మూడో అత్యంత శక్తివంత మహిళ ఇంద్రా నూయీ
న్యూయార్క్: పెప్సికో సీఈవో, భారత సంతతికి చెందిన ఇంద్రా నూయీ 2014 ఏడాదికి ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త(బిజినెస్ ఉమన్)గా ఎంపికైంది. ‘బిజినెస్ 2014 అత్యంత శక్తివంత మహిళలు’ పేరుతో ఫార్చూన్ పత్రిక తాజాగా జాబితాను విడుదల చేసింది. జాబితాలో తొలి రెండు ర్యాంకులను దక్కించుకున్న ఐబీఎం చైర్మన్ గిన్నీ రోమెట్టీ, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రాల సరసన మూడో స్థానంలో నూయీ నిలిచింది. ఈ బాటలో టాప్ పొజిషన్‌ను సాధించిన మహిళల్లో భారత సంతతికి చెందిన ఏకైక బిజినెస్ ఉమన్ గా నిలిచినట్లు కూడా ఫార్చూన్ పేర్కొంది.
ఈ జాబితాలో చోటు చేసుకున్న సగం మంది మహిళలు భారీ సంస్థలను నిర్వహిస్తున్నారని, ఇది ఒక రికార్డని ఫార్చూన్ పేర్కొంది. కాగా, గతేడాది విడుదలైన ఫార్చూన్ జాబితాలో నూయీ రెండవ స్థానంలో నిలవడం గమనార్హం. అమెరికాలో అత్యధికంగా విక్రయమవుతున్న 50 ఆహార, పానీయాల ఉత్పత్తుల్లో 9 పెప్సీకోవే ఉంటున్నాయని ఫార్చూన్ వెల్లడించింది.