ఐసీఐసీఐకి మొండి బకాయిల సెగ | Expect asset quality to improve in next few quarters: Chanda Kochhar, MD & CEO, ICICI Bank | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐకి మొండి బకాయిల సెగ

Published Sat, Jan 31 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

ఐసీఐసీఐకి మొండి బకాయిల సెగ

ఐసీఐసీఐకి మొండి బకాయిల సెగ

క్యూ3లో రూ. 3,265 కోట్లు; 14 % అప్
3.4 శాతానికి ఎగబాకిన మొండి బకాయిలు...
భారీగా క్షీణించిన షేరు ధర...
ముంబై: ప్రైవేటు రంగ బ్యాకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలతోపాటు మొండిబకాయిలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి(2014-15, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,265 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,872 కోట్లతో పోలిస్తే లాభం 13.7 శాతం వృద్ధి చెందింది.

ప్రధానంగా బీమా, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్ తదితర అనుంబంధ సంస్థల మెరుగైన పనితీరుతో లాభాలు పుంజుకున్నాయి. ఇక మొత్తం ఆదాయం కూడా క్యూ3లో రూ.20,543 కోట్ల నుంచి రూ.23,054 కోట్లకు వృద్ధి చెందింది. 12.2 శాతం పెరిగింది.
 
స్టాండెలోన్‌గానూ 14 శాతం అప్...
ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి(సాండెలోన్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ3లో 14.1 శాతం వృద్ధితో రూ.2,889 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,532 కోట్లు. మొత్తం ఆదాయం రూ.14,226 కోట్ల నుంచి రూ.15,526 కోట్లకు పెరిగింది. 8.8 శాతం వృద్ధి నమోదైంది.
 
మొండిబకాయిల సెగ...
ఈ డిసెంబర్ క్వార్టర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు(ఎన్‌పీఏ) వెంటాడాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 3.4 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఈ పరిమాణం 3.05 శాతమే. మరోపక్క, నికర ఎన్‌పీఏలు కూడా 1.76 శాతం నుంచి 1.9 శాతానికి పెరిగాయి. ఇక మొండిబకాయిలు, కంటింజెన్సీల కోసం ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.695 కోట్ల నుంచి రూ.980 కోట్లకు ఎగిశాయి. కాగా, ఈ క్యూ3లో కొత్తగా రూ.2,279 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందులో రూ.776 కోట్లు గతంలో పునర్‌వ్యవస్థీకరించిన రుణాలేనని కూడా తెలిపింది. కాగా, అక్టోబర్-డిసెంబర్ వ్యవధిలో రూ.1,755 కోట్ల రుణాలను బ్యాంక్ పునర్‌వ్యవస్థీకరిచింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం రూ.2,300 కోట్లుగా ఉంది.
 
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ3లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 13 శాతం పెరిగి రూ.4,812 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) కూడా స్వల్ప పెరుగుదలతో 3.46 శాతంగా నమోదైంది.
రిటైల్ రుణాల్లో 26 శాతం వృద్ధి దీనికి దోహదం చేసింది.
సబ్సిడరీల నుంచి అధిక డివిడెండ్‌ల కారణంగా ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.357 కోట్ల నుంచి రూ.538 కోట్లకు పెరిగింది. ఫీజుల రూపంలో ఆదాయం 6 శాతం పెరిగి రూ.443 కోట్లకు చేరింది.
సబ్సిడరీల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.428 కోట్ల నుంచి రూ.462 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ.76 కోట్ల నుంచి రూ.176 కోట్లకు వృద్ధి చెందింది.
⇒  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్(మ్యూచువల్ ఫండ్) సంస్థ లాభం 43 శాతం పెరగగా.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం రెట్టింపై రూ.76 కోట్లకు చేరింది.
క్యూ3లో కార్పొరేట్ రంగానికి రుణాల్లో 4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రుణాల్లో ఈ రంగానికి రుణాల వాటా 29 శాతానికి తగ్గింది. రిటైల్ రుణాల వాటా 41 శాతానికి ఎగబాకింది. కాగా, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నేపథ్యంలో కార్పొరేట్ల నుంచి రుణ డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది.
 
ఆర్థిక వ్యవస్థలో చాన్నాళ్లుగా కొనసాగుతూవస్తున్న మందగమన పరిస్థితులవల్లే మొండి బకాయిలు పెరిగేందుకు దారితీస్తోంది. ఫలితంగా పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు కూడా మళ్లీ ఎన్‌పీఏలుగా మారుతున్నాయి. ఇదేవిధమైన దోరణి మరో 2-3 త్రైమాసికాలపాటు కొనసాగవచ్చు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడితే.. కంపెనీల పనితీరు మెరుగుపడటమేకాకుండా.. మొండి బకాయిల సమస్యకు కూడా అడ్డుకట్టపడుతుంది.  

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం పరిశ్రమకు పోత్సాహకరమైన చర్య. మా బీమా సబ్సిడరీలో పెట్టుబడులకు సంబంధించి ఐపీఓ సహా ఇతరత్రా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. వడ్డీరేట్లు దిగొస్తాయని రుణగ్రహీతలు భావిస్తున్నారు. అయితే, మా బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు ఎప్పుడనేది వెల్లడించలేను. అసెట్స్ లయబిలిటీ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.
 - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ
 
షేరు ధర క్రాష్...
మొండి బకాయిల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర భారీగా క్షీణించింది. శుక్రవారం  బీఎస్‌ఈలో ఒకానొకదశలో 6.5 శాతం మేర దిగజారి రూ.355కు పడిపోయింది. చివరకు 4.95 శాతం నష్టంతో రూ.361 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క రోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్)రూ.10,839 కోట్లు ఆవిరై.. రూ.2,09,208 కోట్లకు తగ్గిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement