న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్ ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ... నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. రాజీనామా కాస్తా ఉద్వాసనగా మారడంతో ఆమె పొందిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్స్ మొదలైనవి రద్దవుతాయని తెలిపింది.
2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి దాకా చందా కొచర్ పొందిన బోనస్‌లన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వివాదం వెలుగు చూశాక చాన్నాళ్ల దాకా చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన బ్యాంక్... తాజాగా నివేదిక నేపథ్యంలో స్వరం మార్చడం గమనార్హం. ఈ వివాదంలో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ తదితరులపై సీబీఐ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ నైతిక నియమావళి, విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను చందా కొచర్ ఉల్లంఘించారని విచారణ నివేదికలో వెల్లడైంది’ అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆమె అశ్రద్ధ వల్ల బ్యాంక్ విధానాలు నిర్వీర్యమయ్యాయని ఆక్షేపించింది.
ఆకాశం నుంచి అధఃపాతాళానికి..
దేశీ రిటైల్ బ్యాంకింగ్ స్వరూపాన్ని మార్చేసిన అత్యంత శక్తిమంతమైన మహిళగా కొన్నాళ్ల క్రితం దాకా సర్వత్రా ప్రశంసలు అందుకున్న చందా కొచర్ .. వీడియోకాన్ రుణ వివాదంతో అప్రతిష్ట పాలైన సంగతి తెలిసిందే. 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈ లావాదేవీల ద్వారా చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారంటూ కొన్నాళ్ల క్రితం ప్రజావేగు ఒకరు బైటపెట్టడంతో ఈ కేసుపై అందరి దృష్టి మళ్లింది. బ్యాంకు నుంచి రుణం పొందిన వెంటనే వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ .. దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉండటం అనుమానాలు రేకెత్తించింది. ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ముందుగా చందా కొచర్‌ను వెనకేసుకొచ్చినప్పటికీ.. వివాదం మరింత ముదరడంతో వెనక్కి తగ్గింది. 2018 జూన్ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో సమగ్ర విచారణ కోసం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో పరిశీలించిన డైరెక్టర్లు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ.. ఇటీవలే చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్ తదితరులపై క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
షాకింగ్ నిర్ణయం
తనను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించాలన్న బ్యాంక్ బోర్డు నిర్ణయంపై చందా కొచర్ విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్ర నిరాశకు, షాక్‌కు గురిచేసిందన్నారు. బ్యాంకు మంజూరు చేసే రుణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలేవీ ఏకపక్షంగా ఉండవని ఆమె స్పష్టం చేశారు. ‘అంతిమంగా సత్యమే జయిస్తుందని నమ్ముతున్నాను. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో నేనెప్పుడూ వెనుకాడలేదు, ఒక ప్రొఫెషనల్‌గా ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు‘ అని చందా కొచర్ చెప్పారు.
లాభం 3% డౌన్
రూ. 1,605 కోట్లు ∙మొండిబాకీలకు పెరిగిన కేటాయింపులు
న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో 3 శాతం క్షీణించి రూ.1,605 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,650 కోట్లు. క్యూ3లో ఆదాయం రూ. 16,832 కోట్ల నుంచి రూ.20,163 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 5,705 కోట్ల నుంచి రూ.6,875 కోట్లకు పెరిగింది. ట్రెజరీ ఆదాయం కూడా రూ. 66 కోట్ల నుంచి ఏకంగా రూ.479 కోట్లకు ఎగియగా, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా నమోదైంది. మొండి బాకీలు క్షీణించినప్పటికీ.. వాటికి సంబంధించిన కేటాయింపులు రూ. 3,570 కోట్ల నుంచి రూ. 4,244 కోట్లకు పెరిగాయి.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే లాభం 1.1 శాతం క్షీణించి రూ. 1,874 కోట్లుగా నమోదైంది. అనుబంధ సంస్థల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు అసెట్ క్వాలిటీ మెరుగుపడినా.. మొండిబాకీలకు మరింత ప్రొవిజనింగ్ చేయాలని బ్యాంక్ భావించడమే ఇందుకు కారణం. మొత్తం ప్రొవిజనింగ్ 18.89 శాతం పెరిగింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తిని మెరుగుపర్చుకోవడం, గత మొండిబాకీల ప్రభావాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈవో సందీప్ బక్షి తెలిపారు.
2.58 శాతానికి ఎన్‌పీఏలు..
మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) స్వల్పంగా 7.82% నుంచి 7.75%కి తగ్గాయి. అటు నికర ఎన్‌పీఏలు 4.20 శాతం నుంచి 2.58 శాతానికి దిగివచ్చాయి. విలువపరంగా చూస్తే మాత్రం స్థూల ఎన్‌పీఏలు రూ. 46,038 కోట్ల నుంచి రూ.51,591 కోట్లకు పెరగ్గా, నికర మొండిబాకీలు మాత్రం రూ.23,810 కోట్ల నుంచి రూ. 16,252 కోట్లకు తగ్గాయి. బుధవారం బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 5.29 శాతం ఎగిసి రూ. 365.25 వద్ద క్లోజయ్యింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment