చందా కొచ్చర్, సందీప్ బక్షి
అవకతవకల్లో, అసమర్ధతలో, అనేక రకాల ఇతర జాడ్యాల్లో మన దేశంలోని ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోవని ఏణ్ణర్ధంనుంచి రుజువవుతుండగా ఇన్నాళ్లూ తమ బ్యాంకు సీఈఓ, ఎండీ చందా కొచర్‌ను వెనకేసుకొస్తున్న ఐసీఐసీఐ బ్యాంకు ఎట్టకేలకు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి సందీప్ బక్షికి పగ్గాలు అప్పగించింది. అన్నిటినీ ప్రైవే టీకరిస్తూ పోతే తప్ప ఈ దేశం బాగుపడదని తెగ వాదించే ఆర్థిక రంగ నిపుణులు అందుకు ఐసీఐసీఐ పనితనాన్ని తరచు ఉదహరిస్తూ పరవశించేవారు. కానీ ఇప్పుడు బయటపడిందంతా అందుకు విరుద్ధం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత వగైరాలు వెల్లడైనప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లపై కనీసం వెనువెంటనే చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ ఐసీఐసీఐ బ్యాంకు ఆ పని చేయలేదు. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరులో అవకతవకలు చోటు చేసుకున్నాయని రెండేళ్లక్రితం ఒక మదుపుదారు ఫిర్యాదు చేసినప్పుడు ఆ సంస్థ మిన్నకుండి పోయింది.
మొన్న మార్చిలో ఆ ఆరోపణలే వెల్లువెత్తడం మొదలయ్యాక ఆమెను సమర్థిస్తూ ప్రక టన విడుదల చేసింది. వాటిల్లో నిజానిజాలేమిటన్న సంగతలా ఉంచి తన వంతుగా వెను వెంటనే అంతర్గత విచారణ లేదా బయటివారితో విచారణ జరిపించి, నిజానిజాలు వెల్లడించి ‘అంతా సవ్యంగానే ఉన్నద’ని బ్యాంకు చెప్పగలిగితే, కొచర్ నిజాయితీ వెల్లడికావడంతోపాటు సంస్థ ప్రతిష్ట ఇంతకింతా పెరిగేది. కానీ కొచర్‌పై తమ సంస్థకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని అది ప్రక టించి ఊరుకుంది. వచ్చిన ఆరోపణలన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులు మాత్రమేనని చెప్పింది. సంస్థలో 34 ఏళ్లక్రితం మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరి, తన ప్రతిభాపాటవా లతో ఎదిగి, బ్యాంకు రూపకల్పనలో పాలుపంచుకుని, దాన్ని ఉన్నత స్థాయికి చేర్చడంలో కొచర్ కృషి అసాధారణమైనది. ఆ విషయంలో ఆమెపై బ్యాంకుకు విశ్వాసం, నమ్మకం ఉండటం తప్పేం కాదు. అలా ఉండబట్టే ఆమెకు బ్యాంకు సారథ్య బాధ్య తలు కూడా అప్పగించారనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ వచ్చిన ఆరోపణలపై ఆడిటింగ్ జరిపించి బ్యాంకు మదుపుదార్లలోనూ, ఖాతాదార్లలోనూ ఉన్న సందేహాలను తొలగించడానికి అవి అడ్డు రావలసిన అవసరం లేదు.
2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేయడంలో అవక తవకలు చోటు చేసుకున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్‌కూ, చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కూ మధ్య వ్యాపార లావాదేవీలున్నాయని వాటి పర్యవ సానంగానే రుణం లభించిందని ఈ ఆరోపణ చేసినవారు తెలిపారు. రుణం మంజూరయ్యాక దీపక్ కొచర్‌కూ, మరో బంధువుకూ లబ్ధి చేకూరిందని సాక్ష్యాధారాలతో చూపారు. తీసుకున్న రుణాన్ని వీడియోకాన్ సక్రమంగా చెల్లించి ఉంటే ఈ వ్యవహారం బయటికొచ్చేది కాదు. వచ్చినా దాన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ అప్పుగా తీసుకున్న రూ. 3,250 కోట్లలో రూ. 2,810 కోట్లను అది ఎగేసింది. దాంతో ఆ మొత్తాన్ని గత ఏడాది నిరర్థక ఆస్తిగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయంలో ఐసీఐసీఐ వివరణ సమర్ధనీయంగా లేదు. వీడియోకాన్‌కు రుణాలిచ్చిన కన్సార్షి యంలో తమది లీడ్ బ్యాంక్ కాదని, ఆ సంస్థకు కన్సార్షియం నుంచి వెళ్లిన మొత్తం రుణంలో తాము ఇచ్చింది 10 శాతం కన్నా తక్కువేనని బ్యాంకు చెప్పింది. అలాగే రుణమివ్వాలన్న నిర్ణయం బ్యాంకు క్రెడిట్ కమిటీదేనని, కమిటీలో ఆమె ఒక సభ్యురాలే తప్ప దానికి చైర్‌పర్సన్ కారని కూడా వివరించింది. ఇవన్నీ నిజమే కావొచ్చు. కానీ క్రెడిట్ కమిటీ వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేసిన సందర్భంలో తన భర్తకు వీడియోకాన్ గ్రూపు అధినేతతో వ్యాపార సంబంధా లున్నాయని చందా కొచర్ వెల్లడించారా లేదా అన్నది తేల్చాలి. అలాగే రుణం మంజూరయ్యాక ధూత్ నుంచి ఆమె కుటుంబీలకు లబ్ధి చేకూరిందో లేదో ఆరా తీయాలి. రుణం మంజూరైన సమ యంలో ధూత్‌తో తమ కుటుంబీకుల వ్యాపార వ్యవహారాలను చెప్పకపోయి ఉంటే చందా కొచర్ అనౌచిత్యానికీ పాల్పడినట్టే లెక్క.
అధిక ఈక్విటీ గల ప్రధాన ప్రమోటర్ నేతృత్వంలో నడిచే హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర వంటి బ్యాంకులకూ, ఐసీఐసీఐకీ మధ్య వ్యత్యాసం ఉంది. ఐసీఐసీఐ పూర్తిగా వృత్తి నిపుణులుండే బోర్డు కార్యనిర్వహణలో నడుస్తోంది. సంస్థ అధిపతిగా ప్రధాన ప్రమోటర్ మార్కెట్ స్థితిగతులను అంచనా వేసుకుని, లాభనష్టాలను బేరీజు వేసుకుని ఎలాంటి నిర్ణయానికైనా రాగలుగుతారు. కానీ వృత్తి నిపుణులతో కూడిన బోర్డులు పనితీరు వేరేగా ఉంటుంది. అక్కడ బోర్డులోని నిపుణులంతా ఏ అంశం విషయంలోనైనా అన్ని కోణాల్లోనూ చర్చించుకుని ఒక నిర్ణయానికొస్తారు. ఏ ఒక్కరో బోర్డు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం తక్కువ. కానీ ఐసీఐసీఐలో జరిగిందంతా అందుకు విరుద్ధమని జరిగిన వ్యవహారాన్ని గమనిస్తే అర్ధమవుతుంది. అలా చూస్తే ఇందులో కొచర్‌కు మాత్రమే కాదు... బోర్డు సమష్టి బాధ్యత కూడా ఉంది. ఐసీఐసీఐ వ్యవహారంపై ఫిబ్రవరిలో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించగా, ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబి కూడా రంగంలోకి దిగాయి. బ్యాంకు తనకు తానుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. కొచర్‌ను వెనకేసుకురావడానికి బదులు ఈ పని ముందే చేసి ఉంటే ఐసీఐసీఐ ప్రతిష్ట ఇనుమడించేది. అయితే విచారకరమైన విషయమేమంటే కొచర్‌ను సెలవుపై వెళ్లాలని బోర్డు కోరలేదు. ఆమె తనంత తానుగా వెళ్లారు. ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ విచారణ పూర్తయ్యేవరకూ సెలవు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తీవ్ర ఆరోపణలొచ్చిన ప్పుడైనా నిర్ణయాత్మకంగా, దృఢంగా వ్యవహరించలేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బోర్డుకు తెలియపోవడం ఆశ్చర్యకరం. ఈ విషయంలో తన విధానాలు సవరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment