మూడు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది.
ఇంట్రాడేలో 329 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 248 పాయింట్లు పతనమై 39,502 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 11,861 పాయింట్ల వద్ద ముగిశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం నేపథ్యంలో గత మూడు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో క్లోజవుతున్నాయి. ఈ రికార్డ్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని, బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులంటున్నారు.
తగ్గుతున్న బాండ్ల రాబడులు...
మూడు నెలల అమెరికా బాండ్ల రాబడులు కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గాయి. ఇది మాంద్యానికి సూచన అని విశ్లేషకులంటున్నారు. మరోవైపు అమెరికా–చైనాల మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా ప్రభావం చూపడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్‌లో కూడా బాండ్ల రాబడులు తగ్గాయని, ఆర్‌బీఐ వచ్చేవారంలో కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు దీనికి కారణమని శాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ల్లో బాండ్ల రాబడులు తగ్గుతుండటంతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు అభివృద్ది చెందిన దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
347 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్
సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఒక దశలో 18 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 329 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 347 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
► ఇటీవలే జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన ఎస్‌బీఐలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ షేర్ 3.2 శాతం నష్టపోయి రూ.348 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ బ్యాంక్ క్యూఐపీ విధానంలో రూ.15,000–18,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్త కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
ఈ ర్యాలీ నెలే!
ఈ ఏడాది చివరి కల్లా సెన్సెక్స్ 42,000 పాయింట్లకు చేరగలదన్న గతంలో వెల్లడించిన లక్ష్యాలను ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ, బీఎన్‌పీ పారిబా కొనసాగించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ర్యాలీ నెల రోజుల్లో సమసిసోతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment