
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
ముంబయి: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకనుంచి ఇంటి దగ్గర ఉండి పనిచేసేందుకు వీలుగా అవకాశం తెచ్చిపెట్టింది. 'ఐ వర్క్@హోమ్' పేరిట ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చి తమ సంస్థకు చెందిన ఉద్యోగినులు ల్యాప్ టాప్ ద్వారా బ్యాంకు లావాదేవీలు చూసేందుకు వీలు కల్పించింది. ఈ విధానం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే మహిళలకు అమితంగా ఉపయోగపడనుంది.
తమ బ్యాంకులో పనిచేసే మహిళలకు పెద్దగా ఇబ్బందులు కలగకూడదని ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్ మాట్లాడుతూ తాము నిర్వహించిన సర్వేలో మహిళలు మెటర్నటీ కారణంగా విధులకు దూరం కావాల్సి వస్తుందని, ఇంకొందరైతే రాజీనామాలు చేస్తున్నారని గుర్తించామని చెప్పారు.
'ఇకపై మహిళలు ఇబ్బందుల కారణంగా విధులకు దూరం అయ్యే సమస్య లేకుండా ఓ బలమైన వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించాం. వర్క్ ఎట్ హోమ్ విధానం తెచ్చాం. ఇప్పటికే 50 మంది మహిళలు ఇలా పనిచేస్తున్నారు. మరో 125 మంది ఇలా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఇంటి దగ్గర ఉండి పనిచేసే వారి సంఖ్య త్వరలోనే 500కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీనామాలు చేసినవారు కూడా.. ఈ కొత్త విధానం చూసి వాటిని ఉపసంహరించుకునేందుకు ఆలోచిస్తారు' అని ఆమె చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకులో 30 శాతం మంది అంటే 73 వేల మంది మహిళలు పని చేస్తున్నారు.