CASA
-
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
అతిపెద్ద దేశీ బ్యాంక్‌గా ఎదుగుతాం
ముంబై: వ్యాపార పరిమాణం, పనితీరులో కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఎదగనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లాభదాయక విధానంలో బ్యాంకును అగ్రస్థానానికి చేర్చాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీఐసీఐ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. మొత్తం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విషయానికొస్తే.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ టాప్ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఐసీఐసీఐ నిలుస్తోంది. 2009లో ఐసీఐసీఐ పగ్గాలు చేపట్టిన కొచర్.. ప్రఖ్యాత ‘4సీ’ వ్యూహాన్ని అమలుచేస్తూ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఈ వ్యూహం బాగానే విజయవతంమైందని.. పరిశ్రమ వృద్ధి రేటు కంటే ముందుండేందుకు ఇది తగిన పునాది వేసిందని కూడా కొచర్ పేర్కొన్నారు. అయితే, లాభాలను ఏమాత్రం త్యాగం చేయకుండానే, అదేవిధంగా అధిక రిస్క్‌లు ఉండే వ్యాపార విధానంలో కాకుండా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) డిపాజిట్లలో వృద్ధి, వ్యయ నియంత్రణ, మొండిబకాయిల మెరుగుదల, సరైన మూలధన నిర్వహణ.. ఈ నాలుగు అంశాల సమర్థవినియోగమే 4సీ వ్యూహంగా పేరొందింది. దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ కంటే 2-3 శాతం అధిక వృద్ధి రేటును సాధించడంపై దృష్టిపెట్టినట్లు కొచర్ చెప్పారు. ఏదో నామమాత్రంగా అగ్రస్థానానికి చేరాలన్నది తన ధ్యేయం కాదని... నిలకడైన లాభాల వృద్ధితో క్రమంగా దేశంలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాంకు పరిమాణం ప్రకారం కాకుండా మెరుగైన పనితీరు ఆధారంగా టాప్‌లోకి వెళ్లాలనేదే తమ లక్ష్యమన్నారు. అయితే, కచ్చితంగా ఈ స్థానాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె చెప్పారు. -
27శాతం పెరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం
ముంబై: ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 27% వృద్ధిని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.1,560 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.1,982 కోట్లకు చేరింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ.10,146 కోట్ల నుంచి రూ.11,938 కోట్లకు పెరిగింది. ఈ సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో 3,731 కోట్ల నుంచి రూ.4,476 కోట్లకు చేరినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. కాని బ్యాంకు నికర వడ్డీ లాభదాయకత స్వల్పంగా క్షీణించగా, నిరర్ధక ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. ఈ సమీక్షా కాలంలో నికర వడ్డీ లాభదాయకత(నిమ్) 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గగా, స్థూల ఎన్పీఏ 1.04 శాతం నుంచి 1.09 శాతానికి పెరిగింది. నికర ఎన్పీఏ 0.3 శాతం వద్ద స్థిరంగా ఉంది.