శక్తికి మించిన బరువు
రెండు కిరీటాలు
ఇంద్రా నూయి! పెప్సీ కంపెనీ సీఈవో. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఒకరిగా ఆమె పేరు పదే పదే వినిపిస్తుంటుంది. ఇక మన భారతీయులకైతే నూయీ ఏకంగా స్త్రీ శక్తికి ప్రతిరూపం. స్ట్రాంగ్ ఉమన్. అయితే ‘‘ఆఫీసు బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, అదే సమయంలో ఇంటినీ చక్కబెట్టుకునే విషయంలో స్త్రీ ఏమంత శక్తిమంతురాలు కాదు’’ అని ఇటీవలి ఒక సమావేశంలో నూయీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది.
అమె చెప్పింది కరెక్టే అని పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నత హోదాలో ఉన్న కొందరు మహిళలు ఏకీభవిస్తే, సాధారణ ఉద్యోగినులలో చాలామంది ఆమె అలా అనడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఆదర్శ మహిళ ఇలా మాట్లాడ్డం ఏమిటన్న ఆశ్చర్యం కావచ్చది. ఏమైనా 58 ఏళ్ల నూయీ వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకోదగినవి కాదు. ‘‘ఇంటినీ, ఆఫీసును ఏక కాలంలో సర్దుబాటు చేసుకోగల శక్తి స్త్రీకి ఉందని నేను అనుకోను’’ అంటూ ఇటీవల కొలరెడోలో జరిగిన ‘ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్’లో నూయీ తను అనుభవాలు కొన్నింటిని వెల్లడించారు.
‘‘కొన్నిసార్లు అపరాధభావం నన్ను కుదిపేస్తుంటుంది. నా ఇద్దరు కూతుళ్లకు వారి టీనేజ్‌లో తగిన సమయాన్ని కేటాయించగలిగానా అని ఆలోచనలో పడతాను. నేను మంచి తల్లిని కాదేమోనని అనుకుంటూ ఉంటాను. ముప్పై నాలుగేళ్ల జీవిత సహచర్యంలో నా భర్త కూడా చాలాసార్లు నా పని ఒత్తిళ్లను అర్థం చేసుకునే ప్రయత్నంలో విఫలమై అసంతృప్తికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి. కుటుంబం అన్నాక ఇలాంటివి తప్పవు. అలాగని ఆఫీసులో అత్యున్నతస్థాయిలో మన వల్ల జరగవలసిన పనులను కుటుంబం కోసం వాయిదా వెయ్యలేం కదా. మరోవైపు ఇంట్లోని పెద్దవాళ్ల బాగోగులనూ చూసుకుంటుండాలి. అందుకే అంటాను, స్త్రీ శక్తి పరిమితమైనదని! బాధ్యతలు ఆమె కన్నా శక్తిమంతమైనవని!’’ అన్నారు ఇంద్రా నూయి.
పద్నాలుగేళ్ల క్రితం ఓరోజు ఇంట్లో జరిగిన సంఘటనను ఈ సందర్భంగా నూయీ గుర్తుచేసుకున్నారు. తనను పెప్సీ కంపెనీ ప్రెసిడెంట్‌ను చేయబోతున్నారని, డెరైక్టర్ల బోర్డులో తన పేరు కూడా ఉండబోతున్నదని తెలిసిన వెంటనే ఆమె ఎంతో సంతోషంగా ఇంటికి రాగానే ఆ శుభవార్తను మొదట తల్లి చెవిన వేశారు. అయితే తల్లి అందుకు ఏమన్నారంటే... ‘‘ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో. నువ్వు పెప్సీ కంపెనీకి ప్రెసిడెంటు అయితే కావచ్చు. డెరైక్టర్ల బోర్డులో నువ్వు కూడా ఉంటే ఉండొచ్చు కానీ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక నువ్వొక భార్యవి, నువ్వొక కూతురువి, నువ్వొక తల్లివి, నువ్వొక కోడలివి. ఆఫీసులో నీ పనిని మరెవరైనా చేయడానికి వీలుంటుంది. ఇంట్లో మాత్రం ఈ పాత్రలన్నీ నువ్వే పోషించాలి’’ అన్నారట!
‘‘ఇంటినీ, ఆఫీసునీ ఏకకాలంలో చక్కబెట్టేకునే శక్తి స్త్రీకి లేదు’’ అని ఇంద్రా నూయీ అనడం వెనుక ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఉన్నాయి. అలాగని స్త్రీ శక్తిని ఆమె తగ్గించి మాట్లాడారని భావించనవసరం లేదు. స్త్రీ ఇంటా బయటా రాణించాలంటే ఇంట్లో వాళ్ల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భర్త తోడ్పాటు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు స్త్రీ ఏ రంగంలోనైనా రాణిస్తుంది అని చెప్పడం ఇంద్రా నూయి ఉద్దేశమని అనుకోవాలి.