ముంబైలో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్ లావాదేవీలను ప్రారంభింబిస్తున్న చందా కొచర్
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్
• బ్యాంకింగ్‌కు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్
• మార్చి నాటికి 20 శాతం లావాదేవీలు లక్ష్యం
సాక్షి, బిజినెస్ బ్యూరో : ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ ఆటోమేషన్ విప్లవానికి నాంది పలికింది. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నది బ్యాంక్ లక్ష్యం. ఇందులో భాగంగానే ‘సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్’ లేదా ‘రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్’ను గురువారం ముంబైలో బ్యాంకు ఎండీ, సీఈఓ చందా కొచర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలను ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో ప్రత్యేకంగా పంచుకున్నారు. అవి...
• ఈ సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది?
ఒక ఉద్యోగి చేసే పనిని ఒక సాఫ్ట్‌వేర్ చేస్తుంది. విభిన్న పనులు చేయగల సత్తా వీటికుంది. ఫ్యాక్టరీల్లోనైతే రోబోటిక్స్‌తో వస్తువును ఒకచోటి నుంచి మరొకచోటకు తీసుకెళ్లొచ్చు. సాఫ్ట్‌వేర్ రోబోట్స్ అలాకాదు. కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఏకకాలంలో అనేక అప్లికేషన్స్‌ను నడిపిస్తాయి. మనుషులకన్నా 10 రెట్లు వేగంగా ప్రాసెస్ చేస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్‌ను బ్యాంకింగ్ లావాదేవీలకు వాడుతున్న తొలి దేశీ బ్యాంకు మాదే. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు వాడుతున్నాయి.
• ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు లక్ష్యమేంటి?
చాలా ఉన్నాయి. ఒకటి కస్టమర్లకు వీటితో వేగంగా సేవలు అందుతాయి. రెండవది.. దీనివల్ల మా ఉద్యోగులు విలువ ఆధారిత సేవలను అందించగలుగుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. బ్యాంక్ పరంగా చూస్తే... ఏటా మా రిటైల్ బ్యాంకింగ్ వృద్ధి రేటు 25 శాతంగా ఉంది. ఇది పెరుగుతుంది.
• రిటైల్ బ్యాంకింగ్ ఆటోమేషన్ వల్ల 2015-2025 మధ్య 30 శాతం బ్యాంక్ ఉద్యోగాలు పోతాయంటున్నారు. నిజమేనా?
గడచిన పదేళ్లుగా బ్యాంకింగ్‌లో ఐటీ వినియోగం పెరుగుతూనే వచ్చింది. అయినా 6-7 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. ఎన్‌బీఎఫ్‌సీలను కూడా లెక్కిస్తే ఈ సంఖ్య 30 లక్షల వరకూ ఉంటుంది. అంటే టెక్నాలజీతో పాటు ఉపాధి కూడా పెరిగింది. ఇక బ్యాంకింగ్ అనుబంధ పరిశ్రమల వల్ల కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. అంటే... టెక్నాలజీతో పాటు ఉపాధీ పెరుగుతుంది. కాకపోతే కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలి.
• ఆటోమేషన్‌తో ఏ లావాదేవీలు జరుగుతాయి?
రిటైల్ బ్యాంకింగ్, అగ్రి బిజినెస్, ట్రేడ్ అండ్ ఫారెక్స్, ట్రెజరీ, హ్యూమన్ రిసోర్సెర్స్ విభాగాల్లో తొలుత ఈ సేవలకు ప్రారంభించాం. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నది లక్ష్యం.
• సేవింగ్స్ ఖాతా, రుణాలు, కార్డ్ వినియోగదారులకూ దీంతో లాభం ఉంటుందా?
పలు విభాగాల్లో సేవల ప్రాసెసింగ్ సమయం గణనీయంగా 60 శాతం మేర తగ్గిపోతుంది. ఏటీఎం, 15జీ/హెచ్ ఫామ్‌ల ప్రాసెసింగ్‌లకు వీటిని వినియోగిస్తున్నాం. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ అలర్ట్స్‌కు మొబైల్ నంబర్ అప్‌డేషన్, రుణ రీపేమెంట్లకు ఈసీఎస్ ప్రెజెంటేషన్, ఆధార్ వివరాలు, దిగుమతి-ఎగుమతిదారు కోడ్ ధ్రువీకరణ ప్రక్రియ, డెబిట్ కార్డ్ పునఃజారీ వంటి కార్యకలాపాలకు తాజా టెక్నాలజీని వినియోగిస్తున్నాం.