Sustainability
-
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
శరవేగంగా పరుగులు తీస్తున్న ఫ్యాషన్ : ఈ రోజు స్పెషల్ ఏంటంటే..!
ఫ్యాషన్ ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. క్రియేటివ్ డిజైన్లు, ఆర్టిస్టిక్ ఫ్యాషన్ సరికొత్త స్టైల్స్ నిరంతరం మారిపోతూనే ఉంటాయి. జూలై 9న ఫ్యాషన్డే గా జరుపుకుంటారని మీకు తెలుసా? పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఫ్యాషన్ ప్రభావాన్ని , ప్రాభవాన్నిఫ్యాషన్ పోకడలను అర్థం చేసుకోవడమే ఫ్యాషన్ డే ఉద్దేశం. ఫ్యాషన్ ఔత్సాహికులు, డిజైనర్లు, ఫ్యాషన్ ప్రియులందరికీ ఇది ఒక గొప్ప అవకాశాల్సి కల్పిస్తుంది. ఫ్యాషన్ సాంస్కృతిక ఔచిత్యంతో పాటు సృజనాత్మకత, సృజనాత్మకత, వాస్తవికతను గుర్తించి, డిజైనర్లు, ఫ్యాషన్ స్టయిల్స్‌ను అభినందించేందుకు ఫ్యాషన్ డే 2024ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పూర్వంనుంచీ మన ధరించే వస్త్రాలు ఒక స్టేటస్ సింబల్. ప్రస్తుతం ఫ్యాషన్ కళాత్మక వ్యక్తీకరణ మారింది. సామాజిక మార్పులతో పాటు ఫ్యాషన్లోకూడా విప్లవాత్మక మార్పు లొచ్చాయి. ఫ్యాషన్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదు. అలంకరణలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రతీది ఫ్యాషనే.ఫ్యాషన్ డే 2024: ధీమ్ఈ ఏడాది పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తూ, నైతిక, ఆలోచనాత్మక వినియోగాన్ని హైలైట్ చేసేలా 'సస్టెయినబుల్ ఎలిగాన్స్' అనే థీమ్‌తో ఫ్యాషన్ డే నిర్వహిస్తున్నారు. సుస్థిరత, ఫ్యాషన్ కలిసి జీవించే దిశగా ఫ్యాషన్ డే 2024ని జరుపుకుంటూ భూమా తరక్షణలో భాగం కావడం. -
అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి,రీ యూజబుల్ న్యాప్కిన్స్ తయారీ
‘ఎంత పెద్ద చదువులు చదివినా.. ఆర్థికంగా ఎంత ఎదిగినా మనసుకు తృప్తిగా లేకపోతే అందులో సహజత్వం లోపిస్తుంది. చేసే పనుల్లో నైపుణ్యం రాదు..’ అంటున్నారు హేమ. పర్యావరణహితంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండే రీ యూజబుల్ క్లాత్‌తో ప్యాడ్స్, పిల్లలకు డైపర్లు తయారు చేస్తూ, గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.తమిళనాడు, చిత్తూరు బార్డర్లో ఉన్న అతిమంజరీ పేట్లో ఉన్న హేమ తన ఉత్పత్తులతో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్‌లోని ప్రదర్శనశాలలో తన స్టాల్ ద్వారా పరిచయం అయ్యారు. అత్యంత నిరాడంబరంగా కనిపిస్తున్న ఆమె... అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసి, స్వదేశానికి వచ్చి తనను తాను పర్యావరణ ప్రేమికగా ఎలా మలచుకున్నారో, మరికొందరి మహిళలను ఎలా భాగస్వాములను చేస్తున్నారో వివరించారు. ‘‘మా ఊరిలో పన్నెండేళ్లుగా ఉంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వాడకంలో ఉన్న వస్తువులకు ప్రత్యామ్నాయ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. చాలా ఆలోచనలు చేశాక మహిళల రుతుక్రమ సమయంలో వాడే ప్యాడ్స్‌కు సంబంధించిన పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. అందులో భాగంగా 2020లో ‘కొన్నై’ పేరుతో మా ఉత్పత్తులన్నీ గ్రామంలోని మహిళలు, యువతతో కలిసి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసి, వారితో తయారుచేస్తున్నాను. మహిళలు, చంటిపిల్లలకు ఉపయోగపడే రీ యూజబుల్ ఉత్పత్తుల తయారీకి కొంతమందిని గ్రూప్‌గా చేసి వారి ఇళ్ల నుంచే, సౌకర్యవంతమైన సమయంలో తయారుచేసిచ్చేలా ప్రణాళిక చేశాను. చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది ఒక పార్ట్‌టైమ్ ఉపాధి లాగా కూడా ఉపయోగపడుతుంది. వాడకం సులువు..మృదువుగా, మన్నికగా ఉండటమే కాకుండా వాడిన తర్వాత రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఎండలో ఆరవేయవచ్చు. తిరిగి వీటిని వాడుకోవచ్చు. వెదురు కాటన్‌ను వాటర్‌ఫ్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో జత చేసి వీటిని తయారుచేస్తుంటాం. ఇవి సురక్షితంగానూ, అనుకూలంగానూ ఉంటాయి. తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్నీ నివారించవచ్చు. డిస్పోజబుల్ ప్యాడ్లలో రసాయనాల కారణంగా చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. మహిళలకు రీ యూజబుల్ క్లాత్ ప్యాడ్స్ మాత్రమే కాదు పిల్లలకు డైపర్లు, మ్యాట్లు, వైప్స్.. అన్నీ ఎకో ఫ్రెండ్లీవే తయారుచేస్తున్నాం. ఇవి మృదువుగా ఉంటాయి. కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. స్మాల్, మీడియమ్.. సైజులను బట్టి డిజైన్ల బట్టి ధరలు ఉన్నాయి.ఆర్డర్లను బట్టి ఒక్కొరికి రూ.5,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో ఇప్పుడు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. నేను ఆదాయం, రాబడి గురించి ఆలోచించడం లేదు. మునుముందు అందరూ పర్యావరణహితంగా మారాల్సిందే. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సొంత ఊరికి... మేం పన్నెండేళ్లు అమెరికాలో ఉన్నాం. నేనూ, మా వారు దేవ్ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేశాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక దశలో మాకు అక్కడ ఉండాలనిపించలేదు. మొత్తం కుటుంబంతో సొంత ఊరికి వచ్చేశాం. ఇక్కడే ఊళ్లో ఏడెకరాల భూమి కొనుగోలు చేశాం. అందులో ఎక్కువ శాతం రాగులు పండిస్తాం. ఆ పని అంతా మా వారు చూసుకుంటారు. ఎవరికి నచ్చిన పని వాళ్లు...అమెరికన్ సంస్కృతిలో పిల్లల మీద చదువుల ఒత్తిడి ఉండదు. పిల్లలకు ఏది ఇష్టమో, ఏ కళలో నైపుణ్యం సాధించాలనుకుంటారో దానిని వారే కనిపెట్టేలా, నైపుణ్యాలు సాధించేలా చూస్తారు. మేం కూడా పిల్లలను స్కూళ్లను, కాలేజీకి పంపించలేదు. హోమ్ స్కూలింగ్ అని మాకు గ్రూప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పిల్లలకు నచ్చినవి చదువుకుంటారు. తప్పనిసరిగా చదవాలనే నిబంధన పెడితే, మనసుకు ఇష్టంలేని దానిమీద వారెప్పటికీ ప్రావీణ్యులు కాలేరు. ఇవన్నీ ఆలోచించాం. పిల్లలకు ఏది ఇష్టమో అదే చేయమన్నాం. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఇరవై ఏళ్ల మా అబ్బాయికి శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. పద్దె నిమిదేళ్ల మా అమ్మాయి ఉడెన్ ఫర్నీచర్‌లో తన నైపుణ్యాలను చూపుతుంటుంది. నేను పర్యావరణ హితంగా ఉండే పనులు చేయాలనే ఆలోచనతో రీ యూజబుల్ న్యాపికిన్స్ పై దృష్టి పెట్టాను. మా విధానాలు మా ఇతర కుటుంబాల వారికి నచ్చుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టేవారే. తమకేది నచ్చుతుందో, ఏం చేయగలమో, ఎందులో సంతృప్తి లభిస్తుందో దానిని కనుక్కోలేరు. ప్రకృతి నీడన, నచ్చిన పనుల్లో భాగస్వాములం అవుతూ పర్యావరణహితగా జీవిస్తున్నాం. నా ఈ ఆలోచనను విరివిగా మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా రకరకాల క్రాఫ్ట్స్ మేళాలో పెడుతూ సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళుతున్నాను’ అని వివరించారు హేమ. – నిర్మలారెడ్డి -
ఆరోగ్యం, పోషకాలు కావాలంటే... దేశీ పంటలే కీలకం!
అధిక పోషకాలున్న దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ఇటు భూదేవి ఆరోగ్యంతో పాటు అటు ప్రజల, పర్యావరణ, పశుపక్ష్యాదుల ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని మనసా వాచా కర్మణా నమ్మిన ఆదర్శ రైతు గోగుల రాధాకృష్ణయ్య. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత 8 ఎకరాల సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించి తాను తింటూ, నలుగురికీ అందిస్తున్నారు. ఆయన క్షేత్రం ప్రకృతి వ్యవసాయదారులు, వ్యవసాయ విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణాలయంగా మారిపోయింది. ఈ ఏడాది జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆహ్వానం మేరకు గోగుల విజయవాడలోని రాజభవన్లో తేనేటి విందులో పాల్గొనటం విశేషం. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా ప్రకృతి సేద్యాన్ని రైతులందరికీ నేర్పించాలని సూచిస్తున్న 63 ఏళ్ల రాధాకృష్ణయ్య సేద్య అనుభవాల సారమిది.. వైస్సార్ జిల్లా బద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీ అబ్బుసాహేబ్ పేటకు చెందిన గోగుల రాధాకృష్ణయ్య కడప నీటి΄ారుదల శాఖలో సహాయ సాంకేతికత అధికారిగా పనిచేస్తూ 2013లో ఉద్యోగ పదవీ విరమణ చేశారు. వ్యవసాయంపై మక్కువతో తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం మొదలు పెట్టారు. రెండేళ్లపాటు సాధారణ రసాయనిక వ్యవసాయం చేసినా భూమి నిస్సారం కావటం వల్ల అంతగా ఆదాయం రాలేదు. ఆ దశలో 2017లో సుభాష్ పాలేకర్ వద్ద 5 రోజుల శిక్షణ ఉంది అధిక పోషక విలువలు కలిగిన దేశీ వరి వంగడాలతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రాధాకృష్ణయ్యకు 2017లో ప్రభుత్వం నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ షాపు మంజూరు చేసింది. దీంతో ఆయన కషాయాలు, వేప పిండి వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తూ, తానూ శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తొలుత 6 ఎకరాల్లో నవార, బర్మాబ్లాక్, పరిమళ సన్న, బహురూపి, మాపిళ్లై సాంబ 5 రకాల దేశీ వరిని సాగు చేశారు. రెండెకరాల్లో కరివే΄ాకు సాగు చేస్తున్నారు. తొలి రెండేళ్లు కరివే΄ాకు సాగు చేస్తూ ఏటా మూడు పంట కోతలు చేసేవారు. ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల సూచన మేరకు గత ఐదేళ్లుగా కరివేపాకు విత్తనోత్పత్తిపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం 2 ఎకరాల్లో దేశవాళీ వరి నవార రకాన్ని, 2 ఎకరాల్లో కరివే΄ాకు విత్తనోత్పత్తి చేస్తున్నారు. మిగతా 4 ఎకరాల్లో పరిమళ సన్న, సుంగధి, ఇంద్రాణి, కాలాభట్, మణిపూర్ బ్లాక్, బ్లాక్ బర్మా, బహురూపి, మాపిళ్లై సాంబ, సిద్ధ సన్నాలు, కుజిపటాలియా, రత్నచోళి, రత్నశాలి వంటి 14 రకాల దేశవాళీ వరిని సాగు చేస్తున్నారు. ఈ దేశీ వరి విత్తనాలను ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులకు కిలో 100–120 చొప్పున విక్రయిస్తున్నారు. వాట్సప్ వంటి సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. రెండెకరాల్లో నవార కేరళకు చెందిన పోషకాల గని వంటి నవార ధాన్యాన్ని రెండెకరాల్లో పండిస్తున్నారు రాధృకృష్ణయ్య. 6 నెలలు మాగబెట్టిన ధాన్యాన్ని మర పట్టించి కిలో రూ. 120–130 చొప్పున నవార ముడి బియ్యాన్ని రాధాకృష్ణయ్య అమ్ముతున్నారు. ఈ బియ్యం తిన్న షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ఆయన తెలి΄ారు. నవార బియ్యానికి మంచి డిమాండ్ ఉండటంతో ఈ ఒక్క రకాన్ని 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్లు నలుపుగా బియ్యం ఎరుపుగా ఉండే నవారను రబీ కాలంలో సాగు చేస్తే పడి΄ోకుండా ఉంటుందన్నారు. మనుషులతోనే నాట్లు, కోత, నూర్పిడి చేయిస్తానని, ఎకరానికి రూ. 21 వేల ఖర్చు వస్తోందన్నారు. ఎకరానికి 18 బస్తాల ధాన్యం పండుతోంది. 76 కిలోల ధాన్యం నుంచి 51 కిలోల ముడిబియ్యం దిగుబడి వస్తోందన్నారు. వాట్సప్ ద్వారా సమాచారం తెలుసుకొని ఆర్డర్లు ఇచ్చే వారికి ΄ార్శిల్ ద్వారా పంపుతున్నామన్నారు. కరివేపాకు విత్తనోత్పత్తి రాధాకృష్ణయ్య 2 ఎకరాల్లో కరివేపాకును 7 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఏటా మూడు సార్లు కరివే΄ాకు అమ్మేవారు. తరువాత ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనల మేరకు నాలుగేళ్లుగా కరివేపాకు విత్తనాలు ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. ఒక్కో ఎకరాకు 500 కిలోల వరకు కరివే΄ాకు విత్తనాల దిగుబడి వస్తుంది. ఎకరానికి 40-50 కిలోల నాణ్యమైన విత్తనం సరి΄ోతుందని, పండ్లను ఎండబెట్టకుండా చెట్టు నుంచి కోసిన ఒకటి, రెండు రోజుల్లోనే నాటుకోవాలని, ఇలా చేస్తే 90శాతం మొలక వస్తున్నదని రాధాకృష్ణయ్య తెలిపారు. ఖర్చులన్నీ పోను ఎకరానికి కనీసం రూ. 1,50,000 ఆదాయం పొందుతున్నానని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో΄ాటు బద్వేల్లోని బీబీఆర్ కళాశాలకు చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులకు గోగుల వ్యవసాయ క్షేత్రంలోనే శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం విశేషం. ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే దేశీ వంగడాలతో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులనే ఆహారంగా తినాలని ఆయన సూచిస్తున్నారు. – గోసల యల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా -
జీ20 అభివృద్ధికి మన స్టార్టప్ మార్గదర్శనం
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్‌లు ఇంజిన్‌గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్‌లకు మాత్రమే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో స్టార్టప్‌ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్‌ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్‌లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి. స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్‌లకు సహకారం అందించడం, స్టార్టప్‌లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్ రంగంలో నేడు 107 యునికార్న్‌లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగంగా గుర్తింపు పొందింది. కొత్తగా ప్రారంభించిన స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్–20 ఎంగే జ్మెంట్ గ్రూప్ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది: 1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్‌లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్‌ల కోసం హ్యాండ్ బుక్‌ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా, జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్– 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పెట్టుకుంది. 2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్‌లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్‌లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ స్టార్టప్ షోకేస్ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ వేదికగా పనిచేస్తుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్టప్‌లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్‌ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. (క్లిక్ చేయండి: గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?) - డాక్టర్ చింతన్ వైష్ణవ్ మిషన్ డైరెక్టర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్; స్టార్టప్–20 అధ్యక్షుడు -
కర్బనరహితంగా మ్యాక్రోటెక్!
న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్ రానున్న 5–7ఏళ్లలో 50 కోట్ల డాలర్లు(రూ. 3,950 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. సస్టెయినబిలిటీ చర్యల్లో భాగంగా అన్ని ప్రాజెక్టులపైనా నిధులను వెచ్చించనున్నట్లు లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కంపెనీ తెలియజేసింది. తద్వారా 2035కల్లా కర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది. నవీ ముంబై దగ్గర్లోని పాలవ సిటీ సమీకృత టౌన్షిప్ ప్రాజెక్టుకు ఆర్ఎంఐ నుంచి సాంకేతిక మద్దతును తీసుకుంటున్నట్లు పేర్కొంది. 4,500 ఎకరాలలలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును‘ లోధా నెట్ జీరో అర్బన్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్’కింద ప్రకటించింది -
సస్టెయినబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన సస్టెయినబిలిటీ నిబంధనల అమలులో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ సహా నాలుగు భారత పట్టణాలు స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 20 పట్టణాల్లో హైదరాబాద్ 18వ స్థానంలో ఉంటే, బెంగళూరు 14వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 17, ముంబై 20వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు ‘ఏపీఏసీ సస్టెయినబిలిటీ ఇండెక్స్ 2021’ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సస్టెయినబిలిటీ అంటే సులభంగా పర్యావరణానికి, సమాజానికి అనుకూలమైన నిర్మాణాలని అర్థం. సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ ఇండెక్స్‌లో టాప్–5 పట్టణాలుగా ఉన్నాయి. పట్టణీకరణ ఒత్తిళ్లు, వాతావరణ మార్పుల రిస్క్, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ చర్యలను ఈ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకుంది. ‘‘నూతన మార్కెట్ ధోరణలు భారత్‌లో సస్టెయినబిలిటీ అభివృద్ధికి ప్రేరణగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రపంచం కర్బన ఉద్గారాల తటస్థ స్థితి (నెట్ జీరో)కి కట్టుబడి ఉండడం అన్నది పర్యావరణ అనుకూల భవనాలకు డిమాండ్ కల్పిస్తోంది. దీంతో భారత డెవలపర్లు ఈ అవసరాలను చేరుకునే విధంగా తమ ఉత్పత్తులను రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. సస్టెయినబిలిటీ, పర్యావరణ అనుకూల ప్రమాణాలతో కూడిన భవనాలకు డిమాండ్ పెరిగితే ఈ సదుపాయాలు సమీప భవిష్యత్తులోనే అన్ని ప్రాజెక్టులకు సాధారణంగా మారతాయన్నారు. -
కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. వ్యూహాల్లో మార్పులు .. సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది. మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ తెలిపారు. -
ప్రతి రోజు పాలు తాగుతున్నారా.. అయితే తెలుసుకోండి!
మనిషి పుట్టుక మొదలు చనిపోయే వరకు అన్ని దశల్లోనూ పాల వాడకం ఉంటుంది. పాలు, పాల నుంచి వచ్చే పెరుగు, వెన్న నెయ్యి, తీపి పదార్థాలు అన్నీ మనిషి మనుగడకు ప్రధానం. గ్రామీణ జీవితంలో ప్రధాన ఆదాయ వనరు, ఎంతో మందికి జీవనాధారమైనది పాడి పంట. ఇక అమ్మ పాలు అమృతం. తల్లిపాలు ఎక్కువకాలం తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. పాలలో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి కాల్షియం, ప్రోటీన్‌తో సహా పెరుగుతున్న శరీరానికి సహాయపడతాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుకుంటారు. ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవ థీమ్ ‘పాడి రంగంలో సుస్థిరత’. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.. పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: పాలలో మనకు అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. దీనిని ‘‘ఫుల్ ప్రోటీన్’’ అంటారు. పాలలో లభించే రెండు రకాల ప్రోటీన్లు కాసిన్, పాలవిరుగుడు ప్రోటీన్. కాసిన్ రక్తపోటును తగ్గిస్తే, పాలవిరుగుడు ప్రోటీన్ మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది. పాలు తీసుకుంటే ఈ పోషకాలు మీ సొంతం: మనం తీసుకునే ఆహారంలో లభించని చాలా పోషకాలు పాలలో దొరుకుతాయి. వైట్ డ్రింక్ పొటాషియం, బి12, కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు సాధారణంగా చాలా ఆహార పదార్థాల్లో ఉండవు. కానీ ఇవి పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, బి1, బి2, పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. ఎముకలు దృఢంగా: పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ల వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాలను ప్రతి రోజు తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువును తగ్గిస్తుంది: పాలలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి బరువు తగ్గిస్తుంది. పాలతో ఆస్టియో ఆర్థరైటిస్‌కు చెక్: మోకాళ్లలో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌కు ప్రస్తుతం చికిత్స లేదు. అయితే ప్రతిరోజూ పాలు తాగడం ద్వారా ఈ వ్యాధిని అధిగమించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. క్యాన్సర్ నుంచి రక్షణ: పాలలో కాల్షియం, విటమిన్-డి ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాపడుతాయి. పెద్దపేగు క్యాన్సర్ లేదా పురీషనాళ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్షియం గట్ లైనింగ్‌ను కాపాడుతుంది. కణాల పెరుగుదల నియంత్రణలో విటమిన్-డి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జాగ్రత్త.. జీర్ణం కాకపోతే! అయితే కొంత మంది వ్యక్తులు పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. లాక్టోస్ అనేది పాల ఉత్పత్తులలో కనిపించే ఒక పదార్ధం. లాక్టోస్ అనేది పడకపోతే పాలను జీర్ణం చేసుకోవడం కష్టం. దీనివల్ల పాలు తాగిన తర్వాత కడుపులో ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!) -
అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ కార్ టీజర్
న్యూఢిల్లీ: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. అందుకుగాను మొదటి ఎలక్ట్రిక్ కారు ఈవి-6 మోడల్ టీజర్‌ను మంగళవారం కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారును ప్రపంచవ్యాప్తంగా మార్చి 15న ఆవిష్కరించబోతుంది. వినియోగదారులకు దీర్ఘకాలిక పరిష్కారాలను అందించడంలో భాగంగా కియా మోటర్స్ ‘ప్లాన్-ఎస్’ ప్రణాళికను జనవరిలోనే తెలిపిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా 2027 లోపు ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ ఉత్పత్తి చేయనుంది. కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహన శ్రేణుల్లో ‘ఈవి’తో మొదలుకానున్నాయి. దాంతో పాటు కియా లోగో కూడా మారబోతుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్న భారీ ఆదరణ నేపథ్యంలో కియా ఈ కొత్త ఇ-వాహనాన్ని తీసుకు రానుండటం విశేషం. The Kia EV6. Bold, original and innovative. Get ready to be inspired. Focus. The full design of the Kia EV6 will be unveiled on 15 Mar.#Kia #EV6 #MovementThatInspires #KiaEV6 pic.twitter.com/evB4TDYAly — Kia Worldwide (@Kia_Worldwide) March 8, 2021 -
కేరాఫ్ పాలగుట్టపల్లె
పాలగుట్ట పల్లె గురించి వెతికితే ఒకప్పుడు ఎలాంటి సమాచారం తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు పాలగుట్టపల్లెకు కాటన్ బ్యాగ్స్ ఒక ఉనికిని తీసుకువచ్చాయి. చిత్తూరు జిల్లాలోని పాకాల చెంతనే ఉండే ఈ పల్లెకు బ్యాగ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఆ పల్లెలో సుమారు అరవై కుటుంబాలు ఉంటాయి. ఆడా,మగ అందరూ వ్యవసాయ కూలీలే. పశువులు, కోడీ, మేకా వారి మరో జీవనాధారం. వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు.. వాటిలో కూలి పనులు. లేదంటే అవీ లేవు. అలాంటి చోట.. ‘మేం ఇటీవల తయారు చేసిన బ్యాగులలో బాగా ప్రాచుర్యం పొందింది చిన్న చిన్న కంపార్ట్మెంట్లతో కూడిన బలమైన కాన్వాస్ వెజిటబుల్ బ్యాగ్. మార్కెట్‌కు వెళ్లినప్పుడు అన్ని కూరగాయలను ఒక సంచిలో వేయించుకుంటాం. టొమాటోల మీద బంగాళదుంపలు వేశామనుకోండి.. టొమాటోలు ఇక అంతే. అలా కాకుండా దేనికది విడిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పుట్టుకొచ్చిందే కంపార్ట్మెంట్ కాన్వాస్ బ్యాగ్. ఇవే కాదు స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, షాపుల్లోకి బ్యాగులు, పౌచులు.. ఆర్డర్ల మీద తయారుచేసి ఇస్తున్నాం.’ అని ఆనందంగా వివరించారు రూప, అన్నపూర్ణ. మూడేళ్లుగా మొత్తం తొమ్మిది మంది గ్రూప్‌గా వందలాది బ్యాగుల తయారీలో నిమగ్నమై ఉంటున్నారు. వంద బ్యాగులతో మొదలు ‘కూలిపనులకు వెళ్తే గిట్టుబాటు కూలీ దొరికేది కాదు. మగవాళ్లు కొద్దోగొప్పో సంపాదిస్తే అది తిండికే సరిపోయేది. మా ఊళ్లో నలుగురు ఆడవాళ్లు మాత్రం మిషన్ మీద బ్లౌజులు కుట్టుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడు అపర్ణామేడమ్ వచ్చి ‘మీరు బ్యాగులు కుట్టగలరా..’ అని అడిగింది. సంతోషంగా మూడేళ్ల కిందటి వివరాలు చెప్పుకొచ్చారు రాణి, కళావతి. అపర్ణ కృష్ణన్ కుటుంబం పాతికేళ్ల కిందట సేంద్రీయ వ్యవసాయం చేయడానికి పాలగుట్టపల్లెకు వచ్చారు. వారిది చెన్నై. ‘మేడమ్ చుట్టుపక్కల అంతా చూస్తూ మా వద్దకు వచ్చి, పరిచయం చేసుకున్నారు. మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి గురించి అడుగుతుంటేవారు. మాకు, మా పిల్లలకు ఆయుర్వేద మందులు, పిల్లలకు పాలలో కలపడానికి అశ్వగంధచూర్ణం.. వంటివి ఇచ్చి వెళుతుండేవారు. మూడున్నరేళ్ల క్రితం ‘హైదరాబాద్‌లో తెలిసినవాళ్లు కాటన్ బ్యాగ్‌లు కావాలని అడిగారు, కుట్టగలరా?’ అన్నారు. అప్పుడు ఆ మేడమే అడ్వాన్స్‌గా డబ్బు ఇచ్చింది. కాటన్ క్లాత్ కొనుక్కొచ్చి 100 బ్యాగులు కుట్టి ఇచ్చాం’ అని వివరించింది రూప. ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ పనులు కాస్త ముతకగా ఉండే కాటన్ బ్యాగ్‌లు అంతటా దొరకవచ్చు. ‘కానీ, మా పల్లెకే ప్రత్యేకమైన బ్యాగులు ఉండాలనుకున్నాం. అప్పుడు అపర్ణామేడమే ఆ బ్యాగుల మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ ఉంటే ఆకట్టుకుంటాయి అని చెప్పారు’ వివరించింది అన్నపూర్ణ. అప్పుడు మేడమ్ సూచనతో మాలో నలుగురం చెన్నైకి వెళ్లి ప్రింట్లు ఎలా చేస్తారు, వాటిని బ్యాగ్ మీద ఎలా వేస్తారో .. వర్క్ నేర్చుకున్నాం. అలా బ్యాగుల మీద నెమలి, గణపతి బొమ్మలు, ఆర్డర్లు ఇచ్చే కంపెనీల లోగోలు.. ప్రింట్లు వేసి, కుట్టి పంపుతున్నాం. దీంతో మా బ్యాగ్స్‌కు ఇంకా మంచి పేరు వచ్చింది. ముందు ముగ్గురం, నలుగురం ఈ పనిలో ఉండేవాళ్లం. ఉత్తరప్రదేశ్‌లో ఆర్గానిక్ కాంగ్రెస్‌కు 2000 బ్యాగులు ఆర్డర్ రావడంతో మరో ఆరుగురం కలిశాం. ఆ తర్వాత ఆరు పాకెట్లతో ఉన్న వెజిటబుల్ బ్యాగులు కుట్టి ఫేస్బుక్, వాట్సప్‌లో పెట్టాం. వీటికీ బాగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, దుబాయ్, ముంబయ్‌కి కూడా ఆర్డర్ల మీద మా బ్యాగులు వెళుతున్నాయి. రెండు నెలల నుంచి ఆర్గానిక్ సరుకులు అమ్మే షాప్‌లకు బ్యాగులు కుట్టి పంపిస్తున్నాం’ అని వివరించింది ఈ తొమ్మిది మంది బృందం. నెలవారీగా ఆర్డర్లు రెండేళ్ల క్రితం పాలగుట్టపల్లె నుంచి బ్యాగులు గోవా ఎగ్జిబిషన్‌కు వెళ్లాయి. దీనికి అపర్ణతోపాటు లావణ్య, విఘ్నేశ్వరన్లు కూడా సాయం చేస్తున్నారు. మొదట్లో వచ్చిన డబ్బుతోనే ఇప్పటివరకు రొటేషన్ చేస్తూ వచ్చారు. కాటన్ క్లాత్, పెయింటిగ్ మధురై నుంచి తెప్పించుకుంటారు. కుట్టుపని, ప్యాకేజీ పనులన్నీ వాళ్లే చూసుకుంటారు. ఆ ఊరికి బస్సు, ఆటో సౌకర్యం కూడా లేదు. ‘కొంచెం చీకటి పడిందంటే ఆటో ఛార్జీలు పెంచుతారు. అందుకే రేపు బ్యాగులు పోస్టులో వెళ్లాలి అంటే ఈ రోజే ఆటో అతనికి చెబుతాం. ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజులు కూడా కుట్టాలనుకుంటున్నాం. బ్యాగులకు ఎంబ్రాయిడరీ చేస్తున్నాం కాబట్టి బ్లౌజులు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాం..’ అని చెప్పారు లక్ష్మీకాంత, ప్రమీల. సైజ్, మోడల్‌ను బట్టి ధరలు అప్పటి వరకు వ్యవసాయ పని, పశువులు పెంపకం తప్ప వేరే నైపుణ్యం లేదు వారికి. అలాంటి వారు స్క్రీన్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. కొత్త కొత్త డిజైన్ల కోసం కోలాం నమూనాలను అనుసరించారు. దీంతో అపర్ణా కృష్ణన్ పాలగుట్టపల్లె బ్యాగ్స్ పేరుతో వెబ్సైట్, ఫేస్బుక్ పేజీ ద్వారా ఫైనాన్స్ సోర్స్‌ను ఏర్పాటు చేసి మార్కెటింగ్ వారితో ఈ బృందానికి ఒక మాధ్యమం ఏర్పడేలా సాయం చేశారు. మిగతావన్నీ .. జాబితాను నిర్వహించడం, క్లాత్ కొనడం, డిజైన్ చేయడం, పాత బియ్యం బిస్తాలలో సంచులను ప్యాక్ చేయడం, పోస్ట్ చేయడం, పనిని విభజించుకోవడం, ఆదాయాలను పంచుకోవడం.. అన్నీ ఇక్కడి మహిళలే చేస్తారు. బ్యాగు సైజ్, డిజైన్ బట్టి ధరలు ఉన్నాయి. – నిర్మలారెడ్డి ఫొటోలు: టి. తులసీరామ్, సాక్షి, పాకాల, చిత్తూరు రెండేళ్ళ కిందట నోయిడాలో జరిగిన ఆర్గానికి వరల్డ్ కాంగ్రెస్‌కు 2000 బ్యాగులను సప్లయ్ చేశారు. మొదటిసారి పొందిన పెద్ద ఆర్డర్ అది. ఆ తర్వాత ఏడాదికి గోవాలో జరిగిన హ్యాండ్లూమ్ ఎక్స్పో∙ఆర్డర్ వచ్చింది. ఇటీవల అమెరికాకు కూడా ఆర్డర్ ద్వారా వీరి బ్యాగులు వెళ్లాయి. తమిళనాడులోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పాలగుట్టపల్లె బ్యాగులు తెప్పించుకుంటున్నాయి. డిజైన్ బట్టి ఒక్కో బ్యాగ్ ధర రూ.20 నుంచి ఉన్నాయి. ఈ బ్యాగుల కోసం ఆన్లైన్ ద్వారా నేరుగా ఆర్డర్లు ఇవ్వచ్చు. పాలగుట్టపల్లె కాటన్ బ్యాగ్‌లకు ఇంత పేరు రావడానికి కారణం ఈ మహిళలు ఎంచుకున్న నాణ్యతే ప్రధానం. మొదట కొంత మొత్తం లోన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత వారి రాబడి పెరుగుతూ ఉండటంతో ఆ మొత్తం తీర్చేశారు. పల్లెటూరి మహిళలు నాణ్యమైన వస్తువులను అందించడంలో ముందుంటారు. వీరికి రూరల్ డెవలప్మెంట్ కింద ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలను చూస్తారు. – అపర్ణాకృష్ణన్ -
నీటి కాపరి!
మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తికి కెంపెగౌడ జీవితం గొప్ప నిలువుటద్దం. గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే ఈ సామాన్యుడు.. మూగ జీవాల దాహం తీర్చడానికి తన విశ్వరూపం చూపాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనంతట తానే కొండపైన చెరువును సృష్టించాడు. ఆ నీటితో జీవాలు దాహం తీర్చుకుంటూ ఉంటే ఆయన కడుపు నిండిపోతోంది. ఆ ఆనందమే అతనితో నలభయ్యేళ్లలో మరో 13 చెరువులు తవ్వించింది. ఒకటి తర్వాత మరొకటిగా 14 గొలుసు చెరువులు తవ్వాడు. అంతేకాదు ఇప్పుడు మరొకటి తవ్వే ప్రయత్నంలో ఉన్నాడు! సంకల్ప బలం, పట్టుదలతో కొండంత ఎదిగిన కెంపెగౌడ కథ ఇదీ.. బెంగళూరు–మాళవళ్లి–కొళ్లేగల్ రోడ్డు మీదుగా దేవాలయాలు సందర్శించేందుకు, చామరాజనగర్ జిల్లా ఎతై న కొండ ప్రాంతాలను చూసేందుకు వెళ్లే వారికి దారిలో కెంపెగౌడ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అక్కడి అందరికీ ఆయన తలలో నాలుక వంటి వారు కావడమే అందుకు కారణం. ఆయన పేరు, కథ విన్నవారెవరైనా సెల్యూట్ చేసి తీరాల్సిందే. ‘మ్యాన్ ఆఫ్ లేక్స్’గా పేరుగాంచారు కెంపెగౌడ. కర్ణాటకలోని మండ్య జిల్లా మాళవళ్లి తాలూకాలోని దాసనదొడ్డి అనే ఒక కుగ్రామంలో కెంపెగౌడ పుట్టారు. ఆ గ్రామంలోని వారంతా గొర్రెల కాపరులే. 82 ఏళ్ల కెంపెగౌడను కలవాలంటే దాసనదొడ్డి గ్రామానికి వెళితే సరిపోదు.. ఆ గ్రామానికి శివార్లలో ఉన్న కుందినిబెట్టా అనే కొండ ప్రాంతానికి వెళ్లి చూడాలి. ఎందుకంటే రోజులో 12 గంటలపాటు ఆయన అక్కడే ఉంటారు. అక్కడ తన 50 గొర్రెలను కాస్తూనో లేదా మొక్కలను నాటుతూనో లేదా చెరువులను తవ్వుతూనో కనిపిస్తారు. ఆయన కుమారులు పేదరికంతో ఆ కుగ్రామంలోనే నివసిస్తున్నారు. వారికున్న ఏకైక జీవనాధారం గొర్రెల పెంపకమే. కెంపెగౌడ సాదాసీదా రైతు, గొర్రెల కాపరిలాగే ఉన్నాడు. ఒకే చొక్కాతో ఆయన ఎప్పుడూ ఆ కొండపైనే ఉంటాడు, ఇతరులు ఇచ్చిన దుస్తులనే ధరిస్తూ ఉంటాడు. తనకంటూ కొత్త చొక్కాలు కొనుక్కోడు. చాలా అరుదుగా గడ్డం చేసుకుంటాడు. ఒక చేతి కర్ర సహాయంతో కెంపెగౌడ నడుస్తూ కనిపిస్తాడు. కెంపెగౌడకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా రాగి ముద్ద, అంబలి, రొట్టె.. మొత్తంగా చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్నే భోజనంగా తీసుకుంటాడు. కుందినిబెట్టా కొండ ప్రాంతంలో కెంపెగౌడ ఇప్పటికి సొంత ఖర్చు, శ్రమతోనే 14 చెరువులను తవ్వాడు. 2017 వరకు మొత్తం 6 చెరువులు తవ్వాడు. కొండ మీదకు రోడ్డు వేసిన తర్వాత మిగిలిన 8 చెరువులను ఒక్క ఏడాదిలోనే తవ్వించాడు. గొర్రెలకు దాహం తీర్చడం ఒక్కటే లక్ష్యమైతే ఒకటి, రెండు తవ్వి ఆపేసేవాడే. దాంతోపాటు ప్రకృతి చెట్టు చేమలతో పచ్చగా ఉండాలన్న ఉదాత్త లక్ష్యంతో చెరువులను తవ్వుకుంటూ వెళుతున్న ఆయనకు కెరే (చెరువులు) కెంపెగౌడ అని చుట్టుపక్కల వారు పేరు పెట్టారు. కెంపెగౌడ నిస్వార్థ సేవను గుర్తించి పలువురు నగదు బహుమతులు ఇస్తున్నారు. ఆ డబ్బును కూడా కెంపెగౌడ సొంత అవసరాలకు ఉపయోగించకుండా చెరువులు నిర్మించేందుకే వినియోగిస్తున్నాడు. చెరువులు తవ్వేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, కూలి ఖర్చులకు ఆ డబ్బునే వినియోగిస్తూ మరిన్ని చెరువులను తవ్వుతున్నాడు. గొర్రెలకు దాహం తీర్చేందుకు... కెంపెగౌడ 40 ఏళ్ల క్రితం తొలి చెరువును నిర్మించాడు. గొర్రెలు, మేకలను మేపేందుకు తాను కొండపైకి తీసుకెళ్తుండేవాడినని, మేత మేసిన తర్వాత వాటికి తాగడానికి నీరు దొరికేది కాదు. చుట్టుపక్కల చెరువులు కానీ, కాల్వలు కానీ లేకపోవడంతో వాటి దప్పిక ఎలా తీర్చాలనే బెంగ కెంపెగౌడకు పట్టుకుంది. తాగు నీరు లేకపోవడంతో క్రూరమృగాల సంచారం కూడా చాలా తక్కువగా ఉండేది. పశువులు ఒకవైపు మేత మేస్తుంటే కెంపేగౌడ మాత్రం చెరువును తవ్వేవాడు. తొలినాళ్లలో అక్కడి స్థలాన్ని తవ్వేందుకు కట్టెనే ఉపయోగించాడు. తొలిసారి నేలను తవ్వినప్పుడు అదృష్టం కొద్ది అడుగుల్లోనే నీరు బయటకు వచ్చింది. చెరువు తవ్వేందుకు తనకు నెలలకు నెలలు సమయం పట్టేది. చెరువులో నీరు పడ్డాక వెంటనే దానికి అనుసంధానంగా మరో చెరువును తవ్వడం ప్రారంభించాడు. కట్టెతో తవ్వడం ఎంతో ఇబ్బందిగా ఉండి పని సరిగ్గా సాగకపోవడంతో, కొన్ని గొర్రెలను అమ్మేసి ఆ సొమ్ముతో ఇనుప పనిముట్టును కొనుగోలు చేశాడు. తొలి చెరువు తవ్వాక గొర్రెల దాహార్తి తీరడంతో చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత దాని వాలులో ఒక్కొక్కటిగా 14 చెరువులు తవ్వాడు. నిరక్షరాస్యుడైన కెంపెగౌడ చెరువులను నిర్మించే కొద్దీ వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతికతలు, నీటి ప్రవాహ తీరు తదితర వివరాలన్నీ అర్థమయ్యాయి. ప్రస్తుతం ఆ 14 చెరువులు ఎలా అనుసంధానమై ఉన్నాయి. ఒక చెరువు నిండితే మరో చెరువుకు నీరు ప్రవహిస్తుంది. తొలి చెరువు ‘గోకర్ణ’... గత ఏడాది ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ ఆయన సమాజ సేవను గురించి తెలుసుకొని నగదు అందజేశాడు. ఆ డబ్బుతోనే కొండపైకి రోడ్డును నిర్మించాడు కెంపెగౌడ. ఆ రోడ్డు వేసిన తర్వాత సులువుగా మరికొన్ని చెరువులు తవ్వానన్నాడు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు వెళ్లడం వల్ల అన్ని చెరువులకూ జల కళ వచ్చింది. ఈ ఏడాది ఆ కొండపైనే 2 వేలకు పైగా అరటి మొక్కలు నాటాడు. కెంపెగౌడ చదువుకోలేదనే మాటే కానీ పురాణాలపై మంచి పట్టు ఉంది. ఆయన తవ్విన తొలి చెరువుకు ‘గోకర్ణ’ అని పేరు పెట్టుకున్నాడు. ఇక చెరువులను కలుపుతూ నిర్మించిన రోడ్డుకు రామలక్ష్మణ అని పేరు పెట్టాడు. 82 ఏళ్లలోనూ పూర్తి ఆరోగ్యం... 82 ఏళ్ల వయసులోనూ కెంపెగౌడ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. చాలా ఉత్సాహంగా వేగంగా కొండ ఎక్కుతూ, దిగుతూ కనిపిస్తాడు. ఉదయం 8 గంటలకు తన దినచర్యను ప్రారంభిస్తాడు. ఇటీవలే కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. గత 40 ఏళ్లుగా కెంపెగౌడ రోజుకి 12 గంటల పాటు కొండపైనే గడుపుతున్నాడు. ఉదయం కొండపైకి వెళితే తిరిగి రాత్రికే ఇంటికి తిరిగి వచ్చేవాడు. ప్రభుత్వం ఆ కొండను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని పలువురు సామాజిక కార్యకర ్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యోత్సవ పురస్కారం... ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కెంపెగౌడకు ప్రముఖ రాజ్యోత్సవ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. గతేడాది నవంబర్ 1న రాజ్యోత్సవ పురస్కారాన్ని కెంపెగౌడకు ప్రభుత్వం అందజేసింది. ఈ అవార్డు కింద అందజేసిన రూ. లక్ష నగదును సైతం కొత్త చెరువు తవ్వేందుకే ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 15వ చెరువును త్వరలోనే పూర్తి చేస్తానంటూ అమాయకంగా బోసి నవ్వులు నవ్వుతున్నాడు కెంపెగౌడ! మేకలు, గొర్రెల పెంపకం, యాజమాన్యంపై డిప్లొమా మేకలు, గొర్రెల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్ తదితర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు లక్నవూ(ఉత్తరప్రదేశ్)లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గోట్ మేనేజ్మెంట్ సంస్థ ‘డిప్లొమా ఇన్ లైవ్‌స్టాక్ బిజినెస్ మేనేజ్మెంట్’ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇది 6 నెలల డిప్లొమా కోర్సు. ఫీజు రూ. 50 వేలు. ప్రతిభావంతులకు ఫీజు సగం వరకు తగ్గింపు అవకాశం ఉంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. ఏప్రిల్ 15 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు.. +91 86018 73054/55/60/63, ఠీఠీఠీ.జీజీజఝ్చ.ఛిౌ.జీn 23న కరీంనగర్లో ఎన్.సి.ఓ.ఎఫ్. సేంద్రియ రైతు సమ్మేళనం కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్.సి.ఓ.ఎఫ్.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్ (కలెక్టరేట్ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. – సా. 5 గం. వరకు రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్ డీ కంపోజర్ టెక్నాలజీతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, పిజిఎస్ ఇండియా సర్టిఫికేషన్, సేంద్రియ మార్కెట్ అనుసంధానంపై సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఎన్.సి.ఓ.ఎఫ్. డైరెక్టర్ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. వూట్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాలకు.. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు సముద్రాల జనార్దన్‌రావు– 93969 69217, 84640 09350. -
పుట్టగొడుగులతో పూల బాట!
గ్రామీణ యువత వ్యవసాయానికి దూరం కాకుండా ఉండాలంటే అనుదినం ఆదాయాన్నందించే పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వటం ఉత్తమమని తలచాడు తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. తాను ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రచారం చేయటం సరికాదని గ్రహించి.. ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు! పుట్టగొడుగుల సాగే తన జీవనాధారం చేసుకుని ఇరవయ్యేళ్లుగా ఉచితంగానే శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి దూరమవుతున్న గ్రామీణ యువతకు నిరంతరం ఆదాయాన్ని అందించే జీవనోపాధి చూపాలన్న తపన సుందరమూర్తిని ఉద్యోగంలో నిలవనివ్వలేదు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని గూడపాక్కం గ్రామానికి చెందిన ఆయన ఎమ్యే పీహెచ్డీ పూర్తిచేసి.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, సర్వశిక్ష అభియాన్ సమన్వయకర్తగా పనిచేశారు. 22 ఏళ్ల క్రితం ఒక రోజు క్లాసులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు కొత్త తరానికి వ్యవసాయంపై ఆసక్తి లేదని గ్రహించారు. తక్కువ ఖర్చుతో నిరంతర ఆదాయాన్ని పొందేలా వ్యవసాయం చేసే మార్గాలను గ్రామీణ యువతకు తెలియజెప్పాలని తలపెట్టాడు. తాను చీకూ చింతా లేని ఉద్యోగం చేసుకుంటూ ఎదుటి వారికి వ్యవసాయం గురించి చెప్పటం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో ఉద్యోగాన్ని కూడా వదిలెయ్యాలన్న ఆలోచన వచ్చింది. భార్య మీనాక్షికి చెప్పటంలో ‘పిల్లలు లేరు. ఆర్థిక భద్రత ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తానంటే ఎలా’ అని ఆమె ప్రశ్నించారు. చివరికి ఆమెను ఒప్పించి.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే సాయంత్రం సమయంలో పుట్టగొడుగుల సాగుపై అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించారు. పట్టణవాసులు పుట్టగొడుగుల వాడకంపై ఆసక్తి కనపరుస్తున్నందున ఈ రంగాన్ని ఎంచుకోవచ్చని నిర్ధారణకు వచ్చి1997లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని సుందరమూర్తి వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొంది రూ. 70 వేలతో రెండు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసుకుని.. అనుభవజ్ఞుల సాయంతో పుట్టగొడుగుల సాగులో మెళకువలను నేర్చుకున్నారు. ఎక్కువ డిమాండ్ వుండే పాలపుట్టగొడుగు, చిప్పి పుట్టగొడుగుల సాగు చేయడంతో పాటు విత్తనాలను ఉత్పత్తి చేసి విక్రయించారు. మరోవైపు యువతకు ఉచితంగానే శిక్షణ ఇచ్చారు. చిప్పి రకం పుట్టగొడుగులు రుచి ఎక్కువగా వుంటుంది. మసాల పెద్దమొత్తంలో వేసినా వాటిని పీల్చుకునే శక్తి ఎక్కువ. మృదువుగానూ ఉంటుంది. ఈ రకమైన పుట్టగొడుగుల సాగు కోసం ప్రత్యేకంగా మరో షెడ్‌ను ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లోనే చేస్తుండడంతో, తమ పుట్టగొడుగులను కొనడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో వచ్చే ఆర్డర్లను తీసుకుని డోర్‌డెలివరీ కూడా ఇస్తుండటంతో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. భార్య మీనాక్షి తోడ్పాటుతో ప్రస్తుతం సుందరమూర్తి నెలకు 600 కేజీల నుండి 4 వేల కేజీల వరకు పుట్టగొడుగులను విక్రయిస్తున్నారు. నెలకు రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతుండటం విశేషం. యువతకు శిక్షణ ఇవ్వడంలోనే సంతృప్తి! ముళ్ళ బాటను దాటితేనే పూల బాట వస్తుంది. సవాళ్ళను ఎదుర్కోకుండానే సక్సెస్ ఎలా అవుతాం అని ప్రశ్నించుకున్నా. కష్టమో నష్టమో వ్యవసాయం చేయాలనుకుని ఉద్యోగం వదిలేశాక.. మళ్ళీ వెనుకడుగు వేయలేదు. మొదట్లో కొంత భయపడ్డా తరువాత కుదురుకున్నా. ప్రతి నెలా వందలాది మంది రైతులకు, యువకులకు ఇరవయ్యేళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. పుట్టగొడుగుల సాగు చేయడం కన్నా వేలాది మంది యువతకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తున్నది. – సుందరమూర్తి, గూడపాక్కం, తిరువళ్లూరు, తమిళనాడు sundar1967@gmail.com (వివరాలకు – రాజపాల్యం ప్రభు, 9655880425) – కోనేటి వెంకటేశ్వర్లు, సాక్షి, తిరువళ్లూరు, తమిళనాడు సంచితో వుంచిన పుట్టగొడుగులవిత్తనాలు, పుట్టగొడుగు -
సీమాంధ్ర బుడగ జంగాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి
భారతదేశ సంస్కృతిని భావితరాలకు అందిస్తూ పురాణ గాథలను కళారూపాల్లో ప్రదర్శిస్తూ జీవనం సాగించే జాతిలో ‘బుడగ జంగం’ కులం ఒకటి. ఢిమికీ, తంబూర, అందెల సహాయంతో వీరు ఊరూరా తిరుగుతూ కథలు చెబుతారు. పూర్వం నుంచి కళను ఉపాధిగా చేసుకుని బతికే వీరు నేడు వాటికి ఆదరణ తగ్గిపోవడంతో భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అవుతున్నా చట్ట సభల్లో ఇప్పటికీ వీరికి ప్రాతినిధ్యం లేదు. నిజాం స్టేట్‌లో షెడ్యూలు కులంగా గుర్తింపు పొందిన బుడగ జంగాలను 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎస్సీలుగా ధ్రువీకరిం చింది. అప్పటికీ బుడగ జంగాలు కేవలం తెలంగాణ ప్రాంతానికి పరిమితమయ్యారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం లో కూడా బుడగ జంగం కులస్తులు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ గా ఉన్నందున ఇక్కడ వీరిని ఎస్సీలుగా గుర్తించింది. అనంతరం బుడగ జంగాలు పెద్ద సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు వలసపోయారు. సంచార జీవితం గడిపే వీరు పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు. ఈ నేపథ్యంలో 1976లో రాష్ట్ర ప్రభుత్వం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు సవరణ జరిపి ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా బుడగ జంగాలు ఉన్నారని, వారికి కూడా తెలంగాణలో మాదిరి గా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి 2008 వరకు అంటే 32 ఏళ్లపాటు ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో బుడగ జంగాలు ఎస్సీలుగానే పరిగణించబడ్డారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇతర కులస్తులు కొందరు అక్రమంగా బుడగ జంగం కుల ధ్రువీకరణ పత్రాలు సంపాదించి ప్రభు త్వ ఉద్యోగాలు పొందిన విషయం వెలుగుచూసింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మాల రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కుట్రతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుడగ జంగాలు లేరని అక్కడ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2008లో ప్రభుత్వం జీవో 144ను వెలువరించి బుడగ జంగాలకు తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలోనే కుల ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వాలని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జారీ చేయకూ డదని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే చదువుల బాట పట్టిన బుడగ జంగం విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్‌కు దూరమయ్యారు. అక్రమార్కులను కనిపెట్టి వారిని శిక్షించి, చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎవరో ఆరోపించారని ఏకంగా ఒక కులం మొత్తాన్ని శిక్షిం చడం గర్హనీయం. ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ లోని బుడగ జంగాలు కోరుకుంటున్నారు. - తూర్పాటి జె శ్రీధర్ అఖిల భారత బేడబుడగ జంగం సమాఖ్య