
ఐసీఐసీఐ లాభం 15% అప్
క్యూ2లో రూ.2,709 కోట్లు
అధిక వడ్డీయేతర ఆదాయం ఆసరా
26 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం;రూ.2,738 కోట్లు
పెరిగిన మొండిబకాయిలు...
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.2,738 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,352 కోట్లతో పోలిస్తే లాభం 15 శాతం ఎగబాకింది. ప్రధానంగా వడ్డీయేతర ఆదాయం భారీగా 26 శాతం దూసుకెళ్లి రూ.2,738 కోట్లను తాకడం లాభాల జోరుకు దోహదం చేసింది.
క్యూ2లో రిటైల్ ఫీజుల రాబడి 20 శాతం దూసుకెళ్లగా... ట్రెజరీ లాభం రూ.137 కోట్లు జమైనట్లు బ్యాంకు వెల్లడించింది. బ్యాంకు మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.14,889 కోట్లకు పెరిగింది. గతేడాది క్యూ2లో ఈ మొత్తం రూ.12,980 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూపంలో బ్యాంకు రూ.4,657 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది.
కన్సాలిడేటేడ్‌గా చూస్తే: బీమా, స్టాక్ బ్రోకింగ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే ఐసీఐసీఐ నికర లాభం రూ.3,065 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో నమోదైన రూ.2,698 కోట్లతో పోలిస్తే 14 శాతం పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ క్యూ2లో రూ.399 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఐసీఐసీఐ లాంబార్డ్ లాభం రూ. 158 కోట్లుగా నమోదైంది.
ఐసీఐసీఐ వెంచర్స్ వివాదం...
అనుంబంధ సంస్థ ఐసీఐసీఐ వెంచర్స్‌పై నెలకొన్న వివాదంపై వ్యాఖ్యానించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ, ఎండీ చందా కొచర్ నిరాకరించారు. తమకు అధిక రాబడులను అందిస్తామని చెప్పి... తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టిందంటూ ఈ ప్రైవేటు ఈక్విటీపై సుమారు 80 మంది ప్రవాస భారతీయ(ఎన్‌ఆర్‌ఐ) ఇన్వెస్టర్లు మారిషస్ సుప్రీం కోర్టులో 103 మిలియన్ డాలర్ల నష్టపరిహార దావా వేశారు. ఐసీఐసీఐ వెంచర్స్ తమను మోసం చేసిందని. పెట్టుబడులను దుర్వినియోగం చేసిందని వీరు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని కూడా కోరారు.
నికర మొండిబకాయిలు రూ.3,997 కోట్లు...
బ్యాంకు నికర మొండిబాకాయిలు(ఎన్‌పీఏ) మొత్తం రుణాల్లో 0.96 శాతానికి పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 0.73 శాతంగా ఉన్నాయి. సెప్టెంబర్ చివరికి నికర ఎన్‌పీఏలు రూ.3,997 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.3,474 కోట్లు, ఈ ఏడాది జూన్ చివరికి రూ.2,707 కోట్లుగా నికర ఏన్‌పీఏలు(0.87 శాతం) నమోదయ్యాయి. ఇక క్యూ2లో రూ.900 కోట్ల విలువైన మొండిబకాయిలను పునర్‌వ్యవస్థీకరించినట్లు బ్యాంకు వెల్లడించింది. ఎన్‌పీఏలు పెరగడంతో ప్రొవిజనింగ్ మొత్తం కూడా రూ.625 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది.
ఇతర ముఖ్యాంశాలివీ...
బ్యాంకు నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) క్యూ2లో 3.31 శాతం నుంచి 3.42 శాతానికి పెరిగింది.
సెప్టెంబర్ చివరికి బ్యాంకు మొత్తం రుణాలు రూ.3,61,757 కోట్లకు చేరాయి. డిపాజిట్లు రూ,3,52,055 కోట్లను తాకాయి.
క్యూ2లో కొత్తగా 52 బ్రాంచ్‌లను 292 ఏటీఎంలను బ్యాంకు ఏర్పాటు చేసింది.
బ్యాంకు షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 0.5 శాతం లాభపడి రూ.1,612 వద్ద స్థిరపడింది.