ఐసీఐసీఐ ఫలితాలు ఆకట్టుకున్నాయ్ | ICICI Bank's net profit up 20% | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ఫలితాలు ఆకట్టుకున్నాయ్

Published Sat, Oct 26 2013 1:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

ఐసీఐసీఐ ఫలితాలు ఆకట్టుకున్నాయ్

ఐసీఐసీఐ ఫలితాలు ఆకట్టుకున్నాయ్

ముంబై: దేశీ ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం.. ఐసీఐసీఐ బ్యాంక్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో బ్యాంక్  స్టాండెలోన్ నికర లాభం రూ.2,352 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,956 కోట్ల లాభంతో పోలిస్తే 20.2 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ), ఫీజుల ఆదాయాలు, తక్కువ నిర్వహణ వ్యయాలు... లాభాల జోరుకు దోహదం చేశాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.12,069 కోట్ల నుంచి రూ.12,980 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి సాధించింది. క్యూ2లో బ్యాంక్ ఎన్‌ఐఐ 20 శాతం ఎగసి రూ.4,044 కోట్లకు దూసుకెళ్లింది. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.3,371 కోట్లు మాత్రమే. బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున రూ.2,167 కోట్ల నికర లాభం, రూ.3,955 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని అంచనా వేశారు.
 
 పెరిగిన మార్జిన్లు...
 ఇక నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) కూడా క్యూ2లో 3.31 శాతానికి పెరిగింది. బ్యాంక్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్థాయి మార్జిన్ కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌ఐఎం 3 శాతం మాత్రమే. మరోపక్క, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎన్‌ఐఎం లక్ష్యాన్ని 0.10 శాతం పెంచి 3.31 శాతంగా నిర్దేశించుకుంటున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఫీజుల రూపంలో ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్‌లో 17 శాతం ఎగసి రూ.1,996 కోట్లకు వృద్ధి చెందింది.
 
 ఎన్‌పీఏలు ఇలా...
 క్యూ2లో స్థూల మొండిబకాయిల నిష్పత్తి(ఎన్‌పీఏ) కాస్త తగ్గుముఖంపట్టి 3.08 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 3.54 శాతంగా ఉంది. స్థూలంగా రూ.1,100 కోట్ల విలువైన స్థూల మొండిబకాయిలు క్యూ2లో జతకాగా, పునర్‌వ్యవస్థీకరించిన రుణాల మొత్తం రూ.1,076 కోట్లుగా నమోదైంది. మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ మొత్తం గత క్యూ2లో రూ.508 కోట్ల నుంచి ఈ క్యూ2లో 625 కోట్లకు పెరిగింది. కాగా, నికర ఎన్‌పీఏలు 0.78 శాతం నుంచి 0.85 శాతానికి చేరాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఈ పరిమాణం 0.82 శాతం.
 
 ఇతర ముఖ్యాంశాలివీ...

  •  మొత్తం రుణాలు 16 శాతం వృద్ధి చెంది సెప్టెంబర్ చివరినాటికి రూ.3,17,786 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి క్యూ2లో 10 శాతంగా నమోదైంది.
  •  బీమా, బ్రోకింగ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలుపుకుంటే బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం క్యూ2లో 13 శాతం వృద్ధితో రూ.2,698 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం కూడా రూ.18,609 కోట్ల నుంచి రూ.19,016 కోట్లకు వృద్ధి చెందింది.
  •  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ.4,626 కోట్లు. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,771 కోట్లతో పోలిస్తే 22.64 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం రూ. 23,495 కోట్ల నుంచి రూ.25,885 కోట్లకు పెరిగింది. తొలి ఆరు నెలల్లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,467 కోట్ల నుంచి రూ.5,445కు(22 శాతం) ఎగసింది.
  •  శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్‌ఈలో క్రితం ముగింపు స్థాయిలోనే రూ.1,021.65 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో 0.14 శాతం స్వల్ప లాభంతో రూ.1,022.35 వద్ద ముగిసింది.

 
 సెప్టెంబర్ క్వార్టర్‌లో మెరుగైన పనితీరుకు ప్రధానంగా అధిక వడ్డీ ఆదాయం, ఫీజుల ఆదాయమే దోహదం చేసింది. కార్పొరేట్ రుణాలకు కాస్త దూరంగా ఉండటం, ఇదే సమయంలో రిటైల్ రుణాలపై మరింత ఎక్కువగా దృష్టిసారించాలన్న వ్యూహంతో బ్యాంక్ ముందుకెళ్తోంది. క్యూ2లో కార్పొరేట్ రుణాల వృద్ధి 11 శాతం కాగా, రిటైల్ రుణ వృద్ధి 20 శాతంగా నమోదవడమే దీనికి నిదర్శనం. ఇకపై కూడా ఇదే తీరును కొనసాగించడంపై దృష్టిపెడతాం.
 - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement