
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 11,053 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 24 శాతం ఎగసి రూ. 10,272 కోట్లను తాకింది.
నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 18,678 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.65 శాతం నుంచి 4.43 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం 20 శాతం పురోగమించి రూ. 5,975 కోట్లయ్యింది.
ఏఐఎఫ్‌ల ఎఫెక్ట్
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మదింపుచేస్తే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 627 కోట్లమేర దెబ్బతగిలినప్పటికీ ప్రొవిజన్లు రూ. 2,257 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. మొత్తం ఏఐఎఫ్‌లకు కేటాయింపులు చేపట్టినట్లు తెలియజేశారు. నిజానికి గతేడాది చేపట్టిన కంటింజెన్సీ ప్రొవిజన్లు, అవలంబించిన ప్రొవిజన్ విధానాలు కేటాయింపుల తగ్గింపునకు దోహదపడినట్లు తెలియజేశారు. కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం నికర లాభం రూ. 227 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. సాధారణ బీమా నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 431 కోట్లను తాకగా.. అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం నుంచి 30 శాతం అధికంగా రూ. 546 కోట్లు ఆర్జించింది. బ్రోకరేజీ బిజినెస్ నికర లాభం 66 శాతం దూసుకెళ్లి రూ. 466 కోట్లయ్యింది.
వారాంతాన బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1 శాతం బలపడి రూ. 1,008 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment