Indra Nooyi
-
ఇటు వర్క్‌ని.. అటు కుటుంబాన్ని.. బ్యాలెన్స్ చేశారిలా.. !
పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త. భారత తొలి మహిళా సీఈవో కూడా ఆమె. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళా జాబితాలో కూడా స్థానం దక్కించుకుంది. ఎన్నో అత్యత్తమమైన అవార్డులను సొంతం చేసుకుని వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని విజయాలను అందుకుంది. అలాగే ఇద్దరు పిల్లల తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించి కుటుంబ జీవితాన్ని పూర్తి న్యాయం చేసింది. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా..! మరీ నూయికీ ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందామా..!ఆమె రాసిని 'మై లైఫ్ ఇన్ ఫుల్' అనే పుస్తకంలో కుటుంబాన్ని, వర్క్‌ని ఎలా బ్యాలెన్సు చేసుకోవాలో క్లియర్‌గా వివరించింది. ఆ పుస్తకంలో ఓ పెద్ద కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తూ..కుటుంబ బాధ్యతలను ఎలా తాను బాల్యెన్సు చేసిందో వివరిస్తూ.. తన అనుభవాన్ని పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!ఇంద్ర నూయి పేరెంటింగ్ చిట్కాలు..కుటుంబం ప్రాముఖ్యత..తన తొలి సంతానం ప్రీత పుట్టినప్పుడూ యూఎస్‌లో ఆమెకు తన కూతుర్ని పర్యవేక్షించే పిల్లల సంరక్షణ ఏది కనిపించలేదు. ఆ సమయంలో ఆమె తల్లి, అత్తగారు ఆమెకు సహాయ సహకారాలు అందించారు. వారివురు తన పిల్లల బాధ్యతను తీసుకోవడంతో తాను కెరీర్లో దూసుకుపోగలిగానని అన్నారు. అదే సమయంలో వారేమీ నా పిల్లలను చూసుకున్నందుకు తన నుంచి ఎలాంటి డబ్బులు ఆశించలేదు. తరతరాలుగా వస్తున్న బాధ్యతగా వారు తీసుకున్నారు. ఇదే కుటుంబం అంటే అని చెబుతుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలాంటి విజయాలను అందుకోలేవని అంటోంది నూయి. పిల్లలను మంచిగా పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరూ సమిష్టగా చేయాల్సిన పని అని నొక్కి చెబుతోంది. అలాగే తన రెండో కూతురు తార వచ్చేటప్పటికీ పిల్లల సంరక్షణను అందుబాటులో ఉంది. అయినప్పటికీ తన కుటుంబమే వారి బాధ్యతను తీసుకుందని చెప్పుకొచ్చింది నూయి.ఒంటరిగా ఉండిపోవద్దు..మాతృత్వం అనేది ఓ గొప్ప అనుభూతి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తుల సాయంతో ధైర్యంగా లీడ్ చేయాలి. తాను కష్టంతో కాకుండా ఆనందంతో ఆ బాధ్యతలను నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఉద్యోగ జీవితానికి దూరమవుతున్నానే బాధ అనిపించదు. మాతృత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే కెరీర్‌ని ఎలా తిరిగి పునర్నిర్మించుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. అందుకు మీ కుటుంబ సహకారం కూడా తీసుకోవాలి అని చెబుతోంది.సమయం కేటాయించటం..కొన్ని సార్లు తల్లిగా పిల్లలను చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. ప్రత్యేకంగా మీకు సమయం కేటాయించుకోవడం కష్టమే అయినా వాళ్లతో ఆడుతూ పాడుతూ మీ పనిచేసుకునే మార్గాన్ని అన్వేషించాలి. చేయాలనే తపన, ఉత్సాహం ఉంటే ఎలాగైన తగిన సమయం దొరుకుతుందని చెబుతోంది నూయి. కష్టపడక తప్పని స్థితి..ఒక్కోసారి రెండు పనులు నిర్వర్తిస్తున్నప్పుడూ ఓ యుద్ధమే చేస్తున్నట్లు ఉంటుంది. అధిక శ్రమకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడూ కుటుంబ సహకారం లేదా జీవిత భాగస్వామి సహాయం తీసుకోండి. తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారి సహకారం అత్యంత ముఖ్యం.సెలవుల సాకు వద్దు..సెలవులు దొరకడం లేదు అందుకే కుటుంబంతో గడపలేకపోతున్నా అని చెబుతుంటారు. ఇదస్సలు సరైనది కాదు. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడూ సెలవు అనే సాకు కోసం చూడొద్దు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలపై దృష్టిసారించండి. వారితో గడిపే సమయాన్ని విరామ సమయంగా లేదా రిఫ్రెష్ అయ్యే సమయంగా ఫీలయ్యేతే సెలవుతో సంబంధం ఉండదంటోంది నూయి. జీవిత భాగస్వామి సపోర్టు..పిల్లల పెంపకం అనేది తల్లి బాధ్యతనే భావనలో ఉండొద్దు. ఇది ఇరువురి బాధ్యత అని అర్థం చేసుకోవాలి. అప్పడే ఓ కుటుంబం ఆనందమయంగా ఉండగలదు. పైగా మంచిగా పిల్లలు ఎదిగే వాతావరణం అందుతుంది. అందుకు జీవిత భాగస్వామి పూర్తి సహకారం చాలా కీలకం. కాబోయే తల్లిదండ్రులిద్దరూ ఈ చిట్కాలను అనుసరిస్తే వర్క్‌ని కుటుంబ జీవితాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకుపోగలరు. ఇక్కడ ఇంద్రా నూయి సమిష్టి కృషికి పెద్దపీట వేసింది. బహుశా ఈ ఆటిట్యూడ్ ఇంద్రనూయిని అంత పెద్ద కంపెనీకి నాయకురాలిగా చేసి, బాధ్యతలను కట్టబెట్టిందేమో కదూ..!.(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్‌గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్‌కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
'అమెరికాలో ఇలా చెయ్యొద్దు'!.. భారతీయ విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు!
అమెరికాలో వెలుగు చూసిన భారత సంతతి విద్యార్థుల ఘటనలపై పెప్పికో మాజీ సీఈవో ఇంద్రానూయి స్పదించారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దయచేసి యూఎస్‌కి వచ్చే భారతీయ విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కార్యకలాపాల జోలికి వెళ్లొద్దని సూచిస్తూ పది నిమిషాల నిడివిగల వీడియోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఇంద్రనూయి.."అక్కడ దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియోని రికార్డు చేశాను. అమెరికాలో సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చట్ట పరిధికి లోబడి ఉండండి. రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాల్లోకి వెళ్లొద్దు. మాదకద్రవ్యాల జోలికి, అతిగా మద్యపానం సేవించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. ఇవన్నీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టెవే. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే విద్యార్థులు తగిన యూనివర్సిటీని, కోర్సును ఎంపిక చేసుకోండి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూఎస్‌కి రావడం చాలా మంచిది. ఇది గొప్ప సాంస్కృతిక మార్పు కూడా. పైగా వారు తమ కుటుంబాలు, బంధువులు, పర్యావరణ పరిస్థితులకు చాలా దూరంగా చదువు కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించాలి. అమెరికాలో దిగిన క్షణం నుంచే తగిన స్నేహితులను ఎంచుకోండి. కొత్తగా రావడంతో మీకు ఇక్కడి అలవాట్లు, జీవనశైలి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీటి వ్యామోహంలో పడి చెడు స్నేహాల్లో చిక్కుకోవద్దు. కొంతమంది విద్యార్థులు సరదాగా మాదక ద్రవ్యాలకు ట్రై చేయాలని చూస్తున్నారు. ఇలాంటివి అస్సలు వద్దు ప్రాణంతకం, పైగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అదీగాక ఇందులో చిక్కకుంటే మీ కెరీర్ నాశనం అవుతుంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనవద్దు. మీ చర్యల వల్ల జరిగే పరిణామలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఈ ఆతిథ్య దేశం చట్టాలు, నిబంధనలు అస్సలు తెలియవు. అంతేగాదు మీ వీసా స్థితి, పార్ట్ టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్ట బద్ధత అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించవద్దు. యూఎస్‌లో ఉన్నప్పుడూ విదేశీ విద్యార్థిగా హద్దుల్లోనే ఉండాలనే విషయం మరిచిపోవద్దు. అలాగే మీరు నివశించే ప్రాంతాల గురించి పూర్తిగి తెలుసకోవాలి. సమూహంగా లేదా స్నేహితులతోనే తప్పక వెళ్లండి." అని సూచించారు ఇంద్రానూయి. అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాలు, స్థానిక కమ్యూనిటీల గురించి అవగాహన ఉండాలన్నారు. ఇక్కడ ఉండే స్థానిక భారతీయ అమెరికన్లతోనూ, భారతీయ కాన్సులేట్తోనూ టచ్‌లో ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలతో సహా వివిధ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఇటీవలే అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం. అలాగే అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు కూడా చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఫిబ్రవరి నెలలో పర్డ్యూ యూనివర్శిటీకి చెందిన భారతీయ-అమెరికన్ సమీర్ కామత్ (23) అనే విద్యార్థి తలపై తానే తుపాకీతో కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు. ఇవేగాక మరి కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పలు దిగ్బ్రాంతికర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg — India in New York (@IndiainNewYork) March 22, 2024 (చదవండి: US: అమెరికాలో ఇంత భక్తి ఉందా?) -
అమెరికాలో శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
న్యూయార్క్: Forbes Among America's 100 Richest Self Made Women : అమెరికాలోని టాప్ 100 సంపన్న మహిళల్లో (స్వయంగా ఆర్జించిన) నలుగురు భారత సంతతి వనితలకు చోటు లభించింది. పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి(67), అరిస్టా నెట్వర్క్స్ (కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(62), సింటే (ఐటీ కన్సల్టెంగ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేతి(68), కన్‌ఫ్లూయెంట్ (క్లౌడ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే (38) ఫోర్బ్స్ ‘అమెరికా సంపన్న మహిళల’జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ఉమ్మడి సంపద 4.06 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33292 కోట్లు)గా ఉంది. 100 మంది మహిళలు ఉమ్మడిగా 124 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారని, ఏడాది క్రితంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల సంపదతో 15వ ర్యాంకులో ఉన్నారు. ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసించారు. నీర్జా సేతి 990 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. తన భర్తతో కలసి స్థాపించిన సింటెల్‌ను ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈకి 3.4 బిలియన్ డాలర్లకు 2018లో విక్రయించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన తర్వాత ఆక్లాండ్ వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. నార్కడే 520 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 38వ స్థానంలో ఉన్నారు. కన్ఫ్లూయెంట్లో ఆమెకు 6 శాతం వాటాలున్నాయి. మరొకరితో కలసి ఆసిలర్ పేరుతో కొత్త కంపెనీని 2023 మార్చిలో స్థాపించారు. ఇంద్రా నూయి 2019లో పెప్సీకో సీఈవోగా రిటైర్ అయ్యారు. 350 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. -
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
పెయిడ్ లీవ్స్ లేనివాళ్లను చూస్తే ఆందోళనగా ఉంది’
పెప్సీకో వంటి అంతర్జాతీయ బ్రాండ్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేసి సంస్థను లాభాల్లో పెట్టిన వనితగా ఇంద్రానూయికి పేరుంది. ఇరవై ఐదేళ్ల పాటు పెప్సీకోలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమె 2018లో సీఈవోగా అక్కడ రిటైర్ అయ్యారు. అయితే ఒక ఉద్యోగి జీవితంలో పెయిడ్ లీవ్స్ ప్రాముఖ్యత ఎంత ఉంటుందనే అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమె చెప్పుకొచ్చారు... నా కెరీర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో పని చేస్తున్నాను. అప్పుడు మా నాన్నకి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. నేను ఆయన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో పెయిడ్ లీవ్స్ అడిగితే ముందు కుదరదని చెప్పారు. దీంతో నా జీవితం ఒక్కసారిగా డోలాయమానంలో పడింది. ఓ వైపు తండ్రి ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, మరోవైపు జాబ్ వదిలేయాల్సిన పరిస్థితి. ఏం చేయాలో పాలుపోలేదు అంటూ ఆనాటి రోజులను ఇంద్రానూయి జ్ఞాపకం చేసుకున్నారు. చివరకు ఎలాగోలా మా నాన్నను చూసేందుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న చనిపోయారు. ఈ సమయంలో కంపెనీ నాకు ఆరు నెలల పాటు పెయిడ్ లీవ్ మంజూరు చేసింది. అయితే నాన్న అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే మూడు నెలల రెండు రోజుల తర్వాత నేను తిరిగి విధుల్లో చేరాను. నాకు అవసరం లేకపోవడంతో దాదాపు మూడు నెలల పాటు పెయిడ్ లీవ్స్ వదులుకున్నాను. కంపెనీ నాకు పెయిడ్ లీవ్స్ నిరాకరించడం, ఆ తర్వాత మంజూరు చేయడం, పనిపై మక్కువతో నేను పెయిడ్ లీవ్స్ పూర్తిగా వాడుకోకపోవడం వంటివి అసాధారణ విషయాలేమీ కాదు. కానీ కనీసం పెయిడ్ లీవ్స్ ఉంటాయని తెలియని వాళ్లు, పెయిడ్లీవ్స్ లేకపోయినా అనేక కష్టాల మధ్య ఉద్యోగాలు చేసే వాళ్లని తలచుకుంటేనే నాకు బాధగా ఉందంటూ తెలిపారు ఇంద్రానూయి. కంపెనీ అభివృద్ధికి అహార్నిషలు పని చేసే ఉద్యోగులకు కష్టకాలంలో అక్కరకు వచ్చేలా పెయిడ్ లీవ్స్ ఉండాలనే అర్థంలో అమె కామెంట్లు చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంద్రనూయి లాంటి పేరొందిన సీఈవో నోట పెయిడ్ లీవ్స్‌పై వ్యాఖ్యలు రావడం కార్పోరేట్ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించినంత వరకు శుభపరిణామం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: Indra Nooyi: మన్మోహన్సింగ్, బరాక్ ఒబామా.. ఆ రోజు ఎన్నడూ మరువలేను -
ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని ఒకరు, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ఎర్త్‌కి ప్రెసిడెంట్ మరొకరు. వీరిద్దరు ఓ సమావేశంలో కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ అంతర్జాతీయ సంస్థ సీఈవోని చూస్తూ.. తమ దేశానికి చెందినది అంటే తమ దేశానికి చెందినది అంటూ ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఈ ఆరుదైన ఘటన 2009లో చోటు చేసుకుంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశం సాధిస్తున్న ప్రగతిని అక్కడి కంపెనీల పనితీరుని ప్రధాని మన్మోహన్‌కి వివరిస్తున్నారు బరాక్ ఒబామా. ఈ క్రమంలో పెప్సీ కంపెనీ వంతు వచ్చింది. 2009లో పెప్సీ కంపెనీకి గ్లోబల్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఇంద్రానూయి ఉన్నారు. ఆమెను చూడగానే ప్రధాని మన్మోహన్సింగ్ ఈమె మాలో ఒకరు అని ఒబామాతో అన్నారు. వెంటనే స్పందించిన బరాక్ ఒబామా ‘ ఆహ్! కానీ ఆమె మాలో కూడా ఒకరు’ అంటూ బదులిచ్చారు. శక్తివంతమైన రెండు దేశాలకు చెందిన అధినేతలు తనను మాలో ఒకరు అంటూ ప్రశంసించడం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ ఇంద్రనూయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆనాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. భారత సంతతికి చెందిన ఇంద్రానూయి అమెరికాలో స్థిరపడ్డారు. 25 ఏళ్ల పాటు పెప్సీ కంపెనీలో పని చేశారు. అందులో 12 ఏళ్ల పాటు సీఈవోగా కొనసాగారు. ఆమె సీఈవోగా ఉన్న కాలంలో పెప్పీ కంపెనీ రెవెన్యూ 35 బిలియన్ల నుంచి 63 బిలియన్లకు చేరుకుంది. తొలి గ్లోబల్ మహిళా సీఈవోగా ఇంద్రనూయి రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత ఇటీవల లీనా నాయర్ ఛానల్ సంస్థకు గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. -
ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో.. అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలవగా.. సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. 1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు. కాన్ఫ్లుయెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్లు, జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా 29, 39వ స్థానాల్లో నిలిచారు. పెప్సికో సంస్థ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్ర నూయి.. 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు. -
ఉన్నత శిఖరాలు.. సాటిలేని సామర్థ్యాలు
శిఖరానికి కిరీటం పెడితే ఎలా ఉంటుంది? అత్యున్నతమైన పదవిలో ఒక మహిళ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది! వీళ్లెవరూ పదవుల కోసం ప్రయత్నించలేదు. పదవులే వీళ్ల కోసం ప్రయత్నించాయి. పనిలో సామర్థ్యం.. అంకితభావం.. నిబద్ధత ఉంటే.. ‘మీరే మమ్మల్ని లీడ్ చెయ్యాలి మేడమ్’ అని గొప్ప గొప్ప సంస్థలే అప్లికేషన్ పెట్టుకుంటాయి. అలా ఈ ఏడాది ‘లీడింగ్’లోకి వచ్చిన మహిళలు వీరు. 1. గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2. సుమన్ కుమారి, పాకిస్తాన్లో సివిల్ జడ్జి పాకిస్తాన్ సివిల్ న్యాయమూర్తిగా సుమన్ కుమారి జనవరిలో నియమితులయ్యారు. ఖంబర్–షాదద్కోట్ జిల్లాకు చెందిన కుమారి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఒక హిందూ మహిళ పాకిస్తాన్లో జడ్జి కావడం ఇదే మొదటిసారి. 3. ఇంద్రా నూయి, అమెజాన్ డైరెక్టర్ అమెజాన్ కంపెనీ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళా ఇంద్రానూయి ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. అమెజాన్‌లో డైరెక్టర్ అయిన రెండో మహిళగా ఇంద్రా నూయి గుర్తింపు పొందారు. ఆమెకన్నా ముందు 2019 ఫిబ్రవరి మొదటివారంలో స్టార్‌బక్స్ ఎగ్జిక్యూటివ్ రోసలిండ్ బ్రెవర్ అమెజాన్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. 4.జీసీ అనుపమ, ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్ ఆస్టన్రామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తొలి మహిళా ప్రెసిడెంట్‌గా డాక్టర్ జీసీ అనుపమ ఎన్నికయ్యారు. అనుపమ సూపర్‌నోవాపై పరిశోధనలు చేశారు. 5. నీలా విఖేపాటిల్, స్వీడన్ ప్రధాని సలహాదారు స్వీడన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా భారత సంతతికి చెందిన మహిళ, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖేపాటిల్ నియమితులయ్యారు. స్వీడన్లో జన్మించిన నీలా గుజరాత్‌లోని అహ్మద్‌నగర్‌లో తన బాల్యాన్ని గడిపారు. 6. నియోమీ జహంగీర్ రావు, యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జి అమెరికాలోని ప్రఖ్యాత డిస్టిక్ర్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్రావు ఎన్నికయ్యారు. 7. పద్మాలక్ష్మి , యూఎన్డీపీ అంబాసిడర్ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి మార్చిలో నియమితులయ్యారు. 8. దియామీర్జా, ఐరాస ఎస్డీజీ ప్రచారకర్త ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియామీర్జా ఎంపికయ్యారు. పేదరికాన్ని రూపుమాపడం; అందరికీ ఆరోగ్యసంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. 9. అనితా భాటియా, యూఎన్–ఉమెన్ డిప్యూటీ డెరైక్టర్ మహిళా సాధికారత, స్త్రీ–పురుష సమానత్వంపై కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్–ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా మేలో నియమితులయ్యారు. కలకత్తా లో బీఏ చదివిన అనిత వనరుల సమీకరణ, నిర్వహణలో నిష్ణాతురాలు. 10. ప్రమీల జయపాల్, అమెరికా తాత్కాలిక స్పీకర్ అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్‌గా ప్రమీల జయపాల్ జూన్‌లో సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ప్రమీల నిలిచారు. 11. షలీజా ధామీ, తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్ వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో తొలి మహిళా కమాండర్‌గా నిలిచారు. హెలికాప్టర్లను నడపడంలో ధామీకి 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 12. అంజలీ సింగ్, తొలి మహిళా సైనిక దౌత్యాధికారి విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ రికార్డు నెలకొల్పారు. రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ‘డిప్యూటీ ఎయిర్ అటాచీ’గా అంజలి సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించారు. -
‘అమెజాన్’లోకి ఇంద్రా నూయి!
వాషింగ్టన్ : పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె అమెజాన్ ఆడిట్ కమిటీలో తన సేవలు అందించనున్నారు.ఈ మేరకు అమెజాన్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రా నూయి చేరికతో అమెజాన్ బోర్డు సభ్యుల్లో మహిళల సంఖ్య ఐదుకు చేరింది. కంపెనీ కొత్త పాలసీ ప్రకారం వివిధ కంపెనీల్లో ఉత్తమ సేవలు అందించిన, అందిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలను బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ వస్తోంది. అదే విధంగా మహిళా ప్రాధాన్యం పెంచే క్రమంలో గతేడాది స్టార్‌బక్స్ కార్పోరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోసాలిండ్ బ్రూవర్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించిన అమెజాన్... జామీ గోరెలిక్, జూడిత్ మెగ్రాత్, పాట్రిసియా స్టోన్సిఫర్లకు అవకాశం కల్పించింది. తాజాగా ఇంద్రా నూయి నియామకంతో 11 మంది సభ్యులతో కూడిన బోర్డులో మహిళల సంఖ్య ఐదుకు చేరింది. కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేసిన ఇండో-అమెరికన్ ఇంద్రా నూయి తన పదవి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె గతేడాది అక్టోబర్ 3న తన బాధ్యతల నుంచి వైదొలగారు. ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అమెజాన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వీరే.. జెఫ్ బెజోస్ (అమెజాన్ సీఈఓ, చైర్మన్) టామ్ అల్బర్గ్ (మద్రోనా వెంచర్ గ్రూపు స్థాపకులు) *రోసాలిండ్ బ్రూవర్(స్టార్‌బక్స్ సీఓఓ) *జామీ గోరెలిక్(యూఎస్ మాజీ డిప్యూటీ అటార్నీ జనరల్) డానియల్ హట్టెన్లోచర్(డీన్ ఆఫ్ కార్నెల్ టెక్) *జూడిత్ మెగ్రాత్(ఎంటీవీ నెట్వర్క్ మాజీ సీఈఓ) జొనాథన్ రూబీన్స్టీన్(పాల్ సీఈఓ, ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటిక్) థామస్ రైడర్(ది రీడర్స్ డైజెస్ట్ అసోసియేషన్ మాజీ సీఈఓ) *పెట్రిసియా స్టోన్సిఫర్(మార్తా టేబుల్ సీఈఓ) వెండల్ వీక్స్(కార్నింగ్ సీఈఓ) *ఇంద్రా నూయి(పెప్సీకో మాజీ సీఈఓ) -
ప్రపంచ బ్యాంకు సారథిగా ఇంద్రా నూయి?
న్యూయార్క్: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవి రేసులో పెప్సీకో మాజీ సీఈవో, జన్మతః భారతీయురాలైన ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక, ఇంద్రా నూయి పేరును ప్రతిపాదించారు. ఇంద్రా నూయిని మార్గదర్శిగా, స్ఫూర్తినీయురాలిగా పేర్కొంటూ ఇవాంకా గత ఆగస్ట్‌లో ఓ ట్వీట్ కూడా చేశారు. అయితే, తన నామినేషన్‌ను ఇంద్రా నూయి అంగీకరిస్తారా, లేదా అన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ ఫిబ్రవరిలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. నిర్ణీత పదవీ కాలం కంటే మూడేళ్ల ముందే ఆయన తప్పుకుంటున్నారు. కిమ్ వారసుల ఎంపిక ప్రక్రియను ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముంచిన్, ఇవాంకా చూస్తున్నారు. ఈ కమిటీ అభ్యర్థుల నామినేషన్లతో కూడిన జాబితాను ట్రంప్ ముందు ఉంచనున్నారు. ఇవాంక మద్దతుతో నూయి ప్రధాన పోటీదారుగా మారడం ఆసక్తికరం. రేసులో మరో ఇద్దరు... ఇక ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి....అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి డేవిడ్ మల్పాస్, ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రే వాష్బర్న్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని ప్రపంచ బ్యాంక్ బోర్డ్ నియమిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షడు నామినేట్ చేసిన వ్యక్తే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు కావడం రివాజు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు పదవిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురిని నియమించడం పట్ల ఇప్పటికే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి విషయంలో ఇవాంకా జోక్యం చేసుకోవడంతో ఈ విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. తన స్వప్రయోజనాల కోసం ఇవాంకా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చుతున్నారన్న విమర్శలున్నాయి. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇంద్రానూయి?
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆమె ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షరాలిగా ఇంద్రా నూయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నామినేట్ చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. 12 ఏళ్లు పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. గత ఆగస్ట్‌లో పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి అమెరికా తన పేరును ప్రతిపాదిస్తే ఇంద్రా నూయి ఏమంటారో చూడాలి. అధ్యక్షుడిని ప్రతిపాదించే వ్యక్తుల్లో ఇవాంక ట్రంప్ కీలక వ్యక్తి కావడంతో ఆమె విజ్ఞప్తిని సభ్య దేశాలు ఆమోదించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్, ఇవాంకా అనేక సార్లు ప్రశంసించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి మొదట ఇవాంక, నిక్కి హేలి పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. -
‘రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ యుద్ధమే’
న్యూయార్క్ : తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ప్రతిష్టాత్మక ఏషియా సోసైటి ఫౌండేషన్ అందించే ‘గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషయాల గురించి మాట్లాడారు. ‘ట్రంప్ క్యాబినేట్లో మీరు జాయిన్ అవ్వొచ్చు కదా’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ‘నాకు రాజకీయాలు సరిపోవు. నాకు సరిగా మాట్లడటమే రాదు. ఇంక లౌక్యంగా ఎలా మాట్లాడగలను.. ఒకవేళ నేను గనక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది’ అంటూ ఇంద్ర నూయి చమత్కరించారు. పెప్పీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈ నెల 3న ఇంద్ర నూయి ప్రకటించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘దాదాపు 40 ఏళ్లుగా నా రోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యేది. రోజుకు దాదాపు 18 - 20 గంటలు పనిచేసే దాన్ని. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు నేను రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. వీలైనన్ని దేశాలు చుట్టి రావాలి’ అంటూ చెప్పుకొచ్చారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే నేడు ఇంద్రా నూయి....
సాక్షి, న్యూఢిల్లీ : ‘విదేశానికి వెళ్లేందుకు నాకు ఉపకార వేతనం రాదని నా తల్లిదండ్రులు అప్పట్లో గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే నిన్ను మేమెందుకు ఆపుతాం! అంటూ నన్ను అనునయిస్తూ వచ్చారు. తీరా ఉపకార వేతనం మంజూరవడంతో వారు ఊగిసలాటలో పడ్డారు. పెళ్లికాని అమ్మాయిని విదేశానికి ఎలా పంపించాలి? పంపిస్తే ఒంటరిగా విదేశానికి వెళ్లిందన్న కారణంగా జీవితంలో పెళ్లి కాదుగదా! అన్నది వారి సంశయం. కుటుంబ సభ్యులందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టారు. పంపించాలా, వద్దా ! అంటూ చాలాసేపు తర్జనభర్జన పడ్డారు. నేను మాత్రం ఏది ఏమైనా వెళతానని శపథం చేశాను. చివరకు పెళ్లి చేసి పంపించాలనుకున్నారు. అది అంత త్వరగా సాధ్యం కాదని గ్రహించారు. చివరకు పంపించేందుకు అయిష్టంగానే అంగీకరించారు. అలా నేను 1978లో ఐదు వందల డాలర్లను జేబులో పెట్టుకొని అమెరికా బయల్దేరాను’ అని అమెరికాలోని ప్రముఖ బహూళార్థక కంపెనీ ‘పెప్సికో’ కంపెనీకి 2006 నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఇంద్రానూయి ఈ ఏడాది జరిగిన ‘ఫోర్బ్స్ మహిళల సమ్మేళనం’లో తన గురించి చెప్పుకొచ్చారు. అమెరికా దిగ్గజ కంపెనీకి పనిచేస్తున్న తొలి విదేశీ సంతతి వ్యక్తిగా, కంపెనీ తొలి మహిళా సీఈవోగా చరిత్ర సృష్టించిన ఇంద్రా నూయి, అక్టోబర్ 3వ తేదీ నాడు కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఎన్నో కంపెనీల్లో పనిచేసి అంచెలంచెలుగా అందరికి అందని ఎత్తుకు ఎదిగిన ఇంద్రా నూయి పెళ్లికి ముందు పేరు ఇంద్రా కృష్ణమూర్తి. తమిళ సంప్రదాయక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె చైన్నైలో అక్టోబర్ 28, 1955లో జన్నించారు. ‘మా అక్కయ్య చంద్రికైనా, నేనయినా జీవితంలో రాణించడానికి కారణం మా అమ్మ. రోజు భోజనాల దగ్గర మా ఇద్దరికి ఓ పోటీ పెట్టేది. ప్రధాన మంత్రి అయితే ఎలా మాట్లాడతావు ? ముఖ్యమంత్రయితే ఎలా మాట్లాడతావు ? ఒక్క భారత దేశానికే పరిమితం కాకుండా బ్రిటీష్ ప్రధాని అయితే ఎలా, అమెరికా అధ్యక్షులయితే ఎలా? అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి అయితే ఎలా, కశ్మీర్ ముఖ్యమంత్రి అయితే ఎలా? అని ప్రశ్నించేది. తింటున్నంత సేపు ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఉండేవాళ్లం. భోజనం ముగిశాక పరకాయ ప్రవేశంలా వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నాయకుల్లా చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చేసే వాళ్లం. వాటిని శ్రద్ధగా ఆలకించే మా అమ్మ వాటికి మార్కులను కూడా కేటాయించేది’ అని ఓ సందర్భంలో పదేళ్ల క్రితం తన గురించి ఇంద్రా చెప్పుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివిన ఇంద్రా కృష్ణమూర్తి ఓ బ్యాండ్ తరఫున గిటార్ వాయించే వారు. క్రికెట్లో కూడా మంచి ప్రావీణ్యం చూపించారు. అయినా చదువును నిర్లక్ష్యం చేయకుండా 1974లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకోవాలనుకున్నారు. అప్పట్లో మహిళలు బిజినెస్ చదువుల పట్ల అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘ఐఐఎంకు అప్పట్లో కూడా కొన్ని వేల మంది పరీక్ష రాశారు. వారిలో కొందరికే అడ్మిషన్లు లభించాయి. 150 మంది అహ్మదాబాద్ బ్రాంచ్‌కు వెళ్లారు. మరో వంద మంది కలకత్తాకు వెళ్లారు. వారిలో అతి తక్కువ మంది మహిళలు. వారిలో నేను ఒకరిని. అడ్డుగోడను బద్దలు కొట్టాలన్న తపన కారణంగానే నాడు బిజినెస్ చదవ గలిగాను’ అని గతేడాది ‘పోయెట్స్ అండ్ క్వాంట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రా చెప్పుకున్నారు. బిజినెస్‌లో పట్టా పుచ్చుకున్నాక ఇంద్రా మెట్టూర్ బియర్డ్సెల్లో, ఆ తర్వాత ముంబైలోని జాన్సన్ అండ్ జాన్సన్లో పనిచేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ తరఫున ‘స్టే ఫ్రీ’ శానిటరీ నాప్కిన్స్ను తీసుకరావడంలో ఆమె ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. అమెరికాలోని పలు యూనివర్శిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్షిప్ కూడా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ఇచ్చి చేర్చుకోవడానికి యేల్ యూనివర్శిటీ ముందుకు వచ్చింది. అలా అమె 1980లో ‘యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’ నుంచి పబ్లిక్, ప్రైవేట్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఆమె ఆ తర్వాత కొద్ది రోజులకే రాజ్ నూయిని పెళ్లి చేసుకొని ఇంద్రా నూయిగా మారిపోయారు. రాజ్ నూయి ప్రస్తుతం ‘ఏఎం సాఫ్ట్ సిస్టమ్స్’కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తర్వాత నూయి ‘బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్’లో చేరి ఆరేళ్లు పనిచేశారు. 1986లో ‘మోటరోలా’ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. అక్కడి నుంచి 1990లో స్విస్ పారిశ్రామిక ఉత్పత్తుల కంపెనీ ‘ఆసియా బ్రౌన్ బోవరి’లో యాజమాన్య బృందంలో ఒకరిగా చేరారు. 1994లో పెప్సికో కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఆమె చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా మారి కంపెనీ తరఫున చర్చలు జరిపి పలు కంపెనీలను కొనుగోలు చేయించారు. అలా ఎదుగుతూ వచ్చి 2006లో సీఈవో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా గుడ్‌బై చెప్పాక ఆమె ఎక్కడికెళతారో, ఏ బాధ్యతలు స్వీకరిస్తారో ఇంకా వెల్లడించలేదు. -
మీతో స్నేహం.. నేను చాలా హ్యాపీ : ఇవాంక
వాషింగ్టన్ : ప్రపంచ పారిశ్రామిక రంగంలో అత్యంత ప్రభావశీలిగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ ప్రశంసలు కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించేందుకు.. ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగాతో పాటు పలువురు కార్పొరేట్ లీడర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఏర్పాటు చేశారు. న్యూజెర్సీలోని ట్రంప్ ప్రైవేట్ గోల్ఫ్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, ఆమె భర్త జెరెడ్ ఖుష్నెర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్ ప్రశంసించారు. ‘12 ఏళ్లుగా పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. ఇంద్రా.. నాలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలకు మీరే స్ఫూర్తి. మీలాంటి గొప్ప వ్యక్తితో స్నేహం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ దేశ(అమెరికా) ప్రజల కోసం ఇన్నాళ్లుగా ఎంతగానో శ్రమించిన మీకు కృతఙ్ఞతలు’ అంటూ ఇవాంక ట్వీట్ చేశారు. కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న ఇండో-అమెరికన్ ఇంద్రా నూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్న విషయం తెలిసిందే.12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్ 3న తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. The great @IndraNooyi is stepping down as PepsiCo CEO, after 12 yrs. Indra, you are a mentor + inspiration to so many, myself included. I am deeply grateful for your friendship. Thank you for your passionate engagement on issues that benefit the people of this country, and beyond — Ivanka Trump (@IvankaTrump) August 7, 2018 -
పెప్సీలో ‘ఇంద్రా’ శకానికి తెర!
న్యూయార్క్: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రానూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్ 3న తన బాధ్యతలను కొత్త సారథికి అప్పగించనున్నారు. కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాను నూతన సీఈవోగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎంపిక చేసింది. ఇవి మినహా కంపెనీ యాజమాన్యంలో మరే మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. పెప్సీకోతో ఇంద్రానూయికి ఉన్న 24 ఏళ్ల అనుబంధం కూడా త్వరలోనే ముగిసిపోనుంది. సీఈవోగా వైదొలిగినా, వచ్చే ఏడాది ఆరంభం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. తాజా పరిణామంపై ఆమె స్పందిస్తూ కంపెనీకి మంచి రోజులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ‘‘భారత్‌లో పెరుగుతున్న నేను ఈ స్థాయి కంపెనీని నడిపించే అవకాశం లభిస్తుందనుకోలేదు. గడిచిన 12 సంవత్సరాల్లో వాటాదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం చేసిన కృషికి గర్విస్తున్నాం. ఉత్తమ కంపెనీగా మారేందుకు, ఉత్తమ కంపెనీగానూ కొనసాగేందుకు మా ప్రపంచ బృందం చేసిన అద్భుత ప్రయాణాన్ని ప్రశంసిస్తున్నాను’’అని ఇంద్రా నూయి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు నాకు భావోద్వేగాల మిశ్రమంతో కూడినది. పెప్సీకోతో 24 ఏళ్ల ప్రయాణం. నా హృదయంలో కొంత భాగం కంపెనీతోనే ఉంటుంది. భవిష్యత్తు కోసం మేం చేసిన దాని పట్ల గర్విస్తున్నాం. పెప్సీకోకు మంచి రోజులు రావాల్సి ఉంది. పర్యావరణ వినియోగాన్ని పరిమితం చేస్తూనే ప్రజల జీవితాలపై అర్థవంతమైన ప్రభావం చూపించాం. ఉజ్వలమైన భవిష్యత్తుకు వృద్ధిని కొనసాగించే బలమైన స్థితిలో పెప్సీకో ఉంది’’ అని నూయి పేర్కొన్నారు. మార్పు దిశగా నడిపించారు... రామన్ లగుర్తా సైతం పెప్సీకో సీనియర్ ఉద్యోగుల్లో ఒకరు. 22 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కాలంలో ఎన్నో నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, కార్పొరేట్ విధానాలు, పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రానూయి నాయకత్వాన్ని ఈ సందర్భంగా రామన్ ప్రశంసించారు. తన సాహసోపేతమైన దృష్టి, అసాధారణ నాయకత్వంతో కంపెనీని మార్చివేశారని పేర్కొన్నారు. వాటాదారులకు లాభాలు... ఇంద్రా సారథ్యంలో పెప్సీకో మంచి ఫలితాలను సాధించింది. 2006 నుంచి 2017 నాటికి వాటాదారులకు 162% ప్రతిఫలం లభించింది. వాటాదారులకు డివిడెండ్లు, షేర్ల తిరిగి కొనుగోలు ద్వారా 2006 ప్రారంభం నుంచి 2017 చివరి నాటికి 79.4 బిలియన్ డాలర్ల (రూ.5.39 లక్షల కోట్లు) లాభాలను పంచారు. 2006లో 35 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయాన్ని 2017 నాటికి 63.5 బిలియన్ డాలర్లకు చేర్చారు. గత 12ఏళ్లలో అసాధారణ నాయకత్వాన్ని అందించారని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తరఫున ప్రిసైడింగ్ డైరెక్టర్ ఇయాన్‌కుక్ పేర్కొన్నారు. శక్తివంతమైన వ్యాపార మహిళ ఇంద్రానూయి పెప్సీకో సీఈవోగా తప్పుకోవడం వెనుక కారణం ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ సారధిగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు. ‘ప్రపంచంలో శక్తివంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చ్యూన్స్ జాబితా 2017లో 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో టాప్–100 శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా 2014లో ఫోర్బ్స్ జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగానూ అగ్ర స్థానంలో ఉన్నారు. కార్పొరేట్ అమెరికా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థను నడిపించిన భారత మహిళామణుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించారు. చెన్నై నుంచి అమెరికాకు.. మద్రాస్‌లో జన్మించిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలోని క్రిస్టియన్ కాలేజీలో 1974లో డిగ్రీ ముగించారు. ఐఐఎం, కల్కత్తా నుంచి ఎంబీఏ చేశారు. దేశీయంగానే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 1978లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేరి పబ్లిక్, ప్రైవేటు మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. తర్వాత బోస్టన్ గ్రూపులో చేరారు. అనంతరం మోటరోలా, ఏసీ బ్రౌన్ బొవేరిలోనూ పనిచేశాక 1994లో పెప్సీకో ఉద్యోగిగా మారారు. 2001లో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో. యుమ్ బ్రాండ్ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్ ఓట్స్ విలీనం, గాటొరేడ్ కొనుగోలులో కీలక పాత్ర పోషించారు. -
తప్పుకుంటున్న పెప్సీకో బాస్ ఇంద్రా నూయి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ బిజినెస్ దిగ్గజం పెప్సీ కంపెనీ సీఈవో భారత్‌కు చెందిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి (62) పదవీ విరమణ చేయనున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరైన ఇంద్రానూయి త్వరలోనే తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెప్సీకో సంస్థతో 24 సంవత్సరాల అనుబంధం, సీఈవోగా 12 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇంద్రా నూయి స్థానంలో.. ఆ కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగౌర్తా కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే 2019 ఆరంభం వరకు ఆమెనే చైర్మన్‌గా కొనసాగుతారు. ఇండియాలో పుట్టిపెరిగి, పెప్సీకో లాంటి అసాధారణ సంస్థను నడిపించే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని నూయి వ్యాఖ్యానించారు. సీఈవోగా తమ ఉత్పత్తులతో ఊహించిన దాని కంటే ప్రజల జీవితాల్లో మరింత అర్ధవంతమైన ప్రభావం చూపానన్నారు. నేడు చాలా దృఢంగా ఉన్న పెప్సీకో కంపెనీ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కంపెనీకి ఇన్నాళ్లు సేవలందించినందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Today is a day of mixed emotions for me. @PepsiCo has been my life for 24 years & part of my heart will always remain here. I'm proud of what we've done & excited for the future. I believe PepsiCo’s best days are yet to come. https://t.co/sSNfPgVK6W pic.twitter.com/170vIBHY5R — Indra Nooyi (@IndraNooyi) August 6, 2018 -
ఆర్థిక రంగం ఆణిముత్యాలు
‘‘సుదీర్ఘ కాలంగా ఆర్థికరంగం అంటే కేవలం పురుషులకే పరిమితమైన రంగంగా ఉంటూ వచ్చింది. అది బ్యాంకింగ్ రంగమైనా, బీమా, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు ఇలా ఏ రంగమైనా అది మహిళలకు సంబంధించింది కాదనే భావన. దాదాపు మహిళలందరూ ఈ భావనతోనే ఈ రంగాలవైపు (ఆసక్తి వున్నా) వెనకడుగు వేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత ఈ పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. వివిధ రంగాలతోపాటు ఆర్థిక రంగంలో కూడా మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం మొదలు పెట్టారు. ‘‘విత్తం అంటే కేవలం పురుషుల సొత్తే’’ కాదంటూ తమ సత్తా చాటడం మొదలు పెట్టారు. వారిలో ప్రముఖమైన మహిళల్ని ఇపుడు చూద్దాం’’. చందా కొచ్చర్ జోధ్ పూర్లో జన్మించిన చందా కొచ్చర్ భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవోగా తన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 1984 లో ట్రైనీగా ప్రారంభమైన ఆమె ప్రయాణం బ్యాంకు అత్యున్నత అధికారిగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయబావుటా ఎగరేస్తూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంతో దెబ్బతిన్న సమయంలో ఆమె బ్యాంకును విజయపథంలో నడిపించారు. ఆమె నాయకత్వంలోనే ఐసీఐసీఐ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటిగా నిలవడం గమనించాల్సిన విషయం. దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. ఆర్థిక రంగంలో ఆమె చేసిన విశేష సేవలకు గాను 2010లో ఆమెకు పద్మభూషణ్ దక్కంది. అలా మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి ఎండీదాకా సాగిన చందా కొచ్చర్ ప్రస్థానం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే అనేకమంది యువతులకు ప్రేరణ. ఉషా అనంతసుబ్రమణియన్ 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉషా అనంత సుబ్రమణియన్ సొంతం. స్టాటస్టిక్స్ లో దిట్ట. ప్రస్తుతం, అలహాబాద్ బ్యాంక్ సీఎండీగా ఉన్న ఉషా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్ లాంటి బ్యాంకులకు సారధ్యం వహించారు.అనంత సుబ్రమణియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ)తో యాక్ట్యుయేరియల్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించారు. స్టాటస్టిక్స్‌లో ఆమెకున్న పట్టుతో తన సామర్ధ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తులు క్షీణిస్తూ....దయనీయ పరిస్థితుల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పరిశీలనలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారధ్య బాధ్యతలు ఆమెకు అప్పగించారు. తన అనుభవం, ప్రతిభతో బ్యాంకును కష్టాలనుంచి గట్టెక్కిండచడంతోపాటు.. లాభాల బాట పట్టించిన ఘనతను సాధించారామె. ముఖ్యంగా మొట్టమొదటి భారతీయ మహిళా బ్యాంకు స్థాపనలో ఆమె కృషి ప్రధానంగా చెప్పుకోదగ్గది. (భారతీయ మహిళా బ్యాంకు ఇపుడు ఎస్బీఐలో విలీనమైంది). శిఖా శర్మ భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ. 1980 లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ రిటైల్ ఫైనాన్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. ఆర్ధిక రంగంలో మూడు దశాబ్దాల విశేష అనుభవంతో యాక్సిస్ బ్యాంకు సారధ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ విభాగంలో తనదైన ముద్రతో యాక్సిస్ బ్యాంకును అగ్రభాగంలో నిలిపే లక్ష్యంతో సాగుతున్నారు. అరుంధతి భట్టాచార్య దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగబ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 208 సంవత్సరాల ఎస్బీఐచరిత్రలో, ఈ ఘనతను సాధించిన మొదటి మహిళగా భట్టాచార్య గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్’ 2016 లో 25వ స్థానంలో నిలిచారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెబాటికల్ లీవ్ విధానాన్ని ఆమె పరిచయం చేశారు. దీన్నిమహిళలు ప్రసూతి సెలవు లేదా పెద్దల సంరక్షణల బాధ్యతల సందర్భంగా వినియోగించుకోవచ్చు.అలాగే సర్వైకల్ క్యాన్సర్ టీకాను మహిళా ఉద్యోగులందరు ఉచితంగా పొందే సౌకర్యాన్ని కల్పించారు. చిత్ర రామకృష్ణ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారిలో చిత్రా రామకృష్ణ ప్రముఖులు. అంతేకాదు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) కు బలమైన పోటీదారుగా ఎన్ఎస్ఈని నిలపడంలో ఆమె కృషి చాలా ఉంది. మార్కేట్ రెగ్యులేటరీ సెబీకి కూడా ఆమె తన సేవలనందించారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా కెరియర్ ను ప్రారంభించిన చిత్ర ఐడీబీఐ బ్యాంకులో ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగంలో పనిచేశారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటినుంచి వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె 2013లో (20 ఏళ్ల తరువాత) సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. అదే సంవత్సరం ఫోర్బ్స్ ఇండియన్ విమెన్ లీడర్ పురస్కారం గెలుచుకున్నారు. డిసెంబరు 2, 2016 న ఆమె పదవికి రాజీనామా చేశారు. ఉషా సంగ్వాన్ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కి మొట్టమొదటి మహిళా ఎండీ ఉషా సంగ్వాన్. సాధారణంగా ఎల్ఐసీకి టెక్నికల్‌గా నలుగురు ఎండీలు సారధ్యం వహిస్తారు. అయితే నలుగురు ఎండీలు కంపెనీని వీడిన అనంతరం ఎండీ పదవిన చేపట్టిన ఉషా సంస్థను ఆరునెలలపాటు ఒంటి చేత్తో నడిపించడం విశేషం. ఈ కాలంలో ఎల్ఐసి మార్కెట్ వాటా 70 శాతంనుంచి 71శాతానికి పెరిగింది. క్లెయియ్ పరిష్కార నిష్పత్తి 99.6 శాతం వద్ద ఉంది. వాణి కోలా బెంగళూరు ఆధారిత కోలారి క్యాపిటల్ వ్యవస్థాపకురాలు, ఎండీ వాణి కోలా. కోలారి క్యాపిటల్‌ను నెలకొల్పినప్పటినుంచీ విజయపథంలో నడిపించారు. తద్వారా దేశంలో వెంచర్ పెట్టుబడి సంస్థలలో ఒకటిగా నిలిపారు. 22 ఏళ్లపాటు సిలికాన్ వ్యాలీలో, 10సంవత్సరాలు వెంచర్ క్యాపిటలిస్టుగా సేవలనందించారు. సిలికాన్ వ్యాలీలో సర్టస్ సంస్థకు వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా ఉన్నారు. అంతకుముందు ఇ- ప్రొక్యూర్ మెంట్ కంపెనీ రైట్ వర్క్స్‌కు సీఈవోగా పనిచేశారు.2005 లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆరు నెలలకాలంలోనే 210 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సహా దాదాపు 60 స్టార్టప్ కంపెనీల్లో 650 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను సాధించిన ఘనత ఆమె సొంతం. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన వాణి కోలా ఉస్మానియా యూనివర్శిటీలో, అరిజోనా యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. ఇంద్రనూయి 1955లో తమిళనాడులోని మద్రాసులో జన్మించిన ఇంద్రనూయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆహార, పానీయాల కంపెనీ పెప్సీకోకు సీయీవోగా ఎదిగారు. ఫోర్బ్స్ వారు ప్రకటించిన ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో 13వ స్థానంలో నిలిచారు. 2001లో ఆమె పెప్సీకో కంపెనీలో చేరినప్పుడు సంస్థ నికర లాభం 2.7బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం అది 6.5బిలియన్ డాలర్లకు చేరుకోవడంలో ఆమె చేసిన కృషి అమోఘం. ఆమె కృషికి తగ్గ ఫలితంగా ఆమె ప్రస్తుతం సంవత్సరానికి 18.6మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నారు. కావేరి కళానిధి మారన్ సన్ టీవీ మానేజింగ్ డైరెక్టర్‌గా సంవత్సరానికి 18మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందుతున్నారు. ఇన్ఫోసిస్ సీయీవో వేతనం కంటే కూడా ఇది అధికం. 2010 నుంచి 2015 వరకూ స్పైస్‌జెట్ చైర్మన్‌గా పనిచేశారు. కిరణ్ మజుందార్ షా బెంగెళూరులో బయోకాన్ బయోటెక్నాలజీ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం సంస్థ మానేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సంవత్సరానికి రూ.16కోట్ల వేతనం పొందుతూ దేశంలో అత్యంత ధనవంతురాలుగా గుర్తింపు పొందుతున్న మహిళ. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాలలో ఆమె చేసిన రచనలకు గాను 2014లో ఒత్మేర్ గోల్డమెడల్ పొందారు. ఐఐఎమ్ బెంగుళూరుకు చైరపర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉర్వి పిరమాల్ సంవత్సరానికి రూ.10కోట్ల వేతనం పొందుతూ నాల్గో స్థానంలో నిలిచారు ఉర్వి పిరమాల్, అశోక్ పిరమాల్ సంస్థ అధినేత్రి. తన 32వ ఏట భర్తను కోల్పొయారు. తదనంతరం కుటుంబ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. కుటుంబ వ్యాపారం విడిపోయిన తర్వాత ఉర్వి పిరమాల్‌కు తన వాటాగా ఒక టెక్సటైల్ మిల్, రెండు ఇంజనీరింగ్ సంస్థలు లభించాయి. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను ఆమె తిరిగి లాభాల బాట పట్టించారు. ప్రస్తుతం ఈ సంస్థల సంవత్సర ఆదాయం రూ.1600కోట్లు. ఆర్తీ సుబ్రమణియన్ ‘‘ఉత్తమమైనది తప్ప మరేమి వద్దు’’ ఇదే ఆర్తీ సుబ్రమణియన్ పాటించే సూత్రం. అదే ఆమెను టీసీఎస్ లాంటి టాప్ కంపెనీకి ఎక్సిక్యూటీవ్ డైరెక్టరుగా ఎదిగేలా చేసింది. ఆమె ఈడీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సాధించిన అతి గొప్ప విజయం పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు. పాస్‌పోర్టు జారీ ప్రక్రియను పూర్తిగా మార్చి డిజిటైజేషన్ చేశారు. టీసీఎస్ చరిత్రలోనే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలైన తొలి మహిళ. ఆమె తోటి ఉద్యోగులు ఆమెను ప్రేమగా ‘మిస్.ఫిక్సిట్’ అని పిలుచుకుంటారు. వనిత నారయానణ్ టెక్ దిగ్గజం ఐబీఎమ్ గురించి మనలో చాలా మందికి తెలుసు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్ధి ఐబీఎమ్‌లో ఉద్యోగం గురించి కలలు కంటుంటారు. వనితా నారయానణ్ కూడా అలానే అనుకుంది, అనుకోవడమే కాకుండా అందులో ఉద్యోగం కూడా సంపాదించారు. 1985లో ఐబీఎమ్‌లో సాధరణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 2013లో ఐబీఎమ్ ఇండియాకు మానేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియా/సౌత్ ఆసియాకు రిజనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 25 సంవత్సరాల నుంచి వివిధ దేశాల్లో పర్యటిస్తూ, వేర్వేరు రకాల వ్యక్తులతో పనిచేస్తున్నారు. 2013-14లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో సభ్యురాలిగా పనిచేశారు. నీలమ్ ధావన్ హెచ్‌పీ కంప్యూటర్లు, ప్రింటర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అంత గొప్ప పేరు ఉన్న కంపెనీకి ఇండియాలో మానేజింగ్ డైరెక్టరుగా నియమితులయ్యారు నీలం ధావన్. కేవలం కంప్యూటర్లు, ప్రిటింగ్ పరికరాలకే పరిమితమైన కంపేని సేవలను బీపీవో, సాఫ్ట్వేర్, పరిశోధన - సేవలకు కూడా విస్తరించి ప్రస్తుతం హెచ్‌పీ కంపెనీని దేశంలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీగా నిలబెట్టారు. హెచ్‌పీలో చేరడానికంటే ముంది నీలం 2005నుంచి 2008వరకూ మైక్రోసాఫ్ట్ ఇండియాకు మానేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్‌సీఎల్, ఐబీఎమ్ కంపెనీల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అరుణ జయంతి 2011 సెప్టెంబరులో కాప్జెమిని సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన అరుణ జయంతిది ఈ రంగలో రెండు దశాబ్దల అనుభవం. సీయీవోగా చేయడానికి కంటే ముంది అరుణ కాప్ జెమినిలో ఔవుట్ సోర్సింగ్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఔవుట్సోర్సింగ్ సేవల విలువలను గణనీయంగా పెంచారు. సీయీవోగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే భారతీయ వ్యాపార రంగంలో తన ఉనికిని చాటుకున్నారు. 2013లో ఇండియా టుడే వారు ప్రకటించిన ఇండియన్ వుమేన్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. క్రితిగా రెడ్డి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను విస్తరించింది ఈ కంపెనీ. ఇంతపెద్ద కంపెనీలో భారతదేశం నుంచి ఉద్యోగంలో చేరిన తొలి మహిళ క్రితిగా రెడ్డి. 2010లో ఉద్యోగంలో చేరిన క్రితిగా రెడ్డి ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో తన సేవలను విస్తరించేందుకుగాను హైదరాబాదులో ప్రారంభించిన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫార్చున్ పత్రిక ప్రకటించే టాప్ 50 మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. పిల్లలు, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. కుముద్ శ్రీనివాసన్ 1987లో ఇంటెల్ కంపెనీలో చేరిన కుముద్ శ్రీనివాసన్ బిజినేస్, ఇనఫర్మేషన్ సిస్టమ్స్‌లో వేర్వేరు బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం భారత్‌లో ఇంటెల్‌కు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరులోని ఐఐఐటీ గవర్నింగ్ బాడీలో సభ్యురాలిగా పనిచేశారు. తన్యా దుబాష్ గోద్రెజ్ ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో తెలిసిన విషయమే. సబ్బుల దగ్గర నుంచి లాకర్ల వరకూ ఎనో ఉత్పత్తులను తయారుచేస్తుంది ఈ కంపెనీ. కానీ ఒకానొక సందర్భంలో కంపెనీలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ముందు గుర్తించి నష్టం వాటిల్లకుండా చూసి కంపెనీని తిరిగి పుంజుకునేలా చేసిన ఘనత తన్యా దుబాష్ది. తన్యా దుబాష్, ఆది గోద్రెజ్ పెద్ద కుమార్తే. తన్యా దుబాష్ భారతీయ మహిళ బ్యాంకు బోర్డు మెంబరు. సునితా రెడ్డి వైద్యరంగంలో అపోలో ఆసుపత్రులది విశిష్ట స్థానం. 2014లో సునితా రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆరోగ్యసేవలను విస్తరస్తూ పోతు ఉన్నారు. ప్రస్తుతం అపోలో ఆరోగ్య సేవలను గ్రామాలకూ కూడా విస్తరించారు. ఆమె హర్వర్డ్ బిజినేస్ స్కూల్ ఇండియా అడ్వైసరీ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు. శాంతి ఏకాంబరం ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఎంతటి పోటి ఉందో అందరికి తెలిసిన విషయమే. ఇంత తీవ్ర పోటిని తట్టుకుని నిలబడాలంటే ఎంతో ముందు చూపు ఉన్న నాయకత్వం అవసరం. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తే శాంతి ఏకాంబరం, ప్రముఖ కోటాక్ మహింద్ర బ్యాంక్ ప్రెసిడెంట్. 2014లో ఆమె బాధ్యతలు తీసుకున్న వెంటనే డిజిటల్ ఉత్పత్తుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగానే వేర్వేరు భాషల్లో బ్యాంక్ సర్వీసులను అందిచడం, అల్ఫా సేవింగ్స్ అకౌంట్స్, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా డబ్బులను పంపిచడం వంటి నూతన విధానాలను ప్రవేశపెట్టారు. ఆమె చేసిన మార్పుల వల్ల 2015లో రూ.21,113గా ఉన్న ఖాతాదారుల ద్రవ్య నిల్వలు 2016 మార్చి నాటికి రూ.32,987 కోట్లకు చేరుకున్నాయి. చౌహన్ సాలుజా పార్లే-జీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది బిస్కెట్లు. అంతా ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ ఒకానొక సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల కంపెనీల నుంచి తీవ్ర పోటిని ఎదుర్కొవాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీ పగ్గాలు చేపట్టింది చౌహాన్ సాలుజా, కంపెనీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సాలుజా పెద్ద కుమార్తే. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయం కంపెనీ తయారి సంస్థను ఉత్తారాఖండ్‌లో నెలకొల్పడం. రోశిని నాడార్ హెచ్‌సీఎల్ అంటే ఐటీ సేవలు అందించే సంస్థగానే గుర్తింపు ఉంది. కానీ రోశిని నాడార్ కంపెనీ సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2014లో రోశిని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐటీ సేవలకే పరిమతమయిన కంపెనీ ఆరోగ్యరంగంలో అడుగు పెట్టింది, నైపుణ్య శిక్షణ కోసం హెచ్‌సీఎల్ టాలెంట్ కేర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి విజయవంతంగా పనిచేస్తున్నాయి. రేఖ మీనన్ అక్సెంచర్ కంపెనీకి 2000 సంవత్సరంలో భారతదేశంలో కేవలం 300మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరి ప్రస్తుతం...? 1,40,000మంది అవును అక్షరాల లక్షానలబై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ సాధించిన ఈ అభివృద్ధి వెనక రేఖా మీనన్ క్రమశిక్షణ, కృషి, అంకితభావం ఉన్నాయి. ప్రియా నాయర్ 1995లో హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీలో మానేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం కంపెనీలో ముఖ్య విభాగమైన హోమ్ కేర్ డివిజన్‌కు ఎగ్సిక్యూటీవ్ డైరెక్టరుగా ఎదిగారు. మార్కెట్లో వస్తున్న పోటి కంపెనీ ఉత్పత్తులకు ధీటుగా ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడ్తూ కంపెనీని విస్తరిస్తూ పోతు ఉన్నారు. ఏక్తా కపూర్ సగటు భారతీయ ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవారిని టీవీల ముందు కట్టిపడేసి, ధారవాహికలకు భారీ హంగులు అద్దిన బుల్లితెర రాణి ఏక్తా కపూర్. బాలాజీ టెలిఫిల్మ్ అనే సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన ధారవాహికలను నిర్మిస్తూన్నారు ఏక్తా కపూర్. అంతేకాదు సిని నిర్మాణ రంగంలోనూ ప్రవేశించి తన ప్రతిభను చాటుకుంటున్నారు. నీతా అంబాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అంబానీల ఇంట అడుగుపెట్టారు నీతా అంబాని. రిలయన్స్ సంస్థల అభివృద్ధిలో ఆమె పాత్రను మరవలేము.ఇంత పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆమె తన మూలాలను మరిచిపోలేదు. అందుకే కంపెనీ లాభాల్లోంచి కొంత వాటాను తిరిగి సమాజాభివృద్ధికే కేటాయించే ఉద్ధేశంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే సవాళ్లను ముందే గుర్తించడం, అందుకు తగ్గ పరిష్కారాలను కనుక్కొవడం ఆమె ప్రత్యేకత. వీరు తమ అసమాన ప్రతిభా పాటవాలతో అటు తాము నేతృత్వం వహిస్తున్న కంపెనీలను విజయపథం వైపు నడిపించడం మాత్రమే కాదు ఫైనాన్షియల్ సెక్టార్లో గణనీయమైన కృషి చేశారు. కొన్ని పనులను, బాధ్యతలను మహిళలు నిర్వహించలేరు అనేది కేవలం అపోహ మాత్రమేనని నిరూపించారు. అవకాశాలు కల్పిస్తే..బాధ్యతలు అప్పగిస్తే ఏ రంగమైనా రాణించి తీరతామని చాటి పెట్టారు. తద్వారా యావత్ మహిళాలోకానికి ప్రేరణగా నిలిచారు. ధరణి సూర్యకుమారి -
ఐసీసీ డైరెక్టర్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రానూయి
-
ఇంద్రా నూయీకి అరుదైన గౌరవం
దుబాయ్: పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామకం ఖరారైంది. ఆమె ఈ ఏడాది జూన్‌లో బోర్డులో చేరతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. నూయీ నియామకాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్వాగతించారు. తమ పాలనా వ్యవహారాల పరిధి పెంపొందించుకునేందుకు ఆమె సామర్థ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం తీవ్ర స్థాయిలో పరిశోధించి అన్నివిధాల అర్హురాలైనందున నూయీని ఎంపిక చేశామని ప్రకటించారు. నూయీ మాట్లాడుతూ... ‘క్రికెట్‌ను నేను అమితంగా ఇష్టపడతా. యుక్త వయసులో కళాశాలలో క్రికెట్ ఆడా. బృంద స్ఫూర్తి, సమగ్రత, గౌరవం, ఆరోగ్యకర పోటీ వంటి లక్షణాలను ఈ ఆటలోనే నేర్చుకున్నా. నా నియామకంతో ఆశ్చర్యానికి గురయ్యా. బోర్డు సహచరులతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్వతంత్ర డైరెక్టర్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. -
ఐసీసీలో తొలి సారిగా..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా పేరొందిన ఇంద్రానూయి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పెప్సికో సంస్థకు ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో మరో కీలక పదవిని చేపట్టనున్నారు. ఈ ఐసీసీ బోర్డులోఇంద్రానూయి తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఆమె జూన్‌లో ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె నియామకాన్ని బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు ఐసీసీ వెల్లడించింది. పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో బోర్డులోకి కొత్తగా ఒక స్వతంత్ర డైరెక్టర్‌ను తీసుకోవాలని అది కూడా మహిళే అయి ఉండాలని 2017 జూన్‌లో నిర్వహించిన ఐసీసీ మండలి సమావేశంలో పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగానే ఆమెను స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమించారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో వరుసగా ఇంద్రా నూయి చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. పెప్సికో సీఈఓగా ఇంద్రానూయి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను కొత్తపుంతులు తొక్కించారు. ప్రస్తుతం ఈ సంస్ధ నుంచి మొత్తం 22 రకాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తున్నాయి. పెప్సికో సంస్థ ఆదాయం ఏడాదికిగాను $1 బిలియన్గా ఉంది. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ మాట్లాడుతూ 'ఇంద్రా నూయి ఐసీసీలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. పరిపాలనలో మహిళా డైరెక్టర్‌ను భాగస్వామ్యం చేయబోతున్నాం. ఇదొక కీలక నిర్ణయం. ప్రపంచ వ్యాపార రంగంలో ఆమెకున్న అపార అనుభవం తమకు ఉపయోగపడుతుంది' అని ఆయన అభిప్రాయపడ్డారు. -
దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్
నిరాడంబరంఋ ఇంద్రానూయి పెప్సీ సీఈవో. ఇండియాలో పేరున్న చెఫ్ వికాస్ ఖన్నా. ఇద్దరూ కలిసి ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఎక్కడా? చెన్నైలో. చెన్నైలోనే ఎక్కడ? ‘నమ్మ వీడు’ అనే నిరాడంబర హోటల్లో. నూయీ ఇండియా వచ్చినప్పుడు ఖన్నాకు ఇటీవల ఆమెకు ఆతిథ్యం ఇచ్చే అపూర్వ అవకాశం దక్కింది. ఇంతకీ ఈ ఫుడ్ దిగ్గజాలు ఆ హోటల్లో ఏం తిన్నారంటే... అప్పమ్‌లు, పెసరట్టు దోశ, పనియారం, పాయసం, ఉప్మా. అవన్నీ కూడా నూయీ కోసం స్పెషల్‌గా ఖన్నా చేయించినవే. ఆరోగ్యం కోసం చూసుకుంటే రుచి ఉండదనీ, రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం ఉండదని మనకో నమ్మకం. అయితే ఖన్నా ఈ రెండిటినీ.. అంటే రుచినీ, ఆరోగ్యాన్నీ మిక్స్ చేసి నూయీ కోసం ఈ ఐటమ్స్ తయారు చేయించారు. ఇంత మంచి ఫుడ్‌ని తనకు ఆఫర్ చేసినందుకు నూయీ ఫేస్బుక్లో ఖన్నాకు థ్యాంక్స్ చెబుతూ... వాళ్లిద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఈ ఫొటోను పోస్ట్ చేశారు! స్నాక్స్‌కీ, శీతలపానీయాలకు ప్రసిద్ధి చెందిన పెప్సీ సీఈవో చేత భేష్ అనిపించుకున్నారంటే ఖన్నాను గ్రేట్ చెఫ్ అనే అనాలి. -
ఇడ్లీ రుచి చూసిన శక్తిమంతమైన మహిళ
చెన్నై: ప్రపంచ శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరైన పెప్సికో చైర్మన్ అండ్ సీఈవో ఇంద్రా నూయి దక్షిణ భారత వంటలు రుచి చూశారు. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె ప్రస్తుతం అతి పెద్ద హోదాను అనుభవిస్తూ మంగళవారం వాడపలనిలోని వసంత భవన్ అనే హోటల్ సందర్శించారు. అక్కడ ఆమె వోట్స్తో తయారు చేసిన అప్పం, దోసా, ఇడ్లీవంటి వంటకాలను ఆరగించారు. అయితే, ఈ వోట్స్ కూడా క్వాకర్ అనే కంపెనీకి చెందినవి. కాగా, క్వాకర్ వోట్స్కు దక్షిణ భారత దేశంలో కూడా విరివిగా ప్రచారం కల్పించే చర్యల్లో భాగంగానే ప్రత్యేకంగా ఆమెను ఆ హోటల్‌కు పిలిపించి వాటిని రుచి చూపించారని అదే హోటల్లో పనిచేసే ఓ పేరు చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తి చెప్పాడు. వారి ఫేమస్ చెఫ్ వికాస్ ఖన్నానే ఆ వంటలు చేశాడని, మిగితావారంతా తమ హోటల్ సిబ్బంది అంతా అతడికి సహాయపడ్డారని ఆ వ్యక్తి చెప్పాడు. ఖన్నా పెప్సికో ఇండియాకు న్యూట్రిషన్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. వంటలను రుచి చూసిన ఇంద్రా నూయి ఏ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారట. -
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళ ఇంద్రా నూయి
51 మందిలో రెండో ర్యాంక్ న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన ‘ప్రపంచపు 51 అతిశక్తివంతమైన మహిళల’ జాబితాలో పెప్సికో సీఈవో, చైర్మన్ ఇంద్రా నూయి స్థానం పొందారు. భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక మహిళగా ఇంద్రా నూయి నిలిచారు. ఈమె రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అగ్రస్థానంలో జనరల్ మోటార్స్ సీఈవో, చైర్మన్ మేరీ బర్రా ఉన్నారు. గతేడాది కూడా ఇంద్రా నూయి రెండవ స్థానంలోనే ఉండటం విశేషం. ఇక 2014లో మూడవ స్థానంలో ఉన్నారు. గడచిన ఏడాది కాలంలో పెప్సికో మార్కెట్ క్యాపిటల్ 18 శాతం పెరుగుదలతో 155 బిలియన్ డాలర్లకి ఎగిసిందని ఫార్చ్యూన్ పేర్కొంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల కారణంగా కంపెనీకి గతేడాది లాభాలు తగ్గినా కూడా మార్కెట్ క్యాపిటల్ పెరగడంలో ఇంద్రా నూయి కీలకపాత్ర పోషించారని కొనియాడింది. ఇన్వెస్టర్లు ఇంద్రా నూయి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొంది. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ వృద్ధితో మేరీ బర్రా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబునిచ్చింది. టాప్-10లోని మహిళలు వీరే.. ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో పలువురు ప్రముఖులు స్థానం పొందారు. కాగా టాప్-10లో.. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో మెరిల్లిన్ హ్యూసన్ (3వ స్థానం), ఐబీఎం సీఈవో గిన్ని రొమెట్టీ (4), ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈవో అబిగెయిల్ (5), ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (6), హ్యూలెట్ పకార్డ్ ఎంటర్ప్రైస్ సీఈవో మెగ్ విత్‌మన్ (7), జనరల్ డైనమిక్స్ సీఈవో ఫెబె నొవాకొవిక్ (8), మాండలిజ్ ఇంటర్నేషనల్ సీఈవో ఐరెన్ రోసెన్ఫీల్డ్ (9), ఒరాకిల్ కో-సీఈవో సఫ్రా కాట్జ్ (10వ స్థానం) ఉన్నారు. -
ఇంద్రజాలం
లైఫ్ ఈజ్ ఫన్.. బెటర్.. అండ్ గుడ్! ఇదీ ఇంద్రానూయి ఫిలాసఫీ ఫర్ పెిప్సీకో. ఎంత పెద్ద ఆలోచన అయినా... ఎంత పెద్ద బ్రాండ్ అయినా ఎంత పెద్ద మార్కెట్ వ్యూహం అయినా పెప్సీకో చేరాల్సింది... నాలుకకే! ఫిలాసఫీ రుచించింది. నూయికి సక్సెస్ దక్కింది. షి ఈజ్ ఎ మెజీషియన్. ఆహారపానీయాల ఆహార్యాన్ని మార్చిన వ్యూహకర్త. ఆమె ఇంద్రజాలానికి అందరూ ముగ్ధులే. టేస్ట్ ది సక్సెస్! ఫోర్బ్స్‌నీ, పెప్సీనీ, ఫార్చూన్నీ, టైమ్‌నీ.. కాసేపు పక్కన పెట్టేయండి. ఇంద్రా నూయిని ఈ దిగ్గజాలన్నీ ‘ఆహా.. ఓహో..’ అనడం ఎన్నాళ్ల నుంచో వింటున్నాం! ఆమె జీతం కూడా బాగా పాతబడిపోయిన పే స్లిప్. ఎలాగూ కోట్లలో ఉంటుంది. కొత్తగా క్లాప్స్ కొట్టేందుకేమీ లేదు. ఇక ‘ఫారిన్ కంపెనీని నడుపుతున్న శారీ అమ్మాయ్’ అనే మాట కాస్త బెటర్. ఎన్నాళ్లకైనా వినసొంపుగానే ఉంటుంది. మరి ఏం మిగిలి ఉంది.. కొత్తగా ఇవాళ ఆమె బయోగ్రఫీలోకి వెళ్లేందుకు? ఉంది. ఆమెకంటూ ఒక ‘వ్యూ’ ఉంది. అది.. ఈ ప్రపంచానికి మహిళాశక్తిని సాక్షాత్కరింపజేసిన చూపు. ఒక సాధారణ మహిళకు ఇంద్రా నూయి ఇచ్చే స్ఫూర్తి.. ఆమె సాధించిన ‘మోస్ట్ పవర్ఫుల్’, ‘మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్’ లిస్టుల నుంచి వచ్చింది కాదు. ఆమెకై ఆమెలో ఓ పవర్ ఉంది. ఉమన్ పవర్! సో స్వీట్ కదా! ఇదిగో... వర్క్‌ప్లేస్‌లో ఆడవాళ్లను ఇలాంటి మాటలంటేనే.. విసుగ్గా చూస్తారు నూయీ. ‘స్వీటీ’, ‘హనీ’.. అనే మాటలు నూయికి వికారం తెప్పిస్తాయి. ఎగ్జిక్యూటివ్‌ని ఎగ్జిక్యూటివ్‌గా చూడకుండా ‘క్యూటీ’గా చూడడం నూయికి నచ్చదు. కానీ.. ఆమె తన కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ ఈ ముద్దు మురిపాలను ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నారు. సమాన వేతనం మాత్రమే కాదు. సమానమనే భావన కూడా ఉండాలన్నది నూయీ ‘పాయింట్ ఆఫ్ వ్యూ’. సహాయం.. సమానత్వం పనికి వెళ్లి వచ్చే మగవాళ్లకు, ఆడవాళ్లకు తేడా ఉంటుంది. మగవాళ్లు వాళ్లెంత చిన్న పొజిషన్లో ఉన్నా.. ఇంటికి వెళ్లాక రిలాక్స్ అవడానికి ఉంటుంది. ఆడవాళ్లు వాళ్లెంత పెద్ద పొజిషన్లో ఉన్నా.. ఇంటికి వెళ్లాక అక్కడ మళ్లీ ‘ఫ్రెష్’గా పని ఎదురు చూస్తుంటుంది. నూయీనే చూడండి. ఈ పెప్సీ కంపెనీ సి.ఇ.వో. ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్లగానే తల్లిగా, భార్యగా, కోడలిగా, ఇంకా అప్పటికప్పుడు ఊహించని కొన్ని అతిథి పాత్రలను పోషించవలసి వస్తుంది. ఇంతకీ నూయి అనడం ఏమంటే... ఇంటినీ, ఆఫీస్‌ను చక్కబెట్టుకోడానికి అనువైన సదుపాయాలతో పాటు మహిళా ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం అందేవిధంగా ప్రతి కంపెనీ కొన్ని నియమాలు ఏర్పరచాలని. అంతే తప్ప, ఏవో కొన్ని సౌకర్యాలు కల్పించి, సంబోధనలతో గారాం చేస్తూ, జెండర్ ఈక్వాలిటీ తెచ్చేశామోచ్ అంటే నూయీ ఊరుకోరు. తన విజయం వెనుక తనే! పురుషుడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. రైట్. స్త్రీ ప్రతి విజయం వెనుక? ఆమె స్వయం కృషి ఉంటుంది. లేదంటే ఆమె తల్లి పడ్డ కష్టం ఉంటుంది. చిన్నప్పుడు నూయీ వాళ్ల అమ్మగారు పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టుకుని వాళ్లకొక పరీక్ష పెడుతుండేవారు. ఒక్కొక్కరు లేచి నిలబడి ఏదైనా విషయం మీద మాట్లాడాలి. చక్కగా, అర్థవంతంగా మాట్లాడిన వాళ్లు విజేత. వాళ్లకొక చాక్లెట్. ఆ అనుభవం, ఆ వాక్పటిమ, ఆ క్లారిటీ జీవితంలోని ప్రతి దశలోనూ ఆమెకు ఉపయోగపడింది. ఏ రోజు ఎక్కడ ఉన్నా ఇప్పటికీ నూయి రోజుకు రెండు మూడుసార్లైనా తన తల్లికి ఫోన్‌చేసి మాట్లాడుతుంటారు. గత ఏడాది కోల్‌కతా ఐ.ఐ.ఎం.లో చదువు పూర్తిచేసుకుని బయటి ప్రపంచంలోకి వెళుతున్న విద్యార్థులకు ఇచ్చిన ప్రసంగంలో నూయీ ఈ మాటే చెప్పారు. మీరెంత పెద్ద స్థాయిలో ఉండనివ్వండి. మీరెంత బిజీగా ఉండనివ్వండి. ‘అమ్మా నేను బిజీగా ఉన్నాను’ అని మాత్రం అనకండి అని చెప్పారు నూయి. అమ్మానాన్నలకు ధన్యవాదాలు పెద్ద పెద్ద కంపెనీల సిఇవోలు పదవిని చేపట్టినప్పుడో, పదవీ విరమణ పొందుతున్నప్పుడో ఉద్యోగులందర్నీ ఉద్దేశించి ఒక లేఖ రాస్తుంటారు. ఇంద్రా నూయి కూడా రాశారు. కానీ ఉద్యోగులకు కాదు. వారి తల్లిదండ్రులకు. ‘మీ అబ్బాయిని / అమ్మాయిని మా పెప్సీ కంపెనీకి కానుకగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అంకితభావంతో కూడిన వారి అత్యద్భుతమైన పనితీరుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రతి ఎంప్లాయీ తల్లిదండ్రులకు తన సంతకం ఉన్న లెటర్ పంపించారు నూయి! గుడ్... బెటర్... ఫన్ ఇండియాలో నూయీ తొలి ఉద్యోగం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్‌గా. తర్వాత మెట్టూర్ బియర్డ్‌సెల్ అనే వస్త్ర పరిశ్రమ సంస్థలో. తర్వాత యు.ఎస్. వెళ్లాక అక్కడి బూజ్ అలెన్ హామిల్టన్ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో సమ్మర్ ఇంటెర్న్షిప్. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు, మోటరోలా, ఏషియా బ్రౌన్ బొవెరీ. 1994లో నూయీ పెప్సీకోలో చేరేనాటికి ఆమె వయసు 39 సం. 118 ఏళ్ల చరిత్రగల అమెరికన్ కంపెనీ పెప్సీకో చైర్పర్సన్, సి.ఇ.ఒ అయ్యే నాటికి 51 సం. ఆ పన్నెండేళ్ల వ్యవధిలో నూయీ తన ‘స్ట్రాటెజిక్ రీడెరైక్షన్’ విధానాలతో పెప్సీనీ పవర్‌ఫుల్‌గా పునర్నిర్మించారు. ఫన్ ఫర్ యు (పొటాటో చిప్స్, రెగ్యులర్ సోడా), బెటర్ ఫర్ యు (డైట్ లేదా లోఫ్యాట్ స్నాక్స్, సోడాలు), గుడ్ ఫర్ యు (ఓట్ మీల్ పదార్థాలు).. ఇదీ నూయీ స్ట్రాటెజిక్ రీడెరైక్షన్. హిట్ అయింది. షేక్ చేసి మూత తీసిన బాటిల్లా పెప్సీకో లాభాలు పొంగిపొర్లాయి. కిరీటం ఇంట్లోకి రాకూడదు! పెప్సీ సి.ఇ.ఒ. గా నూయికి ఇది పదో ఏడాది. ఈ పదేళ్లలో అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ఆమెను అనేకసార్లు ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమన్’గా కీర్తించాయి. సి.ఇ.ఒ. అయిన తొలినాళ్లలో ఓ రోజు.. నూయి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. ‘అమ్మా.. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి’ అన్నారు నూయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన మహిళల్లో నూయి కూడా ఒకరు అని అంతకుముందే ఫార్చూన్ పత్రిక ప్రకటించింది. ఆ విషయాన్నే ఆమె తన తల్లికి చెప్పదలచుకున్నారు. ‘ఆ ముఖ్యమైన విషయమేదో తర్వాత చూద్దాం. ముందు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురా’ అన్నారు శాంత(మ్మ). నూయి ఆశ్చర్యపోయారు. ‘రాజ్ ఇంట్లోనే ఉన్నాడు కదా. తనని తెమ్మనాల్సింది’ అన్నారు. ‘అబ్బాయి అలసిపోయాడు’- శాంతమ్మ సమాధానం. అల్లుడి అలసట ఆమెకు కనిపించింది కానీ, అలసిపోయి ఇంటికొచ్చిన కూతురు కనిపించలేదు. నూయి కోపంగా బయటికి కెళ్లి పాల ప్యాకెట్‌తో తిరిగొచ్చారు. ప్యాకెట్‌ని కిచెన్ టేబుల్ మీద పడేసి తల్లి వైపు తిరిగారు. ‘ఇప్పుడు చెప్పు. పాలు నేనే వెళ్లి ఎందుకు తేవాలి? మిగతావాళ్లు ఎందుకు తేకూడదు?’ అన్నారు. శాంతమ్మ మాట్లాడలేదు. ఒక చూపు మాత్రం చూశారు. తర్వాత మెల్ల్లిగా మొదలు పెట్టారు. ‘‘చూడు.. నీ కిరీటాన్ని గ్యారేజీలోనే వదిలేయ్. నీతోపాటు దాన్ని ఇంట్లోకి తీసుకురాకు. నువ్వు మొదట భార్యవి. తర్వాత తల్లివి. ఆ తర్వాతే మిగతావన్ని. నీ కుటుంబానికి పాలు అవసరం అయినప్పుడు నీకున్న ముఖ్యమైన పని పాలు తెచ్చు కోవడం ఒక్కటే’’ అన్నారు శాంతమ్మ ఏకబిగిన! ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్‌లో పేరొచ్చిన ప్పుడు కూడా మొదట ఆమెకు తన తల్లి మాటలే గుర్తుకొచ్చి ఉంటాయి. ‘పవర్ఫుల్ ఉమన్’ అని ఎవరు ఎన్ని టైటిల్స్ ఇచ్చినా, ‘పవర్’ అంటే ఇంద్రానూయి దృష్టిలో ఒకటే. స్త్రీపురుష సమభావనకు, సమభాగస్యామ్యానికి కృషి చేయగల సామర్థ్యం ఉండడం. ఆమెలో ఆ సామర్థ్యం ఉంది. అందుకే ఆమె పవర్ఫుల్ ఉమన్. ఆఫీసులలో మహిళలు ఒకరికొకరు సహాయం చేసుకుంటే.. ఉమన్ టు ఉమన్.. ఆ పవర్ ప్రవహించడం పెద్ద కష్టమేం కాదని కూడా నూయి అంటుంటారు. ఇంద్రా నూయి (60), వ్యాపార నిర్వాహక దిగ్గజం పూర్తి పేరు : ఇంద్ర కృష్ణమూర్తి జన్మస్థలం : చెన్నై జన్మదినం : 28 అక్టోబర్ 1955 చదువు : పి.జి.డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ (ఐ.ఐ.ఎం. కోల్‌కతా) మాస్టర్స్ డిగ్రీ - పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ (యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, యు.ఎస్.) తల్లితండ్రులు : కృష్ణమూర్తి, శాంత తోబుట్టువులు : చంద్రిక, నారాయణ్ భర్త : రాజ్.కె.నూయి (యామ్సాఫ్ట్ ప్రెసి.) పిల్లలు : {పీతా నూయి, తారా నూయి ప్రస్తుత నివాసం : {Xన్విచ్, కనెక్టికట్ (యు.ఎస్.) మరికొన్ని విశేషాలు ఇంద్రా నూయి తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. తల్లి గృహిణి. యేల్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు నూయీ తన రోజువారీ ఖర్చుల కోసం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉండే షిఫ్టులో రిసెప్షనిస్టుగా పని చేశారు.యు.ఎస్.లో తొలి ఉద్యోగానికి నూయి చీర కట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లారు. చెన్నైలో ఉన్నప్పుడు అక్కడి ఆల్ ఉమెన్ రాక్ బ్యాండులో నూయీ ప్రధాన గిటారిస్టు. కాలేజ్‌లో నూయీ క్రికెట్ ప్లేయర్.కార్పోరేట్ సంస్థల వేడుకల్లో సంగీత నేపథ్యంతో (కరావొకె) పాటలు పాడడం నూయీ హాబీ. ఇప్పటికీ పాడుతుంటారు. పెప్సీకో లో ఏ సమావేశానికైనా నూయీ చీర కట్టుతోనే హాజరవుతారు.