అధిక పోషకాలున్న దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ఇటు భూదేవి ఆరోగ్యంతో పాటు అటు ప్రజల, పర్యావరణ, పశుపక్ష్యాదుల ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని మనసా వాచా కర్మణా నమ్మిన ఆదర్శ రైతు గోగుల రాధాకృష్ణయ్య. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత 8 ఎకరాల సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించి తాను తింటూ, నలుగురికీ అందిస్తున్నారు. ఆయన క్షేత్రం ప్రకృతి వ్యవసాయదారులు, వ్యవసాయ విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణాలయంగా మారిపోయింది.
ఈ ఏడాది జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆహ్వానం మేరకు గోగుల విజయవాడలోని రాజభవన్‌లో తేనేటి విందులో పాల్గొనటం విశేషం. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా ప్రకృతి సేద్యాన్ని రైతులందరికీ నేర్పించాలని సూచిస్తున్న 63 ఏళ్ల రాధాకృష్ణయ్య సేద్య అనుభవాల సారమిది..
వైస్సార్ జిల్లా బద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీ అబ్బుసాహేబ్ పేటకు చెందిన గోగుల రాధాకృష్ణయ్య కడప నీటి΄ారుదల శాఖలో సహాయ సాంకేతికత అధికారిగా పనిచేస్తూ 2013లో ఉద్యోగ పదవీ విరమణ చేశారు. వ్యవసాయంపై మక్కువతో తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం మొదలు పెట్టారు. రెండేళ్లపాటు సాధారణ రసాయనిక వ్యవసాయం చేసినా భూమి నిస్సారం కావటం వల్ల అంతగా ఆదాయం రాలేదు. ఆ దశలో 2017లో సుభాష్ పాలేకర్ వద్ద 5 రోజుల శిక్షణ ఉంది అధిక పోషక విలువలు కలిగిన దేశీ వరి వంగడాలతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రాధాకృష్ణయ్యకు 2017లో ప్రభుత్వం నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ షాపు మంజూరు చేసింది. దీంతో ఆయన కషాయాలు, వేప పిండి వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తూ, తానూ శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
తొలుత 6 ఎకరాల్లో నవార, బర్మాబ్లాక్, పరిమళ సన్న, బహురూపి, మాపిళ్లై సాంబ 5 రకాల దేశీ వరిని సాగు చేశారు. రెండెకరాల్లో కరివే΄ాకు సాగు చేస్తున్నారు. తొలి రెండేళ్లు కరివే΄ాకు సాగు చేస్తూ ఏటా మూడు పంట కోతలు చేసేవారు. ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల సూచన మేరకు గత ఐదేళ్లుగా కరివేపాకు విత్తనోత్పత్తిపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం 2 ఎకరాల్లో దేశవాళీ వరి నవార రకాన్ని, 2 ఎకరాల్లో కరివే΄ాకు విత్తనోత్పత్తి చేస్తున్నారు. మిగతా 4 ఎకరాల్లో పరిమళ సన్న, సుంగధి, ఇంద్రాణి, కాలాభట్, మణిపూర్ బ్లాక్, బ్లాక్ బర్మా, బహురూపి, మాపిళ్లై సాంబ, సిద్ధ సన్నాలు, కుజిపటాలియా, రత్నచోళి, రత్నశాలి వంటి 14 రకాల దేశవాళీ వరిని సాగు చేస్తున్నారు. ఈ దేశీ వరి విత్తనాలను ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులకు కిలో 100–120 చొప్పున విక్రయిస్తున్నారు. వాట్సప్ వంటి సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు.
రెండెకరాల్లో నవార
కేరళకు చెందిన పోషకాల గని వంటి నవార ధాన్యాన్ని రెండెకరాల్లో పండిస్తున్నారు రాధృకృష్ణయ్య. 6 నెలలు మాగబెట్టిన ధాన్యాన్ని మర పట్టించి కిలో రూ. 120–130 చొప్పున నవార ముడి బియ్యాన్ని రాధాకృష్ణయ్య అమ్ముతున్నారు. ఈ బియ్యం తిన్న షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ఆయన తెలి΄ారు.
నవార బియ్యానికి మంచి డిమాండ్ ఉండటంతో ఈ ఒక్క రకాన్ని 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్లు నలుపుగా బియ్యం ఎరుపుగా ఉండే నవారను రబీ కాలంలో సాగు చేస్తే పడి΄ోకుండా ఉంటుందన్నారు. మనుషులతోనే నాట్లు, కోత, నూర్పిడి చేయిస్తానని, ఎకరానికి రూ. 21 వేల ఖర్చు వస్తోందన్నారు. ఎకరానికి 18 బస్తాల ధాన్యం పండుతోంది. 76 కిలోల ధాన్యం నుంచి 51 కిలోల ముడిబియ్యం దిగుబడి వస్తోందన్నారు. వాట్సప్ ద్వారా సమాచారం తెలుసుకొని ఆర్డర్లు ఇచ్చే వారికి ΄ార్శిల్ ద్వారా పంపుతున్నామన్నారు.
కరివేపాకు విత్తనోత్పత్తి
రాధాకృష్ణయ్య 2 ఎకరాల్లో కరివేపాకును 7 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఏటా మూడు సార్లు కరివే΄ాకు అమ్మేవారు. తరువాత ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనల మేరకు నాలుగేళ్లుగా కరివేపాకు విత్తనాలు ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. ఒక్కో ఎకరాకు 500 కిలోల వరకు కరివే΄ాకు విత్తనాల దిగుబడి వస్తుంది. ఎకరానికి 40-50 కిలోల నాణ్యమైన విత్తనం సరి΄ోతుందని, పండ్లను ఎండబెట్టకుండా చెట్టు నుంచి కోసిన ఒకటి, రెండు రోజుల్లోనే నాటుకోవాలని, ఇలా చేస్తే 90శాతం మొలక వస్తున్నదని రాధాకృష్ణయ్య తెలిపారు. ఖర్చులన్నీ పోను ఎకరానికి కనీసం రూ. 1,50,000 ఆదాయం పొందుతున్నానని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో΄ాటు బద్వేల్‌లోని బీబీఆర్ కళాశాలకు చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులకు గోగుల వ్యవసాయ క్షేత్రంలోనే శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం విశేషం. ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే దేశీ వంగడాలతో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులనే ఆహారంగా తినాలని ఆయన సూచిస్తున్నారు.
– గోసల యల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment