తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. 2026 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా తమ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్- డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
ఏదైనా జరగొచ్చు..
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జట్టు కట్టే అవకాశముందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పార్టీని తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడం లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమ’ని అన్నామలై పేర్కొన్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
‘2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ద్రవిడ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. నాన్-ద్రవిడన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాం. మాది కూడా బలమైన కూటమే. తమిళనాడు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. 2025లో జరిగే రాజకీయ పరిణామాలతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంద’ని అన్నామలై వ్యాఖ్యానించారు.
బలమైన కూటమి ఏర్పాటు చేస్తాం
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీరిద్దరిని మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటతామని ప్రకటించారు. ‘అందరూ ఊహించినట్లుగానే ఏఐఏడీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. 2026 మన ఎన్నికలు! ఇవి అన్నాడీఎంకే ఎన్నికల’ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు.
ఈసారి అటువంటి పొరపాటు చేయం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే నష్టపోయామన్న అభిప్రాయాన్ని పరోక్షంగా అంగీకరించారు పళనిస్వామి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని చెప్పారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకేపై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పొత్తు లేకపోవడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. పొత్తులు వస్తాయి, పోతుంటాయి.. కానీ ఏఐఏడీఎంకే భావజాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, బలమైన కూటమి లేదు.. ప్రభుత్వంలో లేనప్పటికీ మేము 20 శాతానికి పైగా ఓట్లను సాధించాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 26 శాతం ఓట్లు సాధించింది. 2019తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ’ని ఈపీఎస్ వివరించారు. ఈ ట్రెండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.
చదవండి: అమిత్ షా మాట.. ఒమర్ అబ్దుల్లా నోట.. ఏం జరిగింది?
డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలగా మిగిలిపోతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతూ డీఎంకే పగటి కలలు కంటోంది. అది ఎప్పటికీ నిజం కాదు. డీఎంకేపై ప్రజల్లో కొత్త చైతన్యం వస్తోంది. అదే మా విజయమ’ని ఆయన అన్నారు. కాగా తమిళనాడు శాసనసభలో 234 మంది సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment