె పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) కట్టనే లేదు. 2017లో వీడియోకాన్ ఖాతాను మొండిపద్దుగా వర్గీకరించారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
న్యూపవర్ ఆర్థిక పరిస్థితి ఇదీ..
2008 డిసెంబర్‌లో ఏర్పాటైన న్యూపవర్.. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా నష్టాలు ప్రకటిస్తూనే ఉంది. 2012–17 మధ్య కంపెనీ నష్టాలు రూ.78 కోట్ల మేర పేరుకుపోయాయి. 2017లో రూ.14.3 కోట్ల నష్టం ప్రకటించింది. 2016 మార్చి 31 నాటి దాకా సుప్రీమ్ ఎనర్జీ, పినాకిల్ ఎనర్జీలతో పాటు కొచర్‌కి న్యూపవర్‌లో 96.23 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, 2017 మార్చి నాటికి సుప్రీమ్, పినాకిల్‌తో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా దీపక్ కొచర్ వాటాలు 43.4 శాతంగా ఉన్నాయి. మిగతా వాటాలు మారిషస్‌కి చెందిన డీహెచ్ రెన్యూవబుల్స్ చేతిలో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏమంటుందంటే..
తాజా వ్యవహారంపై ఐసీఐసీఐ స్పందిస్తూ... ‘‘2012లో ఎస్‌బీఐ సారథ్యంలో 20 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి చమురు, గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాల కోసం వీడియోకాన్‌కు సుమారు రూ.40,000 కోట్లు రుణాలిచ్చాయి. ఇందులో మా వాటా కేవలం రూ.3,250 కోట్లే. మిగిలిన బకాయి రూ.2,810 కోట్లు.. వడ్డీతో కలసి వీడియోకాన్ చెల్లించాల్సింది రూ.2,849 కోట్లు. 2017లో గ్రూప్ ఖాతాను మొండి పద్దుగా వర్గీకరించాం’’ అని వివరణిచ్చింది.
దీనిపై ఐసీఐసీఐ చైర్మన్ ఎం.కె. శర్మ మాట్లాడుతూ... కన్సార్షియంలో ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాకే 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కమిటీ తన వంతు రుణం మంజూరు చేసిందని చెప్పారు. సదరు కమిటీకి అప్పట్లో చందా కొచర్ చైర్‌పర్సన్‌గా లేరని స్పష్టం చేశారు. బ్యాంకులో ఏ స్థాయి ఉద్యోగైనా సరే రుణ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు.
2009లోనే వదిలేశా: ధూత్
‘‘నేను 2009లోనే న్యూపవర్ రెన్యువబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ సంస్థల నుంచి వైదొలిగాను. న్యూపవర్‌లో 24,996 షేర్లను, సుప్రీమ్ ఎనర్జీలో 9,990 షేర్లను అమ్మేసి పూర్తి హక్కులను వదులుకున్నాను. చమురు, టెలికం వ్యాపారాలతో బిజీ అయిపోవడంతో.. ఆ రోజు నుంచి రెండు కంపెనీలతో సంబంధాలు వదులుకున్నాను’’ అని ధూత్ వివరించారు. కానీ ఆర్‌ఓసీలో దాఖలు చేసిన ఫైలింగ్స్ ప్రకారం చూస్తే 2010 అక్టోబర్ దాకా సుప్రీం ఎనర్జీకి ఆయన యజమానిగా కొనసాగినట్లు, 2010 నవంబర్‌లో మాత్రమే తన షేర్లను అనుచరుడు పుంగ్లియాకు బదలాయించినట్లుగా తెలుస్తోంది.
న్యూపవర్ వివరణ ఇదీ..
ఈ లావాదేవీల్లో పరస్పరం ప్రయోజనాలు పొందారనడానికేమీ లేదని న్యూపవర్ వివరణనిచ్చింది. అసలు పినాకిల్ ఎనర్జీ ట్రస్టుకు గానీ, సుప్రీమ్ ఎనర్జీకి గానీ ఐసీఐసీఐ బ్యాంకుతో ఎలాంటి వ్యాపార సంబంధాలూ లేవని స్పష్టం చేసింది.
లావాదేవీలు జరిగాయిలా..
♦ 2008 డిసెంబర్‌లో దీపక్ కొచర్, వేణుగోపాల్ ధూత్‌లు కలసి న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌పీఎల్) ఏర్పాటు చేశారు. ఇందులో ధూత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సంబంధీకులకు 50 శాతం వాటాలుండేవి. అలాగే దీపక్ కొచర్‌కి, ఆయన తండ్రికి చెందిన పసిఫిక్ క్యాపిటల్ సంస్థకు, చందా కొచర్ సోదరుడి భార్యకు మిగతా 50 శాతం వాటాలుండేవి.
♦ 2009 జనవరిలో న్యూపవర్ డైరెక్టర్ పదవికి ధూత్ రాజీనామా చేశారు. రూ. 2.5 లక్షల మొత్తానికి కంపెనీలో తనకున్న 24,999 షేర్లను దీపక్ కొచర్‌కి బదలాయించారు.
♦ 2010 మార్చిలో సుప్రీమ్ ఎనర్జీ అనే సంస్థ నుంచి న్యూపవర్‌కి రూ.64 కోట్ల రుణం (ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ రూపంలో) లభించింది. ఈ సుప్రీమ్ ఎనర్జీలో ధూత్‌కి 99.9 శాతం వాటాలు ఉన్నాయి.
♦ ధూత్ నుంచి కొచర్‌కి.. ఆ తర్వాత కొచర్ కుటుంబీకులకు చెందిన పసిఫిక్ క్యాపిటల్ నుంచి షేర్లు సుప్రీమ్ ఎనర్జీకి ఒక ఒక పద్ధతి ప్రకారం న్యూపవర్ షేర్ల బదలాయింపు జరిగింది. ఫలితంగా 2010 మార్చి ఆఖరుకు న్యూపవర్‌లో సుప్రీమ్ ఎనర్జీ 94.99 శాతం వాటాదారుగా అవతరించింది. మిగతా వాటాలు కొచర్ పేరిటే
ఉండిపోయాయి.
♦ 2010 నవంబర్‌లో ధూత్ సుప్రీమ్ ఎనర్జీలో తనకున్న మొత్తం వాటాలను.. తన అనుచరుడు మహేష్ చంద్ర పుంగ్లియాకు బదలాయించారు.
♦ ఈ పుంగ్లియా.. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 ఏప్రిల్ 29 మధ్య తన వాటాలను పినాకిల్ ఎనర్జీ అనే ట్రస్టుకు బదలాయించారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా దీపక్ కొచర్ ఉన్నారు. ఈ షేర్ల విలువ రూ.9 లక్షలుగా చూపించారు. అంటే న్యూపవర్‌కి రూ. 64 కోట్ల రుణాలిచ్చిన ధూత్ సంస్థ సుప్రీమ్ ఎనర్జీ .. మూడేళ్ల వ్యవధిలో దీపక్ కొచర్‌కి చెందిన పినాకిల్ ఎనర్జీ అనే కంపెనీలో కలిసిపోయింది.
ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.59 కోట్ల జరిమానా
బాండ్ల విక్రయ నిబంధనలు ఉల్లంఘించినందుకే...
ముంబై: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్‌బీఐ రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. హెచ్‌టీఎం (హెల్డ్ టు మెచ్యూరిటీ) సెక్యూరిటీలను నేరుగా విక్రయించే విషయంలో మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు ఉల్లంఘించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమలయ్యేవనే విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు వివరణ ఇచ్చింది.
నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తామని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం తనకు లభించిన అధికారాల మేరకు, తాను జారీ చేసిన మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు పాటించకపోవడంతో జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పెట్టుబడులను హెల్డ్ ఫర్ ట్రేడింగ్ (హెచ్‌ఎఫ్‌టీ), అవైలబుల్ ఫర్ సేల్ (ఏఎఫ్‌ఎస్), హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ (హెచ్‌టీఎం) అని మూడు వర్గీకరణలు చేయాల్సి ఉంటుంది.
హెచ్‌టీఎం కేటగిరీలో సెక్యూరిటీలు కాల వ్యవధి తీరే వరకు వాటికి కొనసాగించాలి. ఒకవేళ ఈ విభాగం నుంచి సెక్యూరిటీలను విక్రయించినట్టయితే, అది ఈ విభాగంలో అవసరమైన పెట్టుబడుల్లో 5 శాతానికి మించితే ఆర్‌బీఐకి తెలియజేయాలి. కానీ, ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment