ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని ఒకరు, మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ ఆన్ ఎర్త్‌కి ప్రెసిడెంట్ మరొకరు. వీరిద్దరు ఓ సమావేశంలో కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ అంతర్జాతీయ సంస్థ సీఈవోని చూస్తూ.. తమ దేశానికి చెందినది అంటే తమ దేశానికి చెందినది అంటూ ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఈ ఆరుదైన ఘటన 2009లో చోటు చేసుకుంది.
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశం సాధిస్తున్న ప్రగతిని అక్కడి కంపెనీల పనితీరుని ప్రధాని మన్మోహన్‌కి వివరిస్తున్నారు బరాక్ ఒబామా. ఈ క్రమంలో పెప్సీ కంపెనీ వంతు వచ్చింది.
2009లో పెప్సీ కంపెనీకి గ్లోబల్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఇంద్రానూయి ఉన్నారు. ఆమెను చూడగానే ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈమె మాలో ఒకరు అని ఒబామాతో అన్నారు. వెంటనే స్పందించిన బరాక్ ఒబామా ‘ ఆహ్! కానీ ఆమె మాలో కూడా ఒకరు’ అంటూ బదులిచ్చారు. శక్తివంతమైన రెండు దేశాలకు చెందిన అధినేతలు తనను మాలో ఒకరు అంటూ ప్రశంసించడం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ ఇంద్రనూయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆనాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని సంబరపడ్డారు.
భారత సంతతికి చెందిన ఇంద్రానూయి అమెరికాలో స్థిరపడ్డారు. 25 ఏళ్ల పాటు పెప్సీ కంపెనీలో పని చేశారు. అందులో 12 ఏళ్ల పాటు సీఈవోగా కొనసాగారు. ఆమె సీఈవోగా ఉన్న కాలంలో పెప్పీ కంపెనీ రెవెన్యూ 35 బిలియన్ల నుంచి 63 బిలియన్లకు చేరుకుంది. తొలి గ్లోబల్ మహిళా సీఈవోగా ఇంద్రనూయి రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత ఇటీవల లీనా నాయర్ ఛానల్ సంస్థకు గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment