పెప్సీకి ఇక ఏపీ హబ్
మామిడి గుజ్జుకు ఇదే ఆధార కేంద్రమవుతుంది
రూ.1,200 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ప్లాంటుగా చేస్తాం
శ్రీ సిటీ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవంలో పెప్సీ కో చైర్మన్ ఇంద్రా నూయి
సింగిల్ లైన్ ఉత్పత్తిని ప్రారంభించిన పెప్సీకో
మరో మూడేళ్లలో 9 లైన్లతో పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటామని వెల్లడి
అది పూర్తయితే దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా శ్రీ సిటీ ప్లాంటు
శ్రీ సిటీ నుంచి ఎం. రమణ మూర్తి శీతల పానీయాల రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న పెప్సీకో... భారతదేశంలో తన ఉత్పత్తుల తయారీకి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీని ప్రధాన కేంద్రంగా చేసుకుంటానని స్పష్టం చేసింది. మామిడి గుజ్జుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌నే దేశం మొత్తానికి ఆధార కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంపెనీ చైర్‌పర్సన్, సీఈఓ ఇంద్రా నూయి చెప్పారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో శ్రీ సిటీ ప్లాంటుపై రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడతామని తెలియజేశారు. శ్రీ సిటీలో 86 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పెప్సీ కో ప్లాంట్‌లో ఉత్పత్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలసి శుక్రవారమిక్కడ ఆమె ప్రారంభించారు. మామిడి గుజ్జుకు (మ్యాంగో పల్ప్) సంబంధించి శ్రీ సిటీ ప్లాంటును భారతదేశం అంతటికీ ఆధార కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆమె ప్రకటించారు. శుక్రవారం ప్రారంభించిన ప్లాంటులో ప్రస్తుతం సింగిల్ లైన్లోనే ఉత్పత్తి జరగనుంది. వచ్చే మూడేళ్లలో ఈ ప్లాంటు తొమ్మిది లైన్లలో ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుంది. మూడు దశల్లో జరిగే ఈ విస్తరణ అనంతరం భారతదేశంలో పెప్సీకి ఇదే అతిపెద్ద ప్లాంటు కానుంది. ఈ ప్లాంటులో పెప్సీకి సంబంధించిన వివిధ రకాల పానీయాలు తయారు చేయటంతో పాటు స్పోర్ట్స్ బేవరేజెస్ కూడా తయారు చేయనున్నట్లు ఇంద్రా నూయి తెలియజేశారు.
మేక్ ఇన్ ఇండియా భావనను అత్యంత సాఫీగా అమలు చేయడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందని తెలియజేశారు. ‘‘భారతదేశంలో పెప్సీ యాత్ర 1989లో ప్రారంభమైంది. అంటే దాదాపు పాతికేళ్లు పూర్తయింది. ఇన్నాళ్లూ భారతదేశంలో పెట్టుబడి పెడుతూనే ఉన్నాం. మరో పాతికేళ్ల పాటు కూడా దీన్ని కొనసాగిస్తాం’’ అని తెలియజేశారు. శ్రీ సిటీ ప్లాంటును పూర్తి దేశీయ పరిజ్ఞానంతో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించటం చాలా సంతోషంగా ఉందంటూ... ఈ సంస్థలో దాదాపు 25 శాతం మహిళలనే తీసుకున్నామని తెలియజేశారు. ‘‘అంతేకాదు. ఇక్కడ అత్యున్నత స్థాయి మేనేజ్‌మెంట్‌లో 9 మంది ఉండగా వారిలో ఏడుగురు మహిళలే’’ అని తెలియజేశారు.
అత్యంత సమర్థంగా నీటి నిర్వహణ
పెప్సీకి ఇప్పటిదాకా ఉన్న ప్లాంట్లలో నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకుంటున్న ప్లాంటు ఇదేనని ఈ సందర్భంగా ఇంద్రా నూయి చెప్పారు. వాన నీటి నిల్వ, వాటర్‌షెడ్లు వంటి సానుకూల చర్యలకు సహకరిస్తూ... తాము వినియోగిస్తున్న నీటికంటే ఎక్కువ నీటిని సంరక్షిస్తున్నామని కూడా ఆమె చెప్పారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్లాంటు వల్ల 32,000 మంది రైతులు ప్రత్యక్షంగా లభ్ధి పొందుతారని తెలియజేశారు. స్థానికంగా ఉన్నవారు తమ అభివృద్ధిలో భాగమైతే నే అది సమగ్రాభివృద్ధికి దారి తీస్తుందన్న సిద్ధాంతాన్ని తాను గట్టిగా నమ్ముతానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు అనుకూలమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆమె ప్రశంసించారు.
అంతకుముందు పెప్సీకో ఇండియా చైర్మన్, సీఈఓ డి.శివకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో పంజాబ్ తరవాత అత్యంత ఖరీదైన వినియోగదారులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. గతంలో నోకియా కంపెనీకి సైతం ఇండియా హెడ్‌గా వ్యవహరించిన శివకుమార్... రాష్ట్రంలో విశాఖ పట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు... ఇలా అన్ని ప్రాంతాలూ వినియోగంలో చాలా ముందుంటాయని, పంజాబ్ తరవాత దేశంలో ఇంకెక్కడా ఇలాంటి ప్రాంతం లేదని చెప్పారు. పెప్సీకో వల్ల రాష్ట్రంలో మామిడి, బంగాళాదుంప ఇతరత్రా రైతాంగానికి మేలు కలుగుతుందని, వారికి మరింత మంచి ధరలు వచ్చే అవకాశముందని చెప్పారు.
10 కంపెనీలకు భూమి పూజ
ఈ సందర్భంగా బ్రిటన్‌కు చెందిన రెక్సామ్‌తో పాటు బెల్జియం కంపెనీ వెర్మీరెన్, గోదావరి ఉద్యోగ్, ఆరుర్వెట్, బీరోలెక్స్, బెయా తదితర భారత కంపెనీలు సహా మొత్తం 10 కంపెనీలకు సీఎం సమక్షంలో భూమి పూజ చేశారు. తదనంతరం నెదర్లాండ్స్ కంపెనీ హంటర్ డగ్లస్, వెస్ట్ ఫార్మా (అమెరికా), జెడ్‌టీటీ (చైనా), నిప్పన్‌సీకీ, నిట్టన్ వాల్వ్, కుసకబే (జపాన్), సిద్ధార్థా లాజిస్టిక్స్, అర్తురా, ఎంఎం పాలీటెక్ (ఇండియా), చక్సింగ్ (చైనా) కంపెనీల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు.
రూ 500 కోట్లతో జీవీకే గ్రూప్ హెల్త్ సిటీ...
వైద్య సేవల రంగంలోకి అడుగు పెట్టడానికి జీవీకే గ్రూపు ఆసక్తి చూపిస్తోంది. సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడి వ్యయంతో శ్రీ సిటీలో హెల్త్‌కేర్ సిటీని ఏర్పాటు చేయడానికి జీవీకే గ్రూపు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హాస్పిటల్, మెడికల్ కాలేజీతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, ఈఎంఆర్‌ఐ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జీవీకే ముందుకొచ్చిందని, దీనికి సంబంధించి కంపెనీతో చర్చలు జరుగుతున్నట్లు సీఎం తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే 2-3 నెలల్లో జీవీకేతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఈ చర్చల్లో పాల్గొన్న శ్రీ సిటీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీల వలే శ్రీ సిటీలో కూడా రాత్రి వేళల్లో మహిళలు పని చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని శ్రీ సిటీలో కలిసిన పారిశ్రామిక ప్రతినిధులకు ముఖ్యమంత్రి హామినిచ్చారు. ప్రస్తుతం రెండు షిప్టుల్లో మాత్రమే పనిచేయడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని, ఇది ఇబ్బందిగా ఉందని కొన్ని కంపెనీలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చాయి.