నాలుగో స్థానంలో చందా కొచ్చర్
న్యూయార్క్: ప్రపంచ వాణిజ్య రంగంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ తాజాగా ప్రకటించిన బిజినెస్ వుమెన్ లీడర్స్ టాప్-50 జాబితాలో ఆమె నాలుగో ర్యాంక్లో నిలిచారు. గతేడాది పోలిస్తే కొచ్చర్ ఒక స్థానం మెరుగు పరుచుకున్నారు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ 17వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో చిత్రకు తొలిసారిగా స్థానం దక్కింది. ఏక్సిక్ బ్యాంక్కు చెందిన శిఖా శర్మ 32, హెచ్ఎస్బీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నైనా లాల్ కిద్వాయ్ 42 స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్ ఇంధన కంపెనీ పెట్రోబ్రాస్ సీఈవో మారియా దాస్ గ్రాకస్ ఫోస్టర్ అగ్రస్థానం దక్కించుకున్నారు. అమెరికా తరపున రూపొందించిన ఇదే జాబితాలో భారత నేపథ్యం కలిగిన పెప్సికో ఇండియా చీఫ్ ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు.