అతిపెద్ద దేశీ బ్యాంక్‌గా ఎదుగుతాం
ముంబై: వ్యాపార పరిమాణం, పనితీరులో కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఎదగనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లాభదాయక విధానంలో బ్యాంకును అగ్రస్థానానికి చేర్చాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీఐసీఐ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. మొత్తం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విషయానికొస్తే.. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ టాప్ స్థానంలో ఉంది.
తర్వాత స్థానంలో ఐసీఐసీఐ నిలుస్తోంది. 2009లో ఐసీఐసీఐ పగ్గాలు చేపట్టిన కొచర్.. ప్రఖ్యాత ‘4సీ’ వ్యూహాన్ని అమలుచేస్తూ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఈ వ్యూహం బాగానే విజయవతంమైందని.. పరిశ్రమ వృద్ధి రేటు కంటే ముందుండేందుకు ఇది తగిన పునాది వేసిందని కూడా కొచర్ పేర్కొన్నారు. అయితే, లాభాలను ఏమాత్రం త్యాగం చేయకుండానే, అదేవిధంగా అధిక రిస్క్‌లు ఉండే వ్యాపార విధానంలో కాకుండా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) డిపాజిట్లలో వృద్ధి, వ్యయ నియంత్రణ, మొండిబకాయిల మెరుగుదల, సరైన మూలధన నిర్వహణ.. ఈ నాలుగు అంశాల సమర్థవినియోగమే 4సీ వ్యూహంగా పేరొందింది. దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ కంటే 2-3 శాతం అధిక వృద్ధి రేటును సాధించడంపై దృష్టిపెట్టినట్లు కొచర్ చెప్పారు. ఏదో నామమాత్రంగా అగ్రస్థానానికి చేరాలన్నది తన ధ్యేయం కాదని... నిలకడైన లాభాల వృద్ధితో క్రమంగా దేశంలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాంకు పరిమాణం ప్రకారం కాకుండా మెరుగైన పనితీరు ఆధారంగా టాప్‌లోకి వెళ్లాలనేదే తమ లక్ష్యమన్నారు. అయితే, కచ్చితంగా ఈ స్థానాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె చెప్పారు.