ఇంద్రా నూయీ
దుబాయ్: పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామకం ఖరారైంది. ఆమె ఈ ఏడాది జూన్‌లో బోర్డులో చేరతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. నూయీ నియామకాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్వాగతించారు. తమ పాలనా వ్యవహారాల పరిధి పెంపొందించుకునేందుకు ఆమె సామర్థ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఇందుకోసం తీవ్ర స్థాయిలో పరిశోధించి అన్నివిధాల అర్హురాలైనందున నూయీని ఎంపిక చేశామని ప్రకటించారు. నూయీ మాట్లాడుతూ... ‘క్రికెట్‌ను నేను అమితంగా ఇష్టపడతా. యుక్త వయసులో కళాశాలలో క్రికెట్ ఆడా. బృంద స్ఫూర్తి, సమగ్రత, గౌరవం, ఆరోగ్యకర పోటీ వంటి లక్షణాలను ఈ ఆటలోనే నేర్చుకున్నా. నా నియామకంతో ఆశ్చర్యానికి గురయ్యా. బోర్డు సహచరులతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్వతంత్ర డైరెక్టర్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment