ఫార్చ్యూన్ శక్తివంత మహిళల జాబితాలో చందా కొచర్ టాప్
రెండో స్థానంలో అరుంధతీ భట్టాచార్య
ముంబై: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన ‘ఆసియా-పసిఫిక్ ప్రాంత శక్తివంతమైన మహిళల జాబితా’లో భారత బ్యాంకింగ్ రంగానికి చెందిన పలువురు మహిళలు స్థానం పొందారు. ఈ జాబితాలో ప్రైవేట్ రంగ బాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ చందా కొచర్ అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ఈమె తర్వాతి స్థానాన్ని (2వ స్థానం) దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య దక్కించుకున్నారు. భారత్‌లో ఐసీఐసీఐ బ్యాంకును విశ్వసనీయమైన, లాభదాయకమైన బ్యాంకుగా తీర్చిదిద్దడంలో చందా కొచర్ ప్రముఖ పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది. వీరితోపాటు ఈ జాబితాలో హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ నిషి వాసుదేవా (5వ స్థానం), యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ శిఖా శర్మ (9వ స్థానం) తదితరులు ఉన్నారు.