
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రమోటర్‌యేతర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ప్రొఫెషనల్ సీఈవోల సగటు వేతనం గతేడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.10 కోట్లకు చేరింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా రూపొందించిన ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మెన్స్, రివార్డ్స్ సర్వే 2025 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం సీఈవో వేతనాల్లో 40 శాతం భాగం మాత్రమే స్థిరమైనదిగా ఉంటోంది. మిగతా 60 శాతం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటోంది. ఇందులో స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, వార్షిక బోనస్‌ల రూపంలో 25 శాతం, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల రూపంలో మిగతా 35 శాతం ఉంటోంది.
మరోవైపు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు వంటి సీఎక్స్‌వోల వేతనాలు 7 నుంచి 11 శాతం మేర పెరిగాయి. వీరి వేతనాల్లో 60 శాతం స్థిరమైనదిగా ఉండగా, మిగతాది స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల రూపంలో ఉంటోంది. సీఈవోల తర్వాత సీవోవోలు, సీఎఫ్‌వోల వేతనాలు అత్యధికంగా రూ.4 కోట్ల స్థాయిలో ఉంటున్నాయి. ఈ సర్వేలో 400 పైచిలుకు సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలేవీ లేవు. సీఎక్స్‌వోలకు డిమాండ్ భారీగా ఉండటంతో వారి వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఆనందోరూప్ ఘోష్ తెలిపారు. సీఎక్స్‌వోల వేతనాలపై ఈక్విటీ మార్కెట్ల కరెక్షన్ ప్రభావం వచ్చే ఏడాది మాత్రమే తెలుస్తుందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు..
సీఎక్స్‌వోల స్థాయిలో స్వల్పకాలిక ప్రోత్సాహకాలనేవి కేవలం ఆర్థికాంశాలతోనే ముడిపడినవి కాకుండా సమగ్రంగా వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటున్నాయి. అయితే, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలకు మాత్రం ఆర్థిక పనితీరే ప్రాతిపదికగా ఉంటోంది. చాలా మటుకు కంపెనీలు సీఈవో, సీఎక్స్‌వోల పనితీరును మదింపు చేసేందుకు ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సంబంధించిన స్కోర్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. వీటిని చేరుకోవడంలో విఫలమైన సీఎక్స్‌వోలకు అంతక్రితం ఏడాదితో పోలిస్తే తక్కువ బోనస్‌లు ఇస్తున్నాయి.
పలు కంపెనీల్లో దీర్ఘకాలికంగా షేర్ల ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చే ధోరణి పెరుగుతోంది. ఇలా వేతనంలో షేర్ల రూపంలో ఇచ్చే పరిమాణం అధికమవుతోంది. అయితే, షేర్ల ఆధారిత ప్రణాళికలను ప్రాక్సీ–అడ్వైజరీ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ నిర్ణయాలను సవాలు చేస్తున్నాయి. ఓటింగ్ ఫలితాలనూ ప్రభావితం చేస్తున్నాయి. షేర్‌హోల్డర్లు ఇలాంటి ప్రతిపాదనలను తిరస్కరించడం గత ఏడాది వ్యవధిలో నాలుగు రెట్లు పెరిగింది.
ఇదీ చదవండి: మొబైల్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్‌దే..
సీఈవోలు, సీఎక్స్‌వోల వ్యవధి తగ్గుతూ ఉండగా, పనితీరుపై అంచనాలు, షేర్‌హోల్డర్ల యాక్టివిజం గణనీయంగా పెరుగుతోంది. దీంతో జీతభత్యాలపరంగా కాంట్రాక్టుల్లో భారీగా బేరసారాలు జరుగుతున్నాయి.