![Hyderabad figures among top 20 sustainable cities in Asia-Pacific - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/30/HYDERABAD.jpg.webp?itok=3VCZzb_J)
న్యూఢిల్లీ: వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన సస్టెయినబిలిటీ నిబంధనల అమలులో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ సహా నాలుగు భారత పట్టణాలు స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 20 పట్టణాల్లో హైదరాబాద్ 18వ స్థానంలో ఉంటే, బెంగళూరు 14వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 17, ముంబై 20వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు ‘ఏపీఏసీ సస్టెయినబిలిటీ ఇండెక్స్ 2021’ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సస్టెయినబిలిటీ అంటే సులభంగా పర్యావరణానికి, సమాజానికి అనుకూలమైన నిర్మాణాలని అర్థం. సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్‌బోర్న్ ఇండెక్స్‌లో టాప్–5 పట్టణాలుగా ఉన్నాయి.
పట్టణీకరణ ఒత్తిళ్లు, వాతావరణ మార్పుల రిస్క్, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ చర్యలను ఈ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకుంది. ‘‘నూతన మార్కెట్ ధోరణలు భారత్‌లో సస్టెయినబిలిటీ అభివృద్ధికి ప్రేరణగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రపంచం కర్బన ఉద్గారాల తటస్థ స్థితి (నెట్ జీరో)కి కట్టుబడి ఉండడం అన్నది పర్యావరణ అనుకూల భవనాలకు డిమాండ్ కల్పిస్తోంది. దీంతో భారత డెవలపర్లు ఈ అవసరాలను చేరుకునే విధంగా తమ ఉత్పత్తులను రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. సస్టెయినబిలిటీ, పర్యావరణ అనుకూల ప్రమాణాలతో కూడిన భవనాలకు డిమాండ్ పెరిగితే ఈ సదుపాయాలు సమీప భవిష్యత్తులోనే అన్ని ప్రాజెక్టులకు సాధారణంగా మారతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment