'అమెరికాలో ఇలా చెయ్యొద్దు'!.. భారతీయ విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు! | PepsiCo Ex Boss Indra Nooyi Cautions Indian Students In America, Details Inside - Sakshi
Sakshi News home page

'అమెరికాలో ఇలా చెయ్యొద్దు'!.. భారతీయ విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు!

Published Fri, Mar 22 2024 5:30 PM | Last Updated on Fri, Mar 22 2024 6:40 PM

PepsiCo Ex Boss Indra Nooyi Cautions Indian Students In US - Sakshi

అమెరికాలో వెలుగు చూసిన భారత సంతతి విద్యార్థుల ఘటనలపై పెప్పికో మాజీ సీఈవో ఇంద్రానూయి స్పదించారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దయచేసి యూఎస్‌కి వచ్చే భారతీయ విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అ‍న్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కార్యకలాపాల జోలికి వెళ్లొద్దని సూచిస్తూ పది నిమిషాల నిడివిగల వీడియోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఇంద్రనూయి.."అక్కడ దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తల గురించి విన్నాను.

అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియోని రికార్డు చేశాను. అమెరికాలో సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చట్ట పరిధికి లోబడి ఉండండి. రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాల్లోకి వెళ్లొద్దు. మాదకద్రవ్యాల జోలికి, అతిగా మద్యపానం సేవించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. ఇవన్నీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టెవే. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే విద్యార్థులు తగిన యూనివర్సిటీని, కోర్సును ఎంపిక చేసుకోండి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూఎస్‌కి రావడం చాలా మంచిది. ఇది గొప్ప సాంస్కృతిక మార్పు కూడా. పైగా వారు తమ కుటుంబాలు, బంధువులు, పర్యావరణ పరిస్థితులకు చాలా దూరంగా చదువు కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించాలి. అమెరికాలో దిగిన క్షణం నుంచే తగిన స్నేహితులను ఎంచుకోండి.

కొత్తగా రావడంతో మీకు ఇక్కడి అలవాట్లు, జీవనశైలి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీటి వ్యామోహంలో పడి చెడు స్నేహాల్లో చిక్కుకోవద్దు. కొంతమంది విద్యార్థులు సరదాగా మాదక ద్రవ్యాలకు ట్రై చేయాలని చూస్తున్నారు. ఇలాంటివి అస్సలు వద్దు ప్రాణంతకం, పైగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అదీగాక ఇందులో చిక్కకుంటే మీ కెరీర్‌ నాశనం అవుతుంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనవద్దు. మీ చర్యల వల్ల జరిగే  పరిణామలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఈ ఆతిథ్య దేశం చట్టాలు, నిబంధనలు అస్సలు తెలియవు.

అంతేగాదు మీ వీసా స్థితి, పార్ట్‌ టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్ట బద్ధత అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించవద్దు. యూఎస్‌లో ఉన్నప్పుడూ విదేశీ విద్యార్థిగా హద్దుల్లోనే ఉండాలనే విషయం మరిచిపోవద్దు. అలాగే మీరు నివశించే ప్రాంతాల గురించి పూర్తిగి తెలుసకోవాలి. సమూహంగా లేదా స్నేహితులతోనే తప్పక వెళ్లండి." అని సూచించారు ఇంద్రానూయి. అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాలు, స్థానిక కమ్యూనిటీల గురించి అవగాహన ఉండాలన్నారు. ఇక్కడ ఉండే స్థానిక భారతీయ అమెరికన్లతోనూ, భారతీయ కాన్సులేట్‌తోనూ టచ్‌లో ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలతో సహా వివిధ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

కాగా, ఇటీవలే అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మహమ్మద్‌ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అబ్దుల్‌ తండ్రి మహమ్మద్‌ సలీం పేర్కొనడం గమనార్హం. అలాగే అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు కూడా చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్‌ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఫిబ్రవరి నెలలో పర్డ్యూ యూనివర్శిటీకి చెందిన భారతీయ-అమెరికన్ సమీర్ కామత్ (23) అనే విద్యార్థి తలపై తానే తుపాకీతో కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు. ఇవేగాక మరి కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పలు దిగ్బ్రాంతికర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

(చదవండి: US: అమెరికాలో ఇంత భక్తి ఉందా?)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement