
దేశంలో 2025 ఏడాదిలో ఉద్యోగుల జీతాలు సగటున 9.2 శాతం పెరగనున్నాయని ఏఓఎన్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024లో కనిపించిన 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే 2025లో వేతనాల పెంపు స్వల్పంగా క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. ఇందుకు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మందగమనం ప్రధాన కారణాలని విశ్లేషించింది.
రంగాల వారీగా ఇంక్రిమెంట్లు
రంగాల వారీగా వేతనాల పెంపులో మార్పులు వస్తున్నాయి. నివేదిక ప్రకారం కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు అధిక వేతన పెంపు ఉంటుంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమోటివ్, వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో అత్యధికంగా 10.2 శాతం వేతన పెంపు ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), రిటైల్ వంటి ఇతర రంగాల్లోనూ గణనీయమైన వేతన పెరుగుదలను చూడవచ్చని భావిస్తున్నారు.
ఆర్థిక స్థిరత్వం
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక అవకాశాలు నిలకడగానే ఉన్నాయి. గ్రామీణ గిరాకీ మెరుగవుతోంది. ప్రైవేటు వినియోగం ఊపందుకుంటోంది. ఈ స్థిరత్వం ఉద్యోగులకు సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన వృద్ధి పథాన్ని సూచిస్తుంది. 2022లో గరిష్టంగా 21.4 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు(ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారడం) 2024 నాటికి 17.7 శాతానికి పడిపోయింది. టాలెంట్ పూల్ స్థిరపడడాన్ని ఇది సూచిస్తుంది.
ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
రంగాల వారీగా గతేడాదితో పోలిస్తే వేతనాల్లో వ్యత్యాసం ఇలా..(శాతాల్లో)
రంగాలు 2024 2025
ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్ 10.1 10.2
ఆటోమోటివ్ 10.7 10.2
ఎన్‌బీఎఫ్‌సీ 10.1 10
రిటైల్ 9.6 9.8
గ్లోబల్ కేపబులిటీ సెంటర్ 9.4 9.7
ఇంజినీరింగ్/మ్యానుఫ్యాక్చరింగ్ 9.7 9.7
ఫండ్స్/ అసెట్ మేనేజ్‌మెంట్ 10 9.7
ఫ్రొఫెషనల్ సర్వీసెస్ 8.9 9.5
లైప్ సైన్సెస్ 9.5 9.5
టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 9.5 9.4