న్యూయార్క్: వ్యాపార రంగంలో నలభై ఏళ్ల కన్నా తక్కువ వయసులోనే అత్యంత ప్రభావవంతమైన వారిగా ఎదిగిన 40 మంది జాబితాలో అయిదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన 40 అండర్ 40 లిస్టులో దివ్య సూర్యదేవర, వాస్ నరసింహన్, ఆనంద్ స్వామినాథన్, అపూర్వ మెహతా, రేష్మా సౌజనికి స్థానం దక్కింది. చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవర (36 ఏళ్లు) నాలుగో స్థానంలో ఉన్నారు. జీఎం అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలో 2013లో సీఐవో బాధ్యతలు చేపట్టిన ఆమె 2014లో సీఈవోగా ఎదిగారు. దాదాపు 80 బిలియన్ డాలర్ల అసెట్స్‌ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇక, ఏడో స్థానంలోని వాస్ నరసింహన్.. స్విస్ ఫార్మా దిగ్గజం నొవార్టిస్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పరిశ్రమలోనే అత్యంత భారీ ఔషధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. 9,600 మంది ఉద్యోగులు, బిలియన్ల డాలర్ల విలువ చేసే 143 ప్రాజెక్టులు, 500 క్లినికల్ ట్రయల్స్ ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి. యాక్సెంచర్‌కి చెందిన ఆనంద్ స్వామినాథన్ 18వ స్థానంలో ఉన్నారు. ఆయన సారథ్యంలో 6 బిలియన్ డాలర్ల యాక్సెంచర్ డిజిటల్ విభాగం ఏటా 30 శాతం వృద్ధి సాధిస్తోందని ఫార్చ్యూన్ పేర్కొంది. దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇన్‌స్టాకార్ట్ సీఈవో అపూర్వ మెహతా 23వ స్థానంలో నిల్చారు. టెక్ సంస్థ గర్ల్స్ హు కోడ్ వ్యవస్థాపకురాలు రేష్మా సౌజని 39వ స్థానంలో ఉన్నారు. మహిళల్లో టెక్నాలజీ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఈ సంస్థకు.. గూగుల్, ట్వీటర్ వంటి టెక్ దిగ్గజాలు తోడ్పాటు అందిస్తున్నాయి.
అగ్రస్థానంలో న్యూమన్..
ఇక, వుయ్‌వ ర్క్ సంస్థ సీఈవో ఆడమ్ న్యూమన్, టెస్లాకి చెందిన జేబీ స్ట్రాబెల్, ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రయాన్ గ్రేవ్స్ .. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో వరుసగా తొలి 3 స్థానాల్లో ఉన్నారు. కేవలం సంపదే ప్రామాణికం కాకుండా సాధించిన లక్ష్యాలు, ఆశయాలు, ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు మొదలైన వాటి ప్రాతిపదికగా ఈ జాబితా రూపొందించినట్లు ఫార్చ్యూన్ పేర్కొంది. హెల్త్‌కేర్, ఆటోమొబైల్, ఫైనాన్స్, రియల్టీ తదితర రంగాల వారికి ఇందులో చోటు దక్కిందని వివరించింది.
ఫార్చ్యూన్ 40లో అయిదుగురు భారతీయులు
Published Fri, Sep 25 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement