
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్‌పై జరుగుతున్న విచారణ మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉందని, ఇది అదనపు వ్యయ భారాలకూ దారితీయవచ్చని ఆ బ్యాంక్ అభిప్రాయపడుతోంది. బ్యాంకు ప్రతిష్టకు ఈ ఉదంతం విఘాతం కలిగించే అంశమని కూడా భావిస్తోంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కు జూలై 31న సమర్పించిన ఒక ఫైలింగ్‌లో బ్యాంక్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కొచర్‌పై వచ్చిన వివిధ ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక దర్యాపు సంస్థను బ్యాంక్ ఆడిట్ కమిటీ జూన్‌లో ఏర్పాటు చేసినట్లూ బ్యాంక్ వివరణ ఇచ్చింది.
వ్యాపార నిర్వహణపై ప్రతికూల ప్రభావం
తన భర్త దీపక్ కొచర్ నియంత్రణలోని సంస్థలు, వీడియోకాన్ గ్రూప్ మధ్య లావాదేవీలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు, అవి మొండిబకాయిలుగా మారడం, వ్యక్తిగత లబ్ది తత్సంబంధ అంశాలకు సంబంధించి చందాకొచర్ ఆశ్రిత పక్షపాతం, క్విడ్ ప్రో కో ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘‘నియంత్రణ సంస్థల విచారణలను బ్యాంక్ ఎదుర్కొంటోంది. విచారణ మరింత లోతుకూ వెళ్లవచ్చు. ఇది బ్యాంకుపై అదనపు వ్యయభారాలను మోపుతుంది. వ్యాపార నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బ్యాంక్ ప్రతిష్టను దిగజార్చే ప్రమాదం ఉంది’’ అని ఎస్‌ఈసీకి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. ఆరోపణలు, వాటిపై విచారణల నేపథ్యంలో కొచర్ 2018 జూన్ 19 నుంచీ సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా సందీప్ బక్షీని బ్యాంక్ నియమించింది. కాగా, బ్యాంక్ అత్యుత్తమ పాలనా నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఐసీఐసీఐ కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment