మరింత సక్రమంగా సబ్సిడీల వ్యవస్థ: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భారత పారిశ్రామిక రంగానికి హామీ ఇచ్చారు. సబ్సిడీల వ్యవస్థను మరింత హేతుబద్దీకరిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఇప్పటికే వ్యయ నిర్వహణా కమిషన్‌తో పలు దఫాలు చర్చలు జరిపినట్లు తెలిపారు.
కమిషన్ కూడా దీనిని తీవ్రంగా పరిశీలిస్తోందని, వ్యవస్థ పటిష్టతకు వ్యూహాలు రూపొందిస్తోందని అన్నారు. త్వరలో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయాలను తగిన విధంగా కేంద్రం అమలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, ఎల్‌పీజీ సబ్సిడీని నేరుగా వినియోగదారుకు అందించడం వంటి అంశాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.
దేశంలో స్టాక్ మార్కెట్ల పరిస్థితి మెరుగుపడుతోందనడానికి తగిన సంకేతాలు ఉన్నాయని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు లక్ష్యాల మేరకు ఉంటాయన్నారు. ఇక్కడ జరిగిన ఒక ఆర్థిక సదస్సులో అరుణ్‌జైట్లీ శనివారం మాట్లాడారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైట్లీ మాట్లాడిన కొన్ని ముఖ్యాంశాలు...
బీమా, జీఎస్‌టీ బిల్లుల ఆమోదంపై విశ్వాసం
ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బీమా, వస్తువులు- సేవల పన్ను బిల్లు(జీఎస్‌టీ) ఆమోదానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. రాజ్యసభలో తగినంత మెజారిటీ లేనందువల్ల అవసరమైతే ఉభయసభల సమావేశం ద్వారా బిల్లుల ఆమోదానికి రాజ్యాంగబద్దంగా ఉన్న అవకాశాన్నీ వినియోగించుకుంటాం. భూ సేకరణ చట్టంపై నెలకొన్న సవాళ్లను కూడా రానున్న వారాల్లో అధిగమించగమని భావిస్తున్నాం.
ముఖ్యమంత్రుల సమావేశంపై...
64 సంవత్సరాల క్రితం నుంచీ కొనసాగుతున్న ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటుపై ఆదివారం జరిగే ముఖ్యమంత్రుల సమావేశం చర్చిస్తుంది. రాష్ట్రాలకు మరింత సాధికారత కల్పించాలన్నది ఇందుకు సంబంధించి కేంద్రం ప్రధాన సంకల్పం. రేపటి (ఆదివారం) సమావేశం అనంతరం తీసుకునే నిర్ణయం ఏదైనా.. అది ఆర్థికంగా రాష్ట్రాల పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుందని విశ్వసిస్తున్నాను.
తయారీ రంగంపై దృష్టి అవసరం: కొచర్
తయారీ రంగం పురోభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందా కొచర్ సదస్సులో వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో కట్టడి చేయడానికి సరఫరాల సమస్యలను అధిగమించడం కీలకమని విశ్లేషించారు.