ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళ ఇంద్రా నూయి
51 మందిలో రెండో ర్యాంక్
న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన ‘ప్రపంచపు 51 అతిశక్తివంతమైన మహిళల’ జాబితాలో పెప్సికో సీఈవో, చైర్మన్ ఇంద్రా నూయి స్థానం పొందారు. భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక మహిళగా ఇంద్రా నూయి నిలిచారు. ఈమె రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అగ్రస్థానంలో జనరల్ మోటార్స్ సీఈవో, చైర్మన్ మేరీ బర్రా ఉన్నారు. గతేడాది కూడా ఇంద్రా నూయి రెండవ స్థానంలోనే ఉండటం విశేషం. ఇక 2014లో మూడవ స్థానంలో ఉన్నారు.
గడచిన ఏడాది కాలంలో పెప్సికో మార్కెట్ క్యాపిటల్ 18 శాతం పెరుగుదలతో 155 బిలియన్ డాలర్లకి ఎగిసిందని ఫార్చ్యూన్ పేర్కొంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల కారణంగా కంపెనీకి గతేడాది లాభాలు తగ్గినా కూడా మార్కెట్ క్యాపిటల్ పెరగడంలో ఇంద్రా నూయి కీలకపాత్ర పోషించారని కొనియాడింది. ఇన్వెస్టర్లు ఇంద్రా నూయి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొంది. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ వృద్ధితో మేరీ బర్రా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబునిచ్చింది.
టాప్-10లోని మహిళలు వీరే..
ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో పలువురు ప్రముఖులు స్థానం పొందారు. కాగా టాప్-10లో.. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో మెరిల్లిన్ హ్యూసన్ (3వ స్థానం), ఐబీఎం సీఈవో గిన్ని రొమెట్టీ (4), ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో అబిగెయిల్ (5), ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (6), హ్యూలెట్ పకార్డ్ ఎంటర్‌ప్రైస్ సీఈవో మెగ్ విత్‌మన్ (7), జనరల్ డైనమిక్స్ సీఈవో ఫెబె నొవాకొవిక్ (8), మాండలిజ్ ఇంటర్నేషనల్ సీఈవో ఐరెన్ రోసెన్‌ఫీల్డ్ (9), ఒరాకిల్ కో-సీఈవో సఫ్రా కాట్జ్ (10వ స్థానం) ఉన్నారు.