కేరాఫ్‌ పాలగుట్టపల్లె | Special Story On Paalaguttapalle Cotton Bags | Sakshi
Sakshi News home page

కేరాఫ్‌ పాలగుట్టపల్లె

Published Wed, Sep 18 2019 12:46 AM | Last Updated on Wed, Sep 18 2019 12:46 AM

Special Story On Paalaguttapalle Cotton Bags - Sakshi

పాలగుట్ట పల్లె గురించి వెతికితే ఒకప్పుడు ఎలాంటి సమాచారం తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు పాలగుట్టపల్లెకు కాటన్‌ బ్యాగ్స్‌ ఒక ఉనికిని తీసుకువచ్చాయి. చిత్తూరు జిల్లాలోని పాకాల చెంతనే ఉండే ఈ పల్లెకు బ్యాగ్స్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి.

ఆ  పల్లెలో సుమారు అరవై కుటుంబాలు ఉంటాయి. ఆడా,మగ అందరూ వ్యవసాయ కూలీలే. పశువులు, కోడీ, మేకా వారి మరో జీవనాధారం. వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు.. వాటిలో కూలి పనులు. లేదంటే అవీ లేవు. అలాంటి చోట.. ‘మేం ఇటీవల తయారు చేసిన బ్యాగులలో బాగా ప్రాచుర్యం పొందింది చిన్న చిన్న కంపార్ట్‌మెంట్లతో కూడిన బలమైన కాన్వాస్‌ వెజిటబుల్‌ బ్యాగ్‌. మార్కెట్‌కు వెళ్లినప్పుడు అన్ని కూరగాయలను ఒక సంచిలో వేయించుకుంటాం.

టొమాటోల మీద బంగాళదుంపలు వేశామనుకోండి.. టొమాటోలు ఇక అంతే. అలా కాకుండా దేనికది విడిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పుట్టుకొచ్చిందే కంపార్ట్‌మెంట్‌ కాన్వాస్‌ బ్యాగ్‌. ఇవే కాదు స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, షాపుల్లోకి బ్యాగులు, పౌచులు.. ఆర్డర్ల మీద తయారుచేసి ఇస్తున్నాం.’ అని ఆనందంగా వివరించారు రూప, అన్నపూర్ణ. మూడేళ్లుగా మొత్తం తొమ్మిది మంది గ్రూప్‌గా వందలాది బ్యాగుల తయారీలో నిమగ్నమై ఉంటున్నారు.

వంద బ్యాగులతో మొదలు
‘కూలిపనులకు వెళ్తే గిట్టుబాటు కూలీ దొరికేది కాదు. మగవాళ్లు కొద్దోగొప్పో సంపాదిస్తే అది తిండికే సరిపోయేది. మా ఊళ్లో నలుగురు ఆడవాళ్లు మాత్రం మిషన్‌ మీద బ్లౌజులు కుట్టుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడు అపర్ణామేడమ్‌ వచ్చి ‘మీరు బ్యాగులు కుట్టగలరా..’ అని అడిగింది. సంతోషంగా మూడేళ్ల కిందటి వివరాలు చెప్పుకొచ్చారు రాణి, కళావతి. అపర్ణ కృష్ణన్‌ కుటుంబం పాతికేళ్ల కిందట సేంద్రీయ వ్యవసాయం చేయడానికి పాలగుట్టపల్లెకు వచ్చారు. వారిది చెన్నై.

‘మేడమ్‌ చుట్టుపక్కల అంతా చూస్తూ మా వద్దకు వచ్చి, పరిచయం చేసుకున్నారు. మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి గురించి అడుగుతుంటేవారు. మాకు, మా పిల్లలకు ఆయుర్వేద మందులు, పిల్లలకు పాలలో కలపడానికి అశ్వగంధచూర్ణం.. వంటివి ఇచ్చి వెళుతుండేవారు. మూడున్నరేళ్ల క్రితం ‘హైదరాబాద్‌లో తెలిసినవాళ్లు కాటన్‌ బ్యాగ్‌లు కావాలని అడిగారు, కుట్టగలరా?’ అన్నారు. అప్పుడు ఆ మేడమే అడ్వాన్స్‌గా డబ్బు ఇచ్చింది. కాటన్‌ క్లాత్‌ కొనుక్కొచ్చి 100 బ్యాగులు కుట్టి ఇచ్చాం’ అని వివరించింది రూప.
 
ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ పనులు
కాస్త ముతకగా ఉండే కాటన్‌ బ్యాగ్‌లు అంతటా దొరకవచ్చు. ‘కానీ, మా పల్లెకే ప్రత్యేకమైన బ్యాగులు ఉండాలనుకున్నాం. అప్పుడు అపర్ణామేడమే ఆ బ్యాగుల మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ ఉంటే ఆకట్టుకుంటాయి అని చెప్పారు’ వివరించింది అన్నపూర్ణ. అప్పుడు మేడమ్‌ సూచనతో మాలో నలుగురం చెన్నైకి వెళ్లి ప్రింట్లు ఎలా చేస్తారు, వాటిని బ్యాగ్‌ మీద ఎలా వేస్తారో .. వర్క్‌ నేర్చుకున్నాం. అలా బ్యాగుల మీద నెమలి, గణపతి బొమ్మలు, ఆర్డర్లు ఇచ్చే కంపెనీల లోగోలు.. ప్రింట్లు వేసి, కుట్టి పంపుతున్నాం. దీంతో మా బ్యాగ్స్‌కు ఇంకా మంచి పేరు వచ్చింది. ముందు ముగ్గురం, నలుగురం ఈ పనిలో ఉండేవాళ్లం.

ఉత్తరప్రదేశ్‌లో ఆర్గానిక్‌ కాంగ్రెస్‌కు 2000 బ్యాగులు ఆర్డర్‌ రావడంతో మరో ఆరుగురం కలిశాం. ఆ తర్వాత ఆరు పాకెట్లతో ఉన్న వెజిటబుల్‌ బ్యాగులు కుట్టి ఫేస్‌బుక్, వాట్సప్‌లో పెట్టాం. వీటికీ బాగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, దుబాయ్, ముంబయ్‌కి కూడా ఆర్డర్ల మీద మా బ్యాగులు వెళుతున్నాయి. రెండు నెలల నుంచి ఆర్గానిక్‌ సరుకులు అమ్మే షాప్‌లకు బ్యాగులు కుట్టి పంపిస్తున్నాం’ అని వివరించింది ఈ తొమ్మిది మంది బృందం.

నెలవారీగా ఆర్డర్లు
రెండేళ్ల క్రితం పాలగుట్టపల్లె నుంచి బ్యాగులు గోవా ఎగ్జిబిషన్‌కు వెళ్లాయి. దీనికి అపర్ణతోపాటు  లావణ్య, విఘ్నేశ్వరన్‌లు కూడా సాయం చేస్తున్నారు. మొదట్లో వచ్చిన డబ్బుతోనే ఇప్పటివరకు రొటేషన్‌ చేస్తూ వచ్చారు. కాటన్‌ క్లాత్, పెయింటిగ్‌ మధురై నుంచి తెప్పించుకుంటారు. కుట్టుపని, ప్యాకేజీ పనులన్నీ వాళ్లే చూసుకుంటారు. ఆ ఊరికి బస్సు, ఆటో సౌకర్యం కూడా లేదు. ‘కొంచెం చీకటి పడిందంటే ఆటో ఛార్జీలు పెంచుతారు. అందుకే రేపు బ్యాగులు పోస్టులో వెళ్లాలి అంటే ఈ రోజే ఆటో అతనికి చెబుతాం. ఇప్పుడు రెడీమేడ్‌ బ్లౌజులు కూడా కుట్టాలనుకుంటున్నాం. బ్యాగులకు ఎంబ్రాయిడరీ చేస్తున్నాం కాబట్టి బ్లౌజులు కూడా ఎంబ్రాయిడరీ వర్క్‌ చేస్తాం..’ అని చెప్పారు లక్ష్మీకాంత, ప్రమీల.

సైజ్, మోడల్‌ను బట్టి ధరలు
అప్పటి వరకు వ్యవసాయ పని, పశువులు పెంపకం తప్ప వేరే నైపుణ్యం లేదు వారికి. అలాంటి వారు స్క్రీన్‌ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. కొత్త కొత్త డిజైన్ల కోసం కోలాం నమూనాలను అనుసరించారు. దీంతో అపర్ణా కృష్ణన్‌ పాలగుట్టపల్లె బ్యాగ్స్‌ పేరుతో వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఫైనాన్స్‌ సోర్స్‌ను ఏర్పాటు చేసి మార్కెటింగ్‌ వారితో ఈ బృందానికి ఒక మాధ్యమం ఏర్పడేలా సాయం చేశారు. మిగతావన్నీ .. జాబితాను నిర్వహించడం, క్లాత్‌ కొనడం, డిజైన్‌ చేయడం, పాత బియ్యం బిస్తాలలో సంచులను ప్యాక్‌ చేయడం, పోస్ట్‌ చేయడం, పనిని విభజించుకోవడం, ఆదాయాలను పంచుకోవడం.. అన్నీ ఇక్కడి మహిళలే చేస్తారు. బ్యాగు సైజ్, డిజైన్‌ బట్టి ధరలు ఉన్నాయి.
– నిర్మలారెడ్డి
ఫొటోలు: టి. తులసీరామ్, సాక్షి, పాకాల, చిత్తూరు

రెండేళ్ళ కిందట నోయిడాలో జరిగిన ఆర్గానికి వరల్డ్‌ కాంగ్రెస్‌కు 2000 బ్యాగులను సప్లయ్‌ చేశారు. మొదటిసారి పొందిన పెద్ద ఆర్డర్‌ అది. ఆ తర్వాత ఏడాదికి గోవాలో జరిగిన హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పో∙ఆర్డర్‌ వచ్చింది. ఇటీవల అమెరికాకు కూడా ఆర్డర్‌ ద్వారా వీరి బ్యాగులు వెళ్లాయి. తమిళనాడులోని కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు పాలగుట్టపల్లె బ్యాగులు తెప్పించుకుంటున్నాయి. డిజైన్‌ బట్టి ఒక్కో బ్యాగ్‌ ధర రూ.20 నుంచి ఉన్నాయి. ఈ బ్యాగుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా ఆర్డర్లు ఇవ్వచ్చు.

పాలగుట్టపల్లె కాటన్‌ బ్యాగ్‌లకు ఇంత పేరు రావడానికి కారణం ఈ మహిళలు ఎంచుకున్న నాణ్యతే ప్రధానం. మొదట కొంత మొత్తం లోన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత వారి రాబడి పెరుగుతూ ఉండటంతో ఆ మొత్తం తీర్చేశారు. పల్లెటూరి మహిళలు నాణ్యమైన వస్తువులను అందించడంలో ముందుంటారు. వీరికి రూరల్‌ డెవలప్‌మెంట్‌ కింద ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలను చూస్తారు.
– అపర్ణాకృష్ణన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement