ఐసీఐసీఐ సీఎండీ చందా కొచర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 3: వీడియోకాన్ గ్రూప్ రుణవివాదంలో ఇరుక్కున్న, ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్‌కు మరో పరాభవం ఎదురైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) లేడీస్ ఆర్గనైజేషన్ వార్షిక ఉత్సవాలనుంచి ఆమెను తొలగించారు. ఈవారంలో నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ చేతులు మీదుగా చందా కొచర్ సన్మానాన్ని అందుకోవాల్సి ఉంది. అయితే గత నెలలో ఆమె పేరును ప్రముఖంగా ప్రస్తావించిన నిర్వాహకులు తాజా జాబితాలో చందా కొచర్ పేరును తొలగించడం గమనార్హం.
నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 5వ తేదీన జరిగే ఈవెంట్‌కు చందా కొచర్ గౌరవ అతిధిగా హాజరుకావాల్సి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అందించిన సేవలకుగాను చందాకొచ్చర్‌ను ఎఫ్‌ఎల్‌వో ఐకాన్ ఆవార్డుతో సత్కరించాలని భావించింది. కానీ ఈ కార‍్యక్రమంనుంచి ఆమెను తప్పించామని ఎఫ్‌ఎల్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రష్మి సతిటా తెలిపారు. అయితే ఎందుకు తొలగించిందీ కచ్చితంగా చెప్పలేదు.
2018 ఏప్రిల్ 5న ఎఫ్‌ఎల్‌వో 34వ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో చందాకొచర్ గౌరవ అతిథిగా ఉంటారనీ మార్చి 31న జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 10మంది భారతీయ మహిళా ప్రముఖులను ఎఫ్‌ఎల్‌వో ఐకాన్ అవార్డులతో సత్కరించనున్నామని చెప్పింది. ఆరోగ్యం, సంక్షేమం రంగంలో ఎయిమ్స్ చీఫ్, ఆర్గాన్ రిట్రీవల్ అండ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ కు చెందిన ఆరతి విజ్, వినోద రంగంలో నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా, మీడియా ఎంట్రప్రెన్యూర్షిప్‌లో బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ డైరక్టర్ ఎక్తాకపూర్, డిజిటల్ వ్యాపారంలో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయక్, సాహిత్యంలో నమితా గోఖలే తదితరుల పేర్లను ఈ జాబితాలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment