వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ‍్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆమె ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షరాలిగా ఇంద్రా నూయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నామినేట్ చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది.
ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. 12 ఏళ్లు పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. గత ఆగస్ట్‌లో పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి అమెరికా తన పేరును ప్రతిపాదిస్తే ఇంద్రా నూయి ఏమంటారో చూడాలి.
అధ్యక్షుడిని ప్రతిపాదించే వ్యక్తుల్లో ఇవాంక ట్రంప్ కీలక వ్యక్తి కావడంతో ఆమె విజ్ఞప్తిని సభ్య దేశాలు ఆమోదించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్, ఇవాంకా అనేక సార్లు ప్రశంసించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి మొదట ఇవాంక, నిక్కి హేలి పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment