వ్యాపారానికి బెస్ట్‌... భారత్‌! | Ease of Doing Business: India jumps 23 notches, now at rank 77  | Sakshi
Sakshi News home page

వ్యాపారానికి బెస్ట్‌... భారత్‌!

Published Thu, Nov 1 2018 12:58 AM | Last Updated on Thu, Nov 1 2018 12:59 AM

 Ease of Doing Business: India jumps 23 notches, now at rank 77  - Sakshi

న్యూఢిల్లీ: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల్లో భారత్‌ మరింత పైకి చేరుకుంది. ప్రపంచ బ్యాంకు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో గతేడాది 100కి చేరిన మన దేశం... తాజాగా విడుదలైన ర్యాంకుల్లో ఏకంగా 77కు వచ్చేసింది. గతేడాదితో పోలిస్తే 23 మెట్లు పైకెక్కింది. కేంద్రం చేపట్టిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్సీ (ఐబీసీ/దివాలా చట్టం), జీఎస్టీ తదితర సంస్కరణలు భారత ర్యాంకును మరింత పైకి తీసుకెళ్లాయి. మోదీ సర్కారు 2014లో కేంద్రంలో కొలువు తీరేనాటికి ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో భారత్‌ 190 దేశాలకు 142వ స్థానంలో ఉంది. గతేడాది అంతకుముందున్న 131 ర్యాంకు నుంచి 100కు, ఈ ఏడాది 77కు మెరుగుపడింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వెలువడిన ఈ ర్యాంకులు కేంద్రానికి మోదం కలిగించేవే. ఎక్కువగా అభివృద్ధి చెందగల పది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు ప్రపంచ బ్యాంకు చోటు కల్పించింది. అధిక జనాభా కలిగిన చైనా, భారత్‌ మెచ్చుకోతగ్గ సంస్కరణల అజెండాను చేపట్టినట్టు అభినందించింది.  

వీటిలో ముందడుగు... 
వ్యాపారం ప్రారంభించడం, నిర్వహణకు సంబంధించి పది అంశాల్లో భారత్‌ ఆరింటిలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని ప్రపంచబ్యాంకు 2019 వార్షిక నివేదిక తెలియజేసింది. వ్యాపారం సులభంగా ఆరంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్‌ సదుపాయం పొందడం, రుణాలు పొందడం, పన్నుల చెల్లింపు, భిన్న సరిహద్దుల గుండా వ్యాపారం నిర్వహణ అన్నవి భారత్‌ మెరుగుపరుచుకున్న అంశాలు.  

భారత సంస్కరణలకు ప్రశంసలు 
వ్యాపార ప్రక్రియలను భారత్‌ గాడిలో పెట్టిందని ప్రశంసించింది. ఎన్నో దరఖాస్తులు చేసుకోవాల్సిన చోట ఒకే సమగ్ర దరఖాస్తును తీసుకొచ్చి వ్యాపార ప్రారంభాన్ని భారత్‌ సులభం చేసిందని పేర్కొంది. ‘‘వ్యాట్‌ స్థానంలో జీఎస్టీని తీసుకొచ్చింది. ఇందులో నమోదు ప్రక్రియ చాలా వేగంగా ఉంది’’ అని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. కార్పొరేట్‌ ఆదాయపన్ను తగ్గించడం, ఈపీఎఫ్‌లో ఉద్యోగ సంస్థ వాటాను తగ్గించడం ద్వారా... తక్కువ పన్ను భారం కలిగిన, సులభంగా పన్ను చెల్లించే దేశంగానూ బారత్‌ నిలిచిందని తెలిపింది. ‘‘రుణాల రికవరీకి దివాలా పరిష్కార కార్యాచరణ అన్నది గొప్ప చర్య. డెట్‌ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ద్వారా ఎన్‌పీఏలను 28 శాతం తగ్గించుకోవడంతోపాటు పెద్ద రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేలా చేసింది’’ అని ప్రపంచబ్యాంకు తన నివేదికలో వివరించింది. రుణ రికవరీ కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని సూచించింది. ఎగుమతి వ్యయం, సమయాన్ని కూడా తగ్గించినట్టు పేర్కొంది. భవన అనుమతులను వేగవంతం చేయడమే కాకుండా నిర్మాణ అనుమతి భారాన్ని కూడా తగ్గించినట్టు తెలియజేసింది.  

న్యూజిలాండ్‌ టాప్‌: 190 దేశాల జాబితాలో వ్యాపార సులభతర విషయంలో న్యూజిలాండ్‌ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్‌ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. అమెరికా 8, చైనా 46, పాకిస్తాన్‌ 136 ర్యాంకు దక్కించుకున్నాయి. బ్రిక్స్‌ దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మొత్తం మీద సగటున వ్యాపార సులభతర నిర్వహణలో 19 పాయింట్ల మేర స్కోరు పెంచుకున్నాయి. 

అరుదైన ఘనత   
‘‘గతేడాది భారత్‌ ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో 30 స్థానాలు మెరుగుపరుచుకోగా, ఈఏడాది 23 స్థానాలు ఎగబాకింది. భారత్‌ వంటి ఏ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అయినా ఇది అరుదైన ఘనతే. గత రెండేళ్లలో 53 స్థానాలు నాలుగేళ్లలో మొత్తం 65 స్థానాలు మెరుగుపడింది. 10 అంశాల్లో ఆరింటిలో పురోగతి సాధించి అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు సమీపంలోకి చేరుకుంది’’ అని కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉంది: ప్రధాని 
పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం కోసం తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టంచేశారు. ‘‘భారత్‌లో వ్యాపార సులభతర ర్యాంకు మరోసారి మెరుగుపడడం ఆనందం కలిగించింది. ఆర్థిక సంస్కరణల విషయం లో మేం మా ధృడ వైఖరిని వ్యక్తం చేస్తున్నాం. ఇది పరిశ్రమ, పెట్టుబడులు, అవకాశాలను వృద్ధి చేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement