చందా కొచర్ - శిఖా శర్మ (ఫైల్ ఫోటో)
ముంబై : దేశీయ టాప్ ప్రైవేట్ బ్యాంకు అధినేతలకు బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్‌బీఐ షాకిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్‌కు, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురిలకు ఏడాది చివరన ఇచ్చే బోనస్‌లను ఆలస్యం చేస్తోంది. బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న కుంభకోణాల నేపథ్యంలో బోనస్‌లపై ఆర్‌బీఐ వేటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకుల సీఈవోలు 2017 మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా బోనస్‌లను అందుకోలేదు. ఈ బోనస్‌లు 2018 మార్చి 31 కంటే ముందే అందుకోవాల్సి ఉంది. కానీ ప్రతిపాదిత చెల్లింపులపై ఆర్‌బీఐ ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. బోనస్‌లు ఇవ్వకుండా ఆర్‌బీఐ ఎందుకు ఆలస్యం చేస్తుందనే విషయంపై స్పందించడానికి సంబంధిత వర్గాలు నిరాకరించాయి.
చందాకొచర్‌కు రూ.2.2 కోట్ల బోనస్ ఇవ్వాలని ఐసీఐసీఐ బోర్డు ఆమోదించింది. శిఖా శర్మ రూ.1.35 కోట్ల బోనస్ అందుకోవాల్సి ఉంది. ఆదిత్య పురి కూడా రూ.2.9 కోట్ల బోనస్‌ను పొందాల్సి ఉందని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్‌లో తెలిసింది. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాక్సిస్ బ్యాంకు నిరాకరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల అధికార ప్రతినిధులు కూడా ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్‌పై స్పందించలేదు. ఆర్‌బీఐ సైతం బోనస్‌లపై స్పందించడం లేదు.
వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల విషయంలో చందాకొచర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌కు రూ.3250 కోట్ల రుణాలు జారీచేశారని, చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌తో బిజినెస్ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్ గ్రూప్‌కు రుణాలిచ్చారనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. కాగ, ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. మరోవైపు తొలి నుంచి శిఖాశర్మపై మొండిబాకీల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవలే ఆమె పదవీ కాలం పొడిగింపుపై ఆర్‌బీఐ విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా ఏడాది చివర బోనస్‌లను కూడా ఆలస్యం చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయ ప్రైవేట్ బ్యాంకులు కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొండిబకాయిలు పెరగడం, కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడం బ్యాంకులను బాధిస్తోంది. ముందు నుంచి చూసుకుంటే 2018 మార్చి 31 కంటే ముందే ఈ బోనస్‌లను ఆర్‌బీఐ ఆమోదించాల్సి ఉందని ముంబైకి చెందిన బ్యాంకింగ్ విశ్లేషకుడు అసుతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఈ ఆలస్యాన్ని తాము ఎన్నడూ చూడలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment