![చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు](/styles/webp/s3/article_images/2017/09/5/61495826565_625x300.jpg.webp?itok=SKkjFvWD)
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం చందా కొచర్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 7.85 కోట్ల వేతనం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 64 శాతం అధి కం. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. ఆమె బేసిక్ శాలరీ 15 శాతం పెరిగి రూ. 2.67 కోట్లకు చేరింది. అంటే రోజువారీగా చూస్తే కొచర్ రోజుకు.. రూ. 2.18 లక్షల వేతనం అందుకున్నట్లవుతుంది. 2016–17లో ఆమె రూ. 2.2 కోట్ల బోనస్ అందుకున్నారు.
వసతి, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, నీరు, గ్రూప్ ఇన్సూరెన్స్, క్లబ్ ఫీజు, నివాసం వద్ద వినియోగించేందుకు ఫోన్, కారు, రీయింబర్స్‌మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీఏ), ప్రావిడెంట్ ఫండ్ మొదలైన వాటితో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ కలిపి రెమ్యూనరేషన్‌లో లెక్కేస్తారు. నెలవారీ కొచ్చర్ బేసిక్ శాలరీ రూ. 13,50,000– రూ. 26,00,000 శ్రేణిలో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక నివేదిక పేర్కొం ది. ప్రధాన సవాళ్లెదుర్కొంటూ.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని నివేదికలో కొచర్ తెలిపారు. బ్యాంకు పరిమాణం, భారీ స్థాయిలో నిధులు, వివిధ ఆర్థిక సేవలు అందిస్తుండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.