world bank rank
-
ఎంఎస్ఎంఈలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయాన్ని ప్రకటించింది. వాటికి ద్రవ్య లభ్యత లభించేందుకు 750 మిలియన్ డాలర్లు(సుమారు 5,670 కోట్ల రూపాయలు) పైగా సహకారం అందించే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మద్ సంతకం చేశారు. ప్రస్తుత సంక్షోభంనుంచి తట్టుకోవడంతోపాటు, మిలియన్ల ఉద్యోగాలను రక్షించడంలోనూ, తక్షణ ద్రవ్య భ్యత, ఇత రుణ అవసరాల నిమిత్తం 1.5 మిలియన్ల సంస్థలకు ఇది సాయపడుతుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఇబ్బందులనుంచి గట్టెక్కించడానికి అవసరమైన చర్యల్లో ఇది మొదటి అడుగు అని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మహమ్మారి ఎంఎస్ఎంఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఫలితంగా జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోతున్నారని ఖరే చెప్పారు. సంక్షోభం నుండి బయటపడేందుకు ఎంఎస్ఎంఈ రుణ ప్రణాళికను ప్రకటించామని చెప్పారు. జునైద్ అహ్మద్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ రంగం భారతదేశం వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం) కరోనా అనంతరం ఆర్ధిక పునరుద్ధరణకు ఈ రంగానికి ద్రవ్యలభ్యత తక్షణ అవసరమని ఆయన తెలిపారు. మొత్తం ఫైనాన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధానంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బిఎఫ్సి) స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌సిబి)ల రుణ సామర్థ్యాన్ని పెంచాలని, దీంతో ఎంఎస్ఎంఈ ఆర్థిక సమస్యల పరిష్కారంలో ఇవి సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కాగా కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పారు. భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. అలాగే పేదలు, బలహీన వర్గాలకు నగదు బదిలీ, ఆహార ప్రయోజనాల నిమిత్తం మే నెలలో మరో బిలియన్ డాలర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సులభతర వాణిజ్యంలో సత్తా చాటిన భారత్
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంక్ గురువారం ప్రకటించిన సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మెరుగైన స్ధానం లభించింది. భారత్ ఏకంగా 14 దేశాలను అధిగమించి ఈ జాబితాలో 63వ స్ధానానికి చేరుకుంది. మేకిన్ ఇండియాతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన సంస్కరణలతో భారత్ మెరుగైన ర్యాంక్‌ను సాధించింది. మెరుగైన సామర్థ్యం కనబరిచిన టాప్ 10 దేశాల సరసన వరుసగా మూడోసారి భారత్ చేరింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రభావంతో భారత వృద్ధి రేటును ఆర్బీఐ, ప్రపంచ బ్యాంక్, ఐఎంఫ్ సహా పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించిన నేపథ్యంలో ఈ ర్యాంకింగ్‌లు వెలువడటం గమనార్హం. 2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరిన సమయంలో భారత్ 190 దేశాలతో కూడిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అట్టడుగున 142వ స్ధానంలో ఉండటం గమనార్హం. నాలుగేళ్ల సంస్కరణల అనంతరం 2018లో భారత్ ర్యాంక్ తొలిసారిగా 100కు చేరింది. 2017లో ఇరాన్, ఉగాండాల కంటే దిగువన 130వ స్ధానంలో భారత్ నిలిచింది. పన్నులు, దివాలా చట్టం ఇతర సంస్కరణల ఊతంతో గతేడాది భారత్ ఏకంగా 23 ర్యాంకులు ఎగబాకి 77వ స్ధానానికి చేరింది. ఇక ఒకట్రెండు సంవత్సరాల్లో సులభతర వాణిజ్యంలో భారత్ టాప్ 50 దేశాల సరసన చేరే లక్ష్యంతో శ్రమిస్తోంది. మరోవైపు భారత్ సులభతర వాణిజ్యంలో ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని అద్భుత సామర్ధ్యం కనబరిచిన టాప్ 10 దేశాల జాబితాలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకుందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనమిక్స్‌కు చెందిన సైమన్ డిజన్కోవ్ ప్రశంసించారు. ఈ ఏడాది ర్యాంకులు గణనీయంగా మెరుగుపడిన టాప్ 10 దేశాల జాబితాలో భారత్‌తో పాటు సౌదీ అరేబియా (62), జోర్డాన్ (75), టోగో (97), బహ్రెయిన్ (43), తజికిస్తాన్ (106), పాకిస్తాన్ (108), కువైట్ (83), చైనా (31), నైజీరియా (131)లు చోటు దక్కించుకున్నాయి. -
శ్రీలంక కన్నా వెనకబడిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని, దీన్ని ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామని మన నాయకులు గొప్పగా చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక వర్గీకరణలో మాత్రం మన ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. భారత్ ఇప్పటికీ దిగువ మధ్య ఆదాయ దేశంగా కొనసాగుతుండడం విచారకరం. మన దిగువనున్న శ్రీలంక మాత్రం దిగువ–మధ్య ఆదాయ దేశాల బృందం నుంచి 2019–2020 ఆర్థిక సంవత్సరానికి ఎగువ–మధ్య ఆదాయ దేశాల బృందంలో చేరింది. 1999వ ఆర్థిక సంవత్సరంలో దిగువ–మధ్య ఆదాయ గ్రూపులో చేరిన ఆదేశం రెండు దశాబ్దాల్లోనే ఈ ఘనత సాధించింది. భారత దేశం దిగువ ఆదాయ దేశాల బృందం నుంచి 2009లో దిగువ–మధ్య ఆదాయ దేశాల బృందంలోకి అడుగుపెట్టింది. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ అదే కేటగిరీ దేశాల జాబితాలో కొనసాగుతున్నట్లు జూలై ఒకటవ తేదీన ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడయింది. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా జూలై ఒకటవ తేదీనే వివిధ దేశాల ఆదాయ క్యాటగిరీలా జాబితాను విడుదల చేస్తుంది. జాతీయ ఆదాయం తలకు సగటున ఎంత వస్తున్నదో డాలర్లలో ‘అట్లాస్ పద్ధతి’ ద్వారా లెక్కించి దేశాలకు కేటగిరీలను నిర్ణయిస్తుంది. 1. దిగువ కేటగిరీ: ఏడాదికి 1,025 డాలర్లు ఒకరికి సగటున వస్తే, అంటే 70,069 రూపాయలు వస్తే ఆ దేశాన్ని దిగువ కేటగిరీ దేశంగా పరిగణిస్తారు. 2. దిగువ–మధ్య కేటగిరీ: 1,026 నుంచి 3,995 రూపాయలు మధ్యన, అంటే 70,137 రూపాయల నుంచి 2, 73,098 రూపాయలు ఆదాయం సగటున ఉంటే దాన్ని దిగువ–మధ్య కేటగిరీగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్ ఇదే కేటగిరీలో కొనసాగుతోంది. 3. ఎగువ–మధ్య కేటగిరీ: ఈ 3,996 డాలర్ల నుంచి 12,375 డాలర్లు, అంటే 2,73,167 రూపాయల నుంచి 8,45,955 రూపాయల వరకు తలసరి ఆదాయం రావడం. 4. ఇక ఎగువ కేటగిరీ అంటే 12,376 డాలర్లు, 8,46,023 రూపాయలకన్నా ఎక్కువ ఆదాయం తలసరి రావడం. 2018 దేశాల వర్గీకరణ ప్రపంచంలోని మొత్తం 2018 దేశాల ఆర్థిక వ్యవస్థలను 2018 గణాంకాల ఆధారంగా ప్రపంచ బ్యాంకు వర్గీకరించింది. వాటిలో 80 దేశాలు ఎగువ ఆదాయ బృందంలో ఉండగా, 60 దేశాలు ఎగువ–మధ్య బృందంలో, భారత్ సహా 47 దేశాలు దిగువ–మధ్య బృందంలో, 31 దేశాలు దిగువ ఆదాయ బృందంలో కొనసాగుతున్నాయి. శ్రీలంకతోపాటు కామరోస్, జార్జియా, కొసోవో, సెనగల్, జింబాబ్వే దేశాలు ఎగువ తరగతి కేటగిరిలోకి వెళ్లగా, ఒక్క అర్జెంటీనా దేశం మాత్రమే ఎగువ ఆదాయం నుంచి ఎగువ–మధ్య ఆదాయ కేటగిరీలోకి దిగజారింది. -
టాప్ 50లో నిలవడమే లక్ష్యం
గాంధీనగర్: సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన సులభతర వాణిజ్య దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఈ జాబితాలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేయాల్సిందిగా తన జట్టును కోరానని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నిబంధనలు భారత్‌లో ఉండాలని, వ్యాపారం చేయడం చౌకగా ఉండే ప్రయత్నాలు కూడా చేయనున్నామని తెలిపారు. శుక్రవారం ఇక్కడ 9వ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తూ... దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, వ్యాపార వేత్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అడ్డంకులు తొలగిస్తాం... అభివృద్ధిని కుంటుపరిచే అడ్డంకులను తొలగించటంపై దృష్టి పెడుతున్నామని, సంస్కరణలు కొనసాగిస్తామని, అనవసరమైన నియంత్రణలు ఎత్తివేస్తామని మోదీ ఉద్ఘాటించారు. జీఎస్టీ అమలు, పన్నుల హేతుబద్ధీకరణ కారణంగా లావాదేవీల వ్యయాలు తగ్గాయని, వివిధ కార్యకలాపాలు మెరుగుపడ్డాయని వివరించారు. డిజిటల్ ప్రక్రియలు, ఆన్లైన్ లావాదేవీలు, సింగిల్ పాయింట్ ఇంటర్ఫేస్ వంటి అంశాల కారణంగా వ్యాపారం చేయడం వేగవంతమవుతోందని తెలిపారు. ఐటీ ఆధారిత లావాదేవీల ద్వారానే ప్రభుత్వ కొనుగోళ్లు, సమీకరణలు, డిజిటల్ చెల్లింపులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. పాలన మెరుగుపడేలా చూ స్తున్నామని, ‘సంస్కరణలు, పనితీరు సాధించడం, మార్పు తీసుకురావడం, మరింత మెరుగైన పనితీరు సాధించడం తమ తారక మంత్రమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం.... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని, వివిధ అంశాల్లో చాలా మార్పు కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని, లోతైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టామని వివరించారు. వీటన్నింటి ఫలితంగానే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు మన ఆర్థిక వ్యవస్థపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. సంస్కరణలు తేవడంలో, నియంత్రణలు తొలగించడంలో ఇదే జోరు కొనసాగిస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు ప్రభుత్వ విధానాల కారణంగా భారత్‌లోకి గత నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయని నరేంద్ర మోదీ తెలిపారు. అంతకు ముందటి 18 ఏళ్లలో ఈ పెట్టుబడుల్లో సగం కూడా రాలేదని వివరించారు. అన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నామని, 90 శాతానికి పైగా ఆమోదాలు ఆటోమేటిక్ రూట్లోనే లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి బాటన పయనిస్తోందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో సగటున ఏడాదికి 7.3 శాతం వృద్ధిని సాధించామని, 1991 తర్వాత జీడీపీ జోరు పెరిగిందని తెలిపారు. మన దేశంలో యువ జనాభా బాగా పెరుగుతోందని, వీరి కోసం ఉద్యోగకల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరిగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అందుకే తయారీ, మౌలిక రంగాలపై ఎన్నడూ లేనంతగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఆధునికమైన, సత్తాగల నవ భారత్‌ను నిర్మించే దిశగా మౌలిక రంగంలో పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. యురేనియం సరఫరాపై ఒప్పందం వైబ్రాంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగపడే యురేనియం సరఫరా కోసం భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు: రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ గుజరాత్లో పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇంధన, పెట్రో కెమికల్, డిజిటల్, తదితర రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్‌కు జన్మభూమి, కర్మభూమి(కార్యస్థలం) కూడా ఇదేనని, తమ తొలి ఎంపిక ఎప్పుడూ గుజరాతే అవుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని, పది లక్షలమందికి పైగా జీవనోపాధి కల్పించామని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రిలయన్స్ జియో త్వరలో వినూత్నమైన కొత్త కామర్స్ ప్లాట్ఫార్మ్ను అందుబాటులోకి తేనున్నదని ముకేశ్ అంబానీ వెల్లడించారు. గుజరాత్లో 12 లక్షలకు పైగా ఉన్న చిన్న దుకాణ దారులు, రిటైలర్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రూ.55,000 కోట్లు: అదానీ గత ఐదేళ్లలో గుజరాత్లో రూ.50,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని అదానీ గ్రూప్ పేర్కొంది. పెట్టుబడుల జోరును మరింతగా పెంచుతామని, రానున్న ఐదేళ్లలో రూ.55,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని గౌతమ్ అదానీ వెల్లడించారు. ముంద్రాలో బీఏఎస్ఎఫ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న పెట్రో కెమికల్ ప్లాంట్ కాకుండా ఈ పెట్టుబడులు పెడతామన్నారు. రూ.55,000 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ప్రపంచంలోనే పెద్దదైన సోలార్ హైబ్రిడ్ పార్క్‌ను ఖవ్డాలో నిర్మిస్తామని, ముంద్రాలో 1 గిగావాట్ డేటా సెంటర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని, 10 లక్షల టన్నుల కాపర్ స్మెల్టింగ్, రిఫైనింగ్ ప్రాజెక్ట్‌ను, సమగ్రమైన లి«థియం అయాన్ బ్యాటరీల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. టాటాల లిథియం అయాన్ ప్లాంట్ టాటా గ్రూప్ గుజరాత్లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టాటా కెమికల్స్ సోడాయాష్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. టాటా మోటార్స్, టాటా కెమికల్స్ వంటి తమ గ్రూప్ కంపెనీలు గుజరాత్‌లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, తమ పెట్టుబడులను మరింతగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. బిర్లా.. మూడేళ్లలో 15,000 కోట్లు మూడేళ్లలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ వెల్లడించింది. ఇప్పటికే గుజరాత్లో రూ.30,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని ఈ గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. టెక్స్టైల్స్, రసాయనాలు, గనులు ఇలా విభిన్న రంగాల్లో మూడేళ్లలో రూ.15,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. టొరెంట్ గ్రూప్ రూ.10,000 కోట్లు గుజరాత్లో ఇప్పటికే రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని టొరెంట్ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా చెప్పారు. పునరుత్పాదన ఇంధన, విద్యుత్, గ్యాస్ పంపిణీ రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని వివరించారు. సుజుకీ మూడో ప్లాంట్ జపాన్ వాహన దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ (మారుతీ సుజుకీ మాతృ కంపెనీ) తన మూడవ ప్లాంట్‌నూ గుజరాత్‌లోనే ఏర్పాటు చేయనుంది. తొలి ప్లాంట్‌ను 2017లో ప్రారంభించామని, త్వరలో రెండో ప్లాంట్ అందుబాటులోకి రానున్నదని, 2020లో మూడో ప్లాంట్‌ను కూడా గుజరాత్‌లోనే ఏర్పాటు చేస్తామని సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. టయోటా కంపెనీ సాంకేతిక సహకారంతో కొత్త హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతామని తెలిపారు .నయార ఎనర్జీ (రష్యాకు రాస్‌నెఫ్ట్ సంస్థది) వాదినార్‌లోని రిఫైనరీ విస్తరణ నిమిత్తం 85 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నది. మాంగనీస్ తయారు చేసే ఎమ్ఓఐఎల్ గుజరాత్‌కు చెందిన జీఎమ్‌డీసీ కంపెనీతో కలిసి రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సు తొలి రోజున గుజరాత్ ప్రభుత్వం వివిధ రంగాల సంస్థలతో 130 ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకుంది. వీటి పెట్టుబడుల విలువ రూ. 56,000 కోట్లపైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన సింగ్షాన్ గ్రూప్ రూ. 21,000 కోట్లతో ఉక్కు, కార్ల బ్యాటరీల ప్లాంటు ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. డేటా దురాక్రమణ నుంచి దేశాన్ని కాపాడండి ప్రధానిని కోరిన ముకేశ్ అంబానీ ప్రపంచ కంపెనీలు డేటా దురాక్రమణకు (డేటా కాలనైజేషన్) పాల్పడుతున్నాయని, దీనిని నివారించే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ కోరారు. రాజకీయ దురాక్రమణకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఉద్యమించినట్లుగానే డేటా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముందని వివరించారు. ప్రస్తుతమున్న ఫేస్బుక్, వాట్సాప్ వంటి కొత్త ప్రపంచంలో డేటా అనేది కొత్త సంపద అని, భారతీయుల డేటా భారతీయులకే సొంతమని చెప్పారు. భారత డేటాపై అంతర్జాతీయ కంపెనీల, కార్పొరేట్ల నియంత్రణ ఉండకూడదని భారతీయుల నియంత్రణే ఉండాలని పేర్కొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇంద్రానూయి?
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆమె ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షరాలిగా ఇంద్రా నూయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నామినేట్ చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. 12 ఏళ్లు పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి.. గత ఆగస్ట్‌లో పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి అమెరికా తన పేరును ప్రతిపాదిస్తే ఇంద్రా నూయి ఏమంటారో చూడాలి. అధ్యక్షుడిని ప్రతిపాదించే వ్యక్తుల్లో ఇవాంక ట్రంప్ కీలక వ్యక్తి కావడంతో ఆమె విజ్ఞప్తిని సభ్య దేశాలు ఆమోదించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్, ఇవాంకా అనేక సార్లు ప్రశంసించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి మొదట ఇవాంక, నిక్కి హేలి పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. -
టాప్–50లోకి చేరడం సాధ్యమే: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల జాబితాలో టాప్–50లోకి చేరడం సాధ్యమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ప్రపంచబ్యాంకు ర్యాంకుల్లో భారత్ గతేడాది 100వ ర్యాంకు నుంచి ఈ ఏడాది 77వ స్థానానికి చేరుకున్న నేపథ్యంలో జైట్లీ తన స్పందనను ఓ బ్లాగులో తెలియజేశారు. టాప్–50లోకి చేరడానికి భారత్ 27 స్థానాల దూరంలో ఉన్నట్టు చెప్పారు. అసాధ్యంగా అనిపించేది, ఇప్పుడు సాధ్యమేనని చెప్పారాయన. ‘‘మోదీ సర్కారు హయాంలో మన దేశం 65 స్థానాలు ముందుకు వచ్చింది.’’ అని అరుణ్ జైట్లీ వివరించారు. -
వ్యాపారానికి బెస్ట్... భారత్!
న్యూఢిల్లీ: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల్లో భారత్ మరింత పైకి చేరుకుంది. ప్రపంచ బ్యాంకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో గతేడాది 100కి చేరిన మన దేశం... తాజాగా విడుదలైన ర్యాంకుల్లో ఏకంగా 77కు వచ్చేసింది. గతేడాదితో పోలిస్తే 23 మెట్లు పైకెక్కింది. కేంద్రం చేపట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ (ఐబీసీ/దివాలా చట్టం), జీఎస్టీ తదితర సంస్కరణలు భారత ర్యాంకును మరింత పైకి తీసుకెళ్లాయి. మోదీ సర్కారు 2014లో కేంద్రంలో కొలువు తీరేనాటికి ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో భారత్ 190 దేశాలకు 142వ స్థానంలో ఉంది. గతేడాది అంతకుముందున్న 131 ర్యాంకు నుంచి 100కు, ఈ ఏడాది 77కు మెరుగుపడింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వెలువడిన ఈ ర్యాంకులు కేంద్రానికి మోదం కలిగించేవే. ఎక్కువగా అభివృద్ధి చెందగల పది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు ప్రపంచ బ్యాంకు చోటు కల్పించింది. అధిక జనాభా కలిగిన చైనా, భారత్ మెచ్చుకోతగ్గ సంస్కరణల అజెండాను చేపట్టినట్టు అభినందించింది. వీటిలో ముందడుగు... వ్యాపారం ప్రారంభించడం, నిర్వహణకు సంబంధించి పది అంశాల్లో భారత్ ఆరింటిలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని ప్రపంచబ్యాంకు 2019 వార్షిక నివేదిక తెలియజేసింది. వ్యాపారం సులభంగా ఆరంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్ సదుపాయం పొందడం, రుణాలు పొందడం, పన్నుల చెల్లింపు, భిన్న సరిహద్దుల గుండా వ్యాపారం నిర్వహణ అన్నవి భారత్ మెరుగుపరుచుకున్న అంశాలు. భారత సంస్కరణలకు ప్రశంసలు వ్యాపార ప్రక్రియలను భారత్ గాడిలో పెట్టిందని ప్రశంసించింది. ఎన్నో దరఖాస్తులు చేసుకోవాల్సిన చోట ఒకే సమగ్ర దరఖాస్తును తీసుకొచ్చి వ్యాపార ప్రారంభాన్ని భారత్ సులభం చేసిందని పేర్కొంది. ‘‘వ్యాట్ స్థానంలో జీఎస్టీని తీసుకొచ్చింది. ఇందులో నమోదు ప్రక్రియ చాలా వేగంగా ఉంది’’ అని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. కార్పొరేట్ ఆదాయపన్ను తగ్గించడం, ఈపీఎఫ్‌లో ఉద్యోగ సంస్థ వాటాను తగ్గించడం ద్వారా... తక్కువ పన్ను భారం కలిగిన, సులభంగా పన్ను చెల్లించే దేశంగానూ బారత్ నిలిచిందని తెలిపింది. ‘‘రుణాల రికవరీకి దివాలా పరిష్కార కార్యాచరణ అన్నది గొప్ప చర్య. డెట్ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ద్వారా ఎన్పీఏలను 28 శాతం తగ్గించుకోవడంతోపాటు పెద్ద రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేలా చేసింది’’ అని ప్రపంచబ్యాంకు తన నివేదికలో వివరించింది. రుణ రికవరీ కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని సూచించింది. ఎగుమతి వ్యయం, సమయాన్ని కూడా తగ్గించినట్టు పేర్కొంది. భవన అనుమతులను వేగవంతం చేయడమే కాకుండా నిర్మాణ అనుమతి భారాన్ని కూడా తగ్గించినట్టు తెలియజేసింది. న్యూజిలాండ్ టాప్: 190 దేశాల జాబితాలో వ్యాపార సులభతర విషయంలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. అమెరికా 8, చైనా 46, పాకిస్తాన్ 136 ర్యాంకు దక్కించుకున్నాయి. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మొత్తం మీద సగటున వ్యాపార సులభతర నిర్వహణలో 19 పాయింట్ల మేర స్కోరు పెంచుకున్నాయి. అరుదైన ఘనత ‘‘గతేడాది భారత్ ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో 30 స్థానాలు మెరుగుపరుచుకోగా, ఈఏడాది 23 స్థానాలు ఎగబాకింది. భారత్ వంటి ఏ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అయినా ఇది అరుదైన ఘనతే. గత రెండేళ్లలో 53 స్థానాలు నాలుగేళ్లలో మొత్తం 65 స్థానాలు మెరుగుపడింది. 10 అంశాల్లో ఆరింటిలో పురోగతి సాధించి అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు సమీపంలోకి చేరుకుంది’’ అని కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉంది: ప్రధాని పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం కోసం తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టంచేశారు. ‘‘భారత్‌లో వ్యాపార సులభతర ర్యాంకు మరోసారి మెరుగుపడడం ఆనందం కలిగించింది. ఆర్థిక సంస్కరణల విషయం లో మేం మా ధృడ వైఖరిని వ్యక్తం చేస్తున్నాం. ఇది పరిశ్రమ, పెట్టుబడులు, అవకాశాలను వృద్ధి చేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
23 స్థానాలు ఎగబాకిన భారత్
న్యూఢిల్లీ: సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి ఈ ఏడాది ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన జాబితాలో భారత్ 77వ ర్యాంక్ సొంతం చేసుకుంది. గతేడాదితో పోల్చితే భారత్తీ ఏడాది 23 స్థానాలు ఎగబాకింది. గతేడాది కూడా భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా వాణిజ్య రంగంలో అమలవుతున్న సంస్కరణల ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఈ ర్యాకింగ్స్‌కు ప్రపంచ బ్యాంక్ 10 అంశాలను పరిగణలోకి తీసుకుంటుండగా.. వాటిలో 6 అంశాల్లో భారత్ వృద్ధి కనబరిచింది. గతేడాదిలాగే, ఈ సంవత్సరం కూడా భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వృద్ధి సాధిస్తున్న టాప్ 10 దేశాల్లో స్థానం దక్కించుకుంది. అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆ దిశలో పలు సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు. అయితే, గడిచిన కొద్ది రోజులుగా పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విఫలం అయిందని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న వేళ.. ఈ అంశం మోదీ సర్కార్‌కు కొంత ఊరట కలిగించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వృద్ధి దూకుడులో భారత్‌కే తొలిస్థానం!
న్యూఢిల్లీ: భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. 2018–2019 (ఏప్రిల్–మార్చి) ఆర్థిక సంవత్సరంలో దేశం 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని, అటు తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. ‘‘వృద్ధిలో భారత్ వెనకబడే పరిస్థితులు పోయాయి’’ అని ప్రపంచబ్యాంక్‌లో వృద్ధి పరిశీలనా వ్యవహారాల విభాగం డైరెక్టర్ అహ్యాన్ కోష్ పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటుందన్నది తమ అంచనా అని వివరించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి విడుదల చేసిన 2018 జూన్ నివేదికలో బ్యాంక్ పొందుపరచిన అంశాల్లో ముఖ్యమైనవి.. ►ప్రైవేటు వినియోగం పెరగడం, పెట్టుబడులు పటిష్టత, కేంద్రం చేపడుతున్న ఆర్థిక, ద్రవ్య సంస్కరణలు భారత్ వృద్ధికి ప్రధానంగా దోహదపడే అంశాలు. ► దక్షిణాసియా వృద్ధి 2018లో 6.9 శాతంకాగా, 2017లో 7.1 శాతంగా ఉంటుంది. దీనికి భారత్ వృద్ధి పటిష్టత కారణం. ►2017లో చైనా 6.9 శాతం వృద్ధి సాధిస్తుందన్నది అంచనాకాగా, 2018 (6.5 శాతం), 2019 (6.3 శాతం), 2020 (6.2 శాతం)ల్లో ఈ రేటు మరింత తగ్గుతుంది. ► భారత్ వృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఉత్పాదకత మెరుగుకూ ఇది అవసరం. -
ఏపీ.. కాపీ
- తెలంగాణ సులభ వాణిజ్య విధానం - ఆన్లైన్ దరఖాస్తు చోరీ చేసిన ఏపీ సర్కారు - ప్రపంచ బ్యాంక్ ర్యాంకు కోసం అడ్డదారులు - దీనితో 22 రోజుల్లో ఏకంగా 16 ర్యాంకులు ఎగబాకిన వైనం - ఆంధ్రప్రదేశ్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ - అధికారులతో సీఎస్ భేటీ.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు - కాపీరైట్స్ చట్టం సెక్షన్ 63 కింద కేసు నమోదు - ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్ - ఏపీ నిర్వాకంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ సాక్షి, హైదరాబాద్: సులభ వాణిజ్యంలో ప్రపంచబ్యాంక్ ర్యాంకు కోసం ఏపీ అడ్డదారులు తొక్కింది.. తెలంగాణ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్లైన్ దరఖాస్తును మక్కీకి మక్కీ కాపీ చేసింది.. దానిని తమదిగా చూపిస్తూ కేంద్ర పరిశ్రమల శాఖకు సమర్పించింది.. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన తెలంగాణ అధికారులు ఏపీ ‘చోరీ’పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా తమ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్లైన్ దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ నిస్సిగ్గుగా చోరీ చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీసీఎస్ పోలీసులు కాపీరైట్స్ యాక్ట్ సెక్షన్-63 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఏపీ సర్కారు ‘కాపీ’ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కాపీ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు అంశాలపై ఉప్పూ నిప్పుగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ అంశం సరికొత్త వివాదానికి తెరలేపింది. సులభ వాణిజ్యానికి ప్రోత్సాహం కోసం.. అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ‘డిప్’ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పేరిట ఓ వెబ్ పోర్టల్ రూపొందించింది. ఈవోడీబీ ర్యాంకును ఆశించే రాష్ట్రాలు డిప్ సూచించిన 340 ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలను సమర్పించాలి. ఆయా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం, సమాధానాల పురోగతిని పర్యవేక్షించేందుకు ‘ఆన్లైన్ డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు శాఖల వారీగా సమర్పించే సమాచారం ఆధారంగా ‘స్కోరు’ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాలు జూన్ 30లోగా సులభ వాణిజ్యానికి వీలు కల్పించేలా తాము చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను సమర్పించాలని డిప్ గడువు విధించింది. జూన్ 28, 29 తేదీల్లో వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆధారాల సమర్పణ గడువును జూలై ఏడో తేదీ వరకు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కాపీ కొట్టిందిలా! న్యాయశాఖకు చెందిన ‘కమర్షియల్ కోర్ట్ ఫీ అండ్ ప్రాసెస్ ఫీ ఆన్లైన్ పేమెంట్’ దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న డిప్ వెబ్‌పోర్టల్‌కు సమర్పించింది. ఏపీ సర్కారు జూన్ 30 అర్ధరాత్రి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సమాచారం అప్లోడ్ చేయలేదు. గడువు పెంచిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దరఖాస్తును ఏపీ అధికారులు కాపీ కొట్టి అప్లోడ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ దరఖాస్తులో పొందుపరిచిన ‘సబ్మిషన్ రిఫరెన్స్ నంబర్’ అనే అంశాన్ని యథాతథంగా ఉంచేశారు. ఈ అంశం తెలంగాణకు మాత్రమే ఉన్న విశిష్ట సంఖ్యా విధానం కావడంతో ఏపీ సర్కారు కాపీ వ్యవహారం బట్టబయలైంది. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వ విధానాలను కాపీ చేయడం మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు. ఈవోడీబీ ర్యాంకుల కోసం అడ్డదారి తొక్కిన ఏపీ వైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22 రోజుల్లో 16 ర్యాంకులు పైకి.. ఈవోడీబీలో గతేడాది ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. దీన్ని సవాలుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా సంస్కరణలను చేపట్టింది. తాజా ర్యాంకింగ్‌లో 51.93%స్కోర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో ఉండగా.. 51.76% స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో ఉంది. జూన్ 13న ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో బిహార్ ప్రథమ స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానంలో నిలిచింది. తమ సమాచారాన్ని కాపీ కొట్టడంతో ఏపీ మూడో ర్యాంకు ఎగబాకిందని తెలంగాణ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న పారిశ్రామిక ప్రణాళికలు, పరిశ్రమల వివరాలను కొందరు అధికారులు ఏపీకి చేరవేశారన్న సమాచారంతో మంత్రి కేటీఆర్ పరిశ్రమల శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగుల పనితీరును సమీక్షించారు. ఏపీ నిర్వాకంపై కేంద్రానికి లేఖ మెరుగైన ఈవోడీబీ ర్యాంకు కోసం ఏపీ సర్కారు అడ్డదారులు తొక్కిన తీరుకు సంబంధించిన ఆధారాలను అధికారులు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుకు అందజేశారు. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ‘‘సులభ వాణిజ్యం కోసం కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను తెలంగాణ గుర్తించింది. రెడ్‌టేపిజాన్ని తగ్గిస్తూ, పారదర్శక తకు పెద్దపీట వేసేలా డిప్ చేస్తున్న ప్రయత్నం పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టిస్తుందని భావిస్తున్నాం. రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణలకు సంబంధించిన ఆధారాల సమర్పణకు జూలై 7ను గడువుగా నిర్దేశించారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల వెబ్సైట్ల సమాచారాన్ని కాపీ కొడుతూ ఈవోడీబీ ర్యాంకు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ తర్వాత డిప్‌కు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది ర్యాంకులు కేటాయించాలి..’’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ కాపీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను లేఖతో పాటు జతచేశారు.