Fortune magazine
-
Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్ ఉమెన్
న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా వెలువడే అమెరికన్ బహుళజాతి వాణిజ్య మాస పత్రిక ‘ఫార్చూన్’ ఏటా ‘ది బెస్ట్’ అని, ‘ది గ్రేటెస్ట్’ అని ర్యాంకింగులు ఇస్తుంటుంది. సాధారణంగా ‘బెస్ట్’ అనే ర్యాంకింగ్ సంస్థలకు. ‘గ్రేటెస్ట్’ అనే ర్యాంక్ వ్యక్తులకు ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా ‘50 గ్రేటెస్ట్ లీడర్స్’ అంటూ.. కరోనా సంక్షుభిత ప్రపంచానికి వివిధ రంగాలలో విశేష నాయకత్వం వహించిన వారిలో యాభై మంది వ్యక్తులను ఎంపిక చేసి ఆ జాబితాను గురువారం విడుదల చేసింది. యాభైలో ఇరవై మందికి పైగా మహిళలే. వారిలో ఇద్దరు భారతీయ మహిళలు. ఒకరు డాక్టర్ అపర్ణా హెగ్డే. మరొకరు వర్షిణీ ప్రకాశ్. జాబితాలో అపర్ణ 15 వ స్థానంలో, వర్షిణి 28వ స్థానంలో నిలిచారు. డాక్టర్ అపర్ణ యూరోగైనకాలజిస్ట్. మహిళల మూత్రనాళ, మాతృ సంబంధ ఆరోగ్య సమస్యల చికిత్సలో నిపుణురాలు. ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా ఆమె కెరీర్ ఆరంభమైంది. గర్భిణులలో, తల్లీబిడ్డల్లో ఆకస్మికంగా తలెత్తే అత్యవసర ఆరోగ్య పరిస్థితులకు.. అవి నివారించగలిగినవే అయినా.. సకాలంలో వైద్యం అందక సంభవించిన మరణాలు ఎన్నిటినో ఆమె దగ్గరగా చూశారు. మంచి డాక్టర్లు, చురుకైన నర్సులు, అత్యాధునిక చికిత్సా సదుపాయాలు ఉండి కూడా గ్రామీణ ప్రాంతాల గర్భిణుల వరకు ఆ సేవలు, లేదా ఆ సేవల వరకు గర్భిణులు వెళ్లలేకపోతే ఏమిటి ప్రయోజనం? ఏదైనా చేయాలనుకున్నారు అపర్ణ. ఆమె స్వరాష్ట్రం కర్ణాటక. అక్కడి ఓ గ్రామంలోనే ఆమె జన్మించారు. ముంబై నుంచి ఊరికి వచ్చినప్పుడు ఓ రోజు.. ఉపాధి పనుల కోసం వెళుతున్న ఓ గిరిజన మహిళను చూశారు అపర్ణ. ఆమె చేతిలో మొబైల్ ఫోన్ ఉంది! ఎస్.. మొబైల్ ఫోన్‌తోనే వైద్యసౌకర్యాలకు, మారుమూల ప్రాంతాల గర్భిణులకు వారధి నిర్మించాలి అనుకున్నారు అపర్ణ. అలా 2008లో ఆవిర్భవించినదే ‘అర్మాన్’. మాతాశిశు మరణాలను తగ్గించడం కోసం, మహిళలకే ప్రత్యేకమైన అనారోగ్య సమస్యల నుంచి వారికి విముక్తి కల్పించడం కోసం అర్మాన్‌ను ఒక పెద్ద నెట్‌వర్క్‌గా నిర్మించుకుంటూ వచ్చారు అపర్ణ. లాభార్జన ధ్యేయం లేని సంస్థ కాబట్టి ఆరంభంలో నిధులు రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వమే భారీ భాగస్వామ్య సహకారంతో ముందుకు వచ్చింది. ప్రస్తుతం అర్మాన్ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో గర్భిణులకు ప్రసూతి సేవలతోపాటు, మహిళల మానసిక సమస్యలకు చికిత్సను అందిస్తోంది. గర్భస్థ, నవజాత శిశువు అనారోగ్యాలను నయం చేసి తల్లీబిడ్డలకు పునర్జన్మనిస్తోంది. ఈ పదమూడేళ్లలో అర్మాన్ 2 కోట్ల 40 లక్షల మంది మహిళలకు చేరువ కాగలిగింది. వీళ్లలో ఒక్కరు ఒక్క ఫోన్ కాల్ చేసినా అర్మాన్లోని సుశిక్షితులైన 1,70, 000 మంది స్థానిక ఆరోగ్య కార్యకర్తల్లో ఆ దగ్గర ఉన్నవారు వెంటనే వెళ్లి వాళ్లను కలుస్తారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా శ్రద్ధ తీసుకుంటారు. గత పదిహేను నెలలుగా అర్మాన్ బాధ్యత రెట్టింపైంది. ప్రసూతి వార్డులు కూడా కరోనా వార్డులుగా మారిపోవడంతో గర్భిణులకు అర్మాన్ విడిగా ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు చూడవలసి వస్తోంది. ‘దేశ భవిష్యత్తుకు జన్మనివ్వడం’ అనే నినాదంతో, తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణకు, సంక్షేమానికి కృషి చేస్తున్న అపర్ణను ఈ ఏడాది ‘గ్రేటెస్ట్ లీడర్స్’లో ఒకరిగా ఫార్చూన్ ఎంపిక చేయడానికి వైద్యసేవల రంగంలో, అదీ ఇప్పటి పరిస్థితుల్లో ఇంతకు మించిన గొప్ప కారణం ఏముంటుంది? వర్షిణీ ప్రకాష్ ప్రవాస భారతీయురాలు. బోస్టన్‌లో ఉంటారు. పుట్టడం, పెరగడం అంతా యూఎస్‌లోనే. వాతావరణ కార్యకర్త వర్షిణి. పరిశ్రమలు పెరగడం, చెట్లు కూలిపోవడం, ఆకాశం మసి బొగ్గు అవడం కళ్లారా చూస్తూ ఉన్న వర్షిణికి ఓ రోజు భయం కలిగింది. మనిషి భవిష్యత్ ఏంటి అనిపించింది. జనరేషన్ జడ్ అమ్మాయి వర్షిణి. శారా బ్లేజ్విక్ అనే తన ఫ్రెండ్‌తో కలిసి ‘సన్‌రైజ్ మూవ్మెంట్’ అనే సంస్థను ప్రారంభించారు. వాతావరణానికి హితం కాని చర్యల్ని లీగల్‌గా అడ్డుకోవడం ఈ సంస్థ పని. ఇందులో సైనికులంతా యువతీ యువకులే. ఇంత వయసనేం లేదు, పచ్చదనాన్ని కోరుకునే హృదయమైతే చాలు. పచ్చదనం అనే మాటకు పైపై అర్థం తీసుకోకండి. ‘ప్రజా విముక్తి పోరాటం’ అనే పెద్ద అర్థమే ఆ సంస్థకు ట్యాగ్ లైన్‌గా ఉంది. సంస్థ నినాదం కూడా అదే. వాతావరణంలోని ప్రతికూల మార్పులకు జాతి వివక్ష, లైంగిక అసమానత్వం, ఆర్థిక వ్యత్యాసాలు, భౌగోళిక పరిస్థితులు అన్నీ కారణమేనంటారు వర్షిణీ, శారా. ‘అర్మాన్’ కు ఇండియాలో అతి పెద్ద నెట్వర్క్ ఉన్నట్లే, సన్‌రైజ్ మూవ్‌మెంట్‌కు యూఎస్‌లో విస్తృతంగా యువసైన్యం ఉంది. వాళ్లంతా పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద హోదాల్లో ఉన్నవారు. సంస్థ 2017లో ప్రారంభమైంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్షిణి. శారా ట్రైనింగ్ డైరెక్టర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీళ్లు బైడెన్‌కు మద్దతుగా నిలబడ్డారు. అలాగని ఆయన్నేమీ పూర్తిగా సమర్థించలేదు. శిలాజ ఇంధన విరాళాలను పోగు చేసిన కొందరు రాజకీయ నాయకులకు బైడెన్ మద్దతు ఇవ్వడం వారికి నచ్చలేదు. ముఖాన్నే చెప్పేశారు. అలాగే ‘గ్రీన్ న్యూ డీల్’కి బైడెన్ ముఖం చాటేయడాన్ని కూడా వర్షిణి నిర్మొహమాటంగా విమర్శించారు. ఇది చాలదా ‘గ్రేటెస్ట్ లీడర్’ అవడానికి! వర్షిణితో పాటు శారాకు కూడా ఈ ‘గ్రేటెస్ట్’ ర్యాంకింగ్‌లో సగ భాగం ఇచ్చింది ఫార్చూన్. ఫార్చూన్ ‘50 గ్రేటెస్ట్ లీడర్స్’ తాజా జాబితాలో జసిండా ఆర్డెర్న్ (న్యూజీల్యాండ్ ప్రధాని) మొదటి స్థానంలో ఉన్నారు. మలాలాకు 31వ స్థానం దక్కింది. మహిళల్లో ఇంకా.. జెస్సికా టాన్, స్టేసీ అబ్రామ్, రెషోర్నా ఫిట్జ్‌ప్యాట్రిక్, డాలీ పార్టన్, విల్లీ రే ఫెయిర్లీ, కేట్ బింగ్హామ్, మెకన్జీ స్కాట్, డాక్టర్ యాలా స్టాన్ఫోర్డ్, టిమ్నిట్ గెబ్రూ, డయానా బెరెంట్, అడెనా ఫ్రైడ్మేన్, నికోల్ మేసన్, మేగన్ ర్యాపినో, ఫాజియా కూఫీ, నటాలియా రోడ్రిగ్స్, ఆరోరా జేమ్స్, నవోమీ ఒసాకా ఫార్చూన్ లిస్ట్‌లో ఉన్నారు. -
ఫార్చ్యూన్ నెక్స్ట్ 500లో జస్ట్‌డయల్, ఐఆర్సీటీసీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫార్చ్యూన్ నెక్స్ట్ 500 భారతీయ కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. జస్ట్ డయల్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఐఆర్సీటీసీ తదితర సంస్థల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీల్లో చాలా వరకూ మిడ్ సైజ్ కంపెనీలు. ఈ కంపెనీలను స్మాల్ వండర్స్‌గా ఈ మ్యాగజైన్ అభివర్ణించింది. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వివరాలు.., ♦ ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,693 కోట్ల వార్షిక ఆదాయంతో ఈ కంపెనీ ఈ ఘనత సాధించింది. ♦ ఆ తర్వాతి స్థానాల్లో నెక్టార్ లైఫ్‌సైన్స్(రూ.1,692 కోట్లు), ఓస్వాల్ ఉలెన్ మిల్స్(రూ.1,689 కోట్లు), వీఆర్ఎల్ లాజిస్టిక్స్(రూ.1,682.5 కోట్లు), హిటాచి హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్(రూ.1,682 కోట్లు)లు ఉన్నాయి. ♦ నెక్స్ట్ 500 జాబితాలోని మొత్తం కంపెనీల ఆదాయం రూ.5,14,788 కోట్లుగా ఉంది. ఒక్కో కంపెనీ సగటు ఆదాయం రూ.1,000 కోట్ల పైమాటే. ♦ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు వివిధ రంగాలకు చెందినవి. ఈ కంపెనీలు బేసిక్ మెటీరియల్స్, ఆర్థిక సేవలు, ఆహారం,వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇనుము, ఉక్కు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ♦ టాప్10లో ఉన్న కంపెనీల్లో కొన్ని-గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొ, లుకాస్-టీవీఎస్,గతి, అడెక్కో ఇండియా, జిందాల్ అల్యూమినియం, ♦ ఇండియన్ రైల్వేస్ టూరిజమ్ అండ్ కేటరింగ్ విభాగం ఐఆర్సీటీసీ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గత ఏడాది జాబితాలో 328గా ఉన్న ఈ కంపెనీ ర్యాంక్ ఈసారి జాబితాలో 199కు పెరిగింది. ♦ ఈ జాబితాలో తొలిసారిగా చేరిన యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి 442, జస్ట్ డయల్ కంపెనీకి 449 ర్యాంక్‌లు లభించాయి. ♦ ఇటీవలే ఐపీఓకు వచ్చిన నారాయణ హృదయాలయ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ కంపెనీలు ఈ జాబితాలో స్థానాలు సాధించాయి. -
ఫార్చ్యూన్లో ఒకే ఒక్క భారతీయుడు
దేశ రాజధాని నగరంలో కాలుష్యభూతాన్ని తరిమికొట్టడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (47) చేపట్టిన చర్యలు ఆయన్ని ప్రపంచ గొప్ప నాయకులలో ఏకైక భారతీయ నాయకుడిగా నిలిపాయి. ఫార్చ్యూన్ పత్రిక ప్రకటించిన మూడో వార్షిక అవార్డులో కేజ్రీవాల్ ఈ ఘనతను సాధించారు. ప్రపంచ గొప్పనాయకుల జాబితాలో 42వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించిన మూడో వార్షిక వరల్డ్ 50 గ్రేటెస్ట్ లీడర్ల జాబితాలో ఒక్క కేజ్రీవాల్‌కు మాత్రమే స్థానం లభించింది. దేశ రాజధాని నగరం కాలుష్య నియంత్రణలో సీఎం ప్రవేశపెట్టిన సరి-బేసి వాహనాల పద్ధతి తమకు నచ్చిందని పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, ప్రభుత్వం, దాతృత్వం, కళల లాంటి వివిధరంగాల్లో ప్రముఖంగా, ఆదర్శవంతంగా నిలిచిన వారి పేర్లతో ఈ జాబితాను ఫార్చ్యూన్ ప్రకటిస్తుంది. అమెరికా వ్యాపార దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, బెజోస్ వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచారు. జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు, ఆంగ్‌సాన్ సూకీ మూడు, పోప్ ఫ్రాన్సిస్ నాలుగో స్థానాలను దక్కించుకున్నారు. ఇక భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గె 50 వ ర్యాంకు సాధించారు. అటు కేజ్రీవాల్ తో పాటు దక్షిణ కరొలినాకు చెందిన భారతీయ అమెరికన్ గవర్నర్ నిక్కి హీలే 17వ స్థానంలో ఉండగా, హిందూ అమెరికన్ రేషం సౌజని 20వ ర్యాంకు సాధించారు. -
ఫార్చ్యూన్ 40లో అయిదుగురు భారతీయులు
న్యూయార్క్: వ్యాపార రంగంలో నలభై ఏళ్ల కన్నా తక్కువ వయసులోనే అత్యంత ప్రభావవంతమైన వారిగా ఎదిగిన 40 మంది జాబితాలో అయిదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన 40 అండర్ 40 లిస్టులో దివ్య సూర్యదేవర, వాస్ నరసింహన్, ఆనంద్ స్వామినాథన్, అపూర్వ మెహతా, రేష్మా సౌజనికి స్థానం దక్కింది. చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవర (36 ఏళ్లు) నాలుగో స్థానంలో ఉన్నారు. జీఎం అసెట్ మేనేజ్మెంట్ సంస్థలో 2013లో సీఐవో బాధ్యతలు చేపట్టిన ఆమె 2014లో సీఈవోగా ఎదిగారు. దాదాపు 80 బిలియన్ డాలర్ల అసెట్స్‌ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇక, ఏడో స్థానంలోని వాస్ నరసింహన్.. స్విస్ ఫార్మా దిగ్గజం నొవార్టిస్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశ్రమలోనే అత్యంత భారీ ఔషధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. 9,600 మంది ఉద్యోగులు, బిలియన్ల డాలర్ల విలువ చేసే 143 ప్రాజెక్టులు, 500 క్లినికల్ ట్రయల్స్ ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి. యాక్సెంచర్‌కి చెందిన ఆనంద్ స్వామినాథన్ 18వ స్థానంలో ఉన్నారు. ఆయన సారథ్యంలో 6 బిలియన్ డాలర్ల యాక్సెంచర్ డిజిటల్ విభాగం ఏటా 30 శాతం వృద్ధి సాధిస్తోందని ఫార్చ్యూన్ పేర్కొంది. దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇన్‌స్టాకార్ట్ సీఈవో అపూర్వ మెహతా 23వ స్థానంలో నిల్చారు. టెక్ సంస్థ గర్ల్స్ హు కోడ్ వ్యవస్థాపకురాలు రేష్మా సౌజని 39వ స్థానంలో ఉన్నారు. మహిళల్లో టెక్నాలజీ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఈ సంస్థకు.. గూగుల్, ట్వీటర్ వంటి టెక్ దిగ్గజాలు తోడ్పాటు అందిస్తున్నాయి. అగ్రస్థానంలో న్యూమన్.. ఇక, వుయ్వ ర్క్ సంస్థ సీఈవో ఆడమ్ న్యూమన్, టెస్లాకి చెందిన జేబీ స్ట్రాబెల్, ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రయాన్ గ్రేవ్స్ .. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో వరుసగా తొలి 3 స్థానాల్లో ఉన్నారు. కేవలం సంపదే ప్రామాణికం కాకుండా సాధించిన లక్ష్యాలు, ఆశయాలు, ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు మొదలైన వాటి ప్రాతిపదికగా ఈ జాబితా రూపొందించినట్లు ఫార్చ్యూన్ పేర్కొంది. హెల్త్‌కేర్, ఆటోమొబైల్, ఫైనాన్స్, రియల్టీ తదితర రంగాల వారికి ఇందులో చోటు దక్కిందని వివరించింది. -
ఫార్చ్యూన్ శక్తివంత మహిళల జాబితాలో చందా కొచర్ టాప్
రెండో స్థానంలో అరుంధతీ భట్టాచార్య ముంబై: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన ‘ఆసియా-పసిఫిక్ ప్రాంత శక్తివంతమైన మహిళల జాబితా’లో భారత బ్యాంకింగ్ రంగానికి చెందిన పలువురు మహిళలు స్థానం పొందారు. ఈ జాబితాలో ప్రైవేట్ రంగ బాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ చందా కొచర్ అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ఈమె తర్వాతి స్థానాన్ని (2వ స్థానం) దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య దక్కించుకున్నారు. భారత్‌లో ఐసీఐసీఐ బ్యాంకును విశ్వసనీయమైన, లాభదాయకమైన బ్యాంకుగా తీర్చిదిద్దడంలో చందా కొచర్ ప్రముఖ పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది. వీరితోపాటు ఈ జాబితాలో హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ నిషి వాసుదేవా (5వ స్థానం), యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ శిఖా శర్మ (9వ స్థానం) తదితరులు ఉన్నారు. -
మూడో అత్యంత శక్తివంత మహిళ ఇంద్రా నూయీ
న్యూయార్క్: పెప్సికో సీఈవో, భారత సంతతికి చెందిన ఇంద్రా నూయీ 2014 ఏడాదికి ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త(బిజినెస్ ఉమన్)గా ఎంపికైంది. ‘బిజినెస్ 2014 అత్యంత శక్తివంత మహిళలు’ పేరుతో ఫార్చూన్ పత్రిక తాజాగా జాబితాను విడుదల చేసింది. జాబితాలో తొలి రెండు ర్యాంకులను దక్కించుకున్న ఐబీఎం చైర్మన్ గిన్నీ రోమెట్టీ, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రాల సరసన మూడో స్థానంలో నూయీ నిలిచింది. ఈ బాటలో టాప్ పొజిషన్‌ను సాధించిన మహిళల్లో భారత సంతతికి చెందిన ఏకైక బిజినెస్ ఉమన్ గా నిలిచినట్లు కూడా ఫార్చూన్ పేర్కొంది. ఈ జాబితాలో చోటు చేసుకున్న సగం మంది మహిళలు భారీ సంస్థలను నిర్వహిస్తున్నారని, ఇది ఒక రికార్డని ఫార్చూన్ పేర్కొంది. కాగా, గతేడాది విడుదలైన ఫార్చూన్ జాబితాలో నూయీ రెండవ స్థానంలో నిలవడం గమనార్హం. అమెరికాలో అత్యధికంగా విక్రయమవుతున్న 50 ఆహార, పానీయాల ఉత్పత్తుల్లో 9 పెప్సీకోవే ఉంటున్నాయని ఫార్చూన్ వెల్లడించింది. -
చందా కొచర్ నంబర్ వన్
న్యూఢిల్లీ: భారత వ్యాపార రంగంలో శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మ, క్యాప్‌జెమిని ఇండియా సీఈవో అరుణ జయంతి త ర్వాత స్థానాల్లో నిల్చారు. 2013 సంవత్సరానికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ ఎండీ ప్రీతా రెడ్డి నాలుగో స్థానంలోను, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టాఫే) సీఈవో మల్లికా శ్రీనివాసన్ అయిదో స్థానంలోనూ ఉన్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న 50 మంది మహిళలతో ఫార్చూన్ ఈ జాబితాను రూపొందించింది. ఇందులో ఈసారి కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. బహుళ జాతి ఇంధన సంస్థ మొదలుకుని ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ చెయిన్ దాకా పలు దిగ్గజాల భారత కార్యకలాపాల నిర్వహణలో మహిళలు మరింత ప్రముఖంగా కనిపిస్తున్నారని ఫార్చూన్ మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. ఈ జాబితాలోని టాప్ టెన్‌లో హెచ్‌టీ మీడియా చైర్పర్సన్ శోభన భర్తియా, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా, ఏజెడ్‌బీ పార్ట్నర్స్ సహవ్యవస్థాపకురాలు జియా మోడీ, బ్రిటానియా ఎండీ వినీత బాలి, హెచ్ఎస్బీసీ ఇండియా కంట్రీ హెడ్ నైనా లాల్ కిద్వాయ్ ఉన్నారు. ఫార్చూన్ టాప్-10 చందా కొచర్ (ఐసీఐసీఐ బ్యాంక్) శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్) అరుణ జయంతి (క్యాప్ జెమిని) ప్రీతా రెడ్డి (అపోలో హాస్పిటల్స్) మల్లికా శ్రీనివాసన్ (టాఫే) శోభనా భర్తియా (హెచ్‌టీ మీడియా) కిరణ్ మజుందార్ షా (బయోకాన్) జియా మోడీ (ఏజడ్బీ) వినీతా బాలి (బ్రిటానియా) నైనాలాల్ కిద్వాయ్ (హెచ్ఎస్బీసీ) -
నాలుగో స్థానంలో చందా కొచ్చర్
న్యూయార్క్: ప్రపంచ వాణిజ్య రంగంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ తాజాగా ప్రకటించిన బిజినెస్ వుమెన్ లీడర్స్ టాప్-50 జాబితాలో ఆమె నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. గతేడాది పోలిస్తే కొచ్చర్ ఒక స్థానం మెరుగు పరుచుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ 17వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో చిత్రకు తొలిసారిగా స్థానం దక్కింది. ఏక్సిక్ బ్యాంక్‌కు చెందిన శిఖా శర్మ 32, హెచ్ఎస్బీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నైనా లాల్ కిద్వాయ్ 42 స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్ ఇంధన కంపెనీ పెట్రోబ్రాస్ సీఈవో మారియా దాస్ గ్రాకస్ ఫోస్టర్ అగ్రస్థానం దక్కించుకున్నారు. అమెరికా తరపున రూపొందించిన ఇదే జాబితాలో భారత నేపథ్యం కలిగిన పెప్సికో ఇండియా చీఫ్ ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు.