సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. చందా కొచర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది, ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసుకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రేపు (మంగళవారం) సెషన్స్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తోపాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, అతని కంపెనీలపై జనవరి 22, 2019 న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, జనవరి 31న, ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ గ్రూపు 1,875 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నఆస్తులను విడుదల చేయాలని కోరుతూ దీపక్ కొచర్‌కు చెందిన పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల సీజ్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఈడీ ఎలాంటి చార్జ్ షీట్ దాఖలు చేయని కారణంగా సంస్థ ఆస్తులను విడుదల చేయాలని కోరింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ ఇలాంటి పిటిషన్ ఇప్పటికే బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వాదించింది. గత ఏడాది మార్చిలో, పసిఫిక్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈడీ దాడుల సందర్భంగా డైరీ, హార్డ్ డిస్క్తోపాటు 10.5 లక్షలరూపాయలను స్వాధీనం చేసుకుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ స్కాం బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు రేపింది. 3,250 కోట్ల రూపాయల కుంభకోణంలో క్విడ్ ప్రో కో కింద అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచర్ తన పదవిని కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment