న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో కనిపించే ట్రెండ్ ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కాగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా బుధవారం(5న) మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఆర్థిక గణాంకాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ జోరు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తీరు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ విశ్లేషకులు వివరించారు.
యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుండటంతో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 115ను దాటేసింది. మరోపక్క ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 3.5 శాతాన్ని మించాయి. దీంతో దేశీ కరెన్సీ రూపాయి కొత్త చరిత్ర లిఖిస్తూ 82కు పతనమైంది. ఇది రిజర్వ్ బ్యాంక్ వద్ద గల విదేశీ మారక నిల్వలను సైతం దెబ్బతీస్తోంది. ఇందుకు కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) జీడీపీలో 2.8 శాతానికి చేరడం సైతం ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అత్యధిక శాతం మంది నిపుణులు అంచనా వేశారు.
చమురు సెగ తగ్గినా..
ఇటీవల ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్యారల్ 80–85 డాలర్ల వద్ద కదులుతున్నాయి. ఇది సానుకూల అంశమే అయినప్పటికీ డాలరు బలపడుతుండటంతో ఈ ప్రభావం ఆవిరౌతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సెంటిమెంటు బలహీనపడుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు మరోపక్క కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర అమ్మకందారులుగా నిలుస్తుండటం మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు ప్రస్తావించారు. దీంతో వరుసగా ఏడు రోజులపాటు క్షీణపథంలో సాగిన మార్కెట్లు గత వారం చివర్లో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 672, నిఫ్టీ 233 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకున్నాయి. కాగా.. ఈ వారం సెప్టెంబర్ నెలకు యూఎస్, జపాన్ తయారీ రంగ(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఆటో విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఆటో షేర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
మార్కెట్ విలువకు చిల్లు
గత వారం మార్కెట్ల పతనంతో టాప్–10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 1.16 లక్షల కోట్లు ఆవిరైంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 41,706 కోట్లు నీరసించి రూ. 16.08 లక్షల కోట్లకు పరిమితంకాగా.. పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ విలువ రూ. 17,314 కోట్ల నష్టంతో దాదాపు రూ. 4.74 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 13,806 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 13,424 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 10,831 కోట్లు చొప్పున విలువను కోల్పోయాయి. ఇదేవిధంగా మార్కెట్ విలువలో బజాజ్ ఫైనాన్స్‌కు రూ. 10,241 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 8,732 కోట్లు చొప్పున చిల్లు పడింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ. 20,145 కోట్లమేర ఎగసి రూ. 5.94 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే సంగతి
తెలిసిందే.
ఎఫ్‌పీఐల యూటర్న్
దేశీ క్యాపిటల్ మార్కెట్లలో గత రెండు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. ఫలితంగా సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వీటితో కలిపిచూస్తే 2022లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1.68 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు, జులైలో దాదాపు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. జులైకు ముందు అంటే 2021 అక్టోబర్ మొదలు ఎఫ్‌పీఐలు వరుసగా తొమ్మిది నెలలపాటు విక్రయాలకే కట్టుబడటం గమనార్హం! ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ట్రెజరీ ఈల్డ్స్, డాలరు జోరు వంటి అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, జర్మనీకి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. ఇటీవల పెరిగిన ఆర్థిక మాంద్య భయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు షాకిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment