న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ లావాదేవీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) విధించిన కేంద్రానికి కనకవర్షం కురవనుందా? అధికారుల లెక్కలు చూస్తే అలాగే కనబడుతోంది! ఎల్‌టీసీజీతో 2019–20 నాటికి ఖజానాకు సమకూరే ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి హష్ముఖ్ అధియా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఈ రూపంలో వచ్చే ఆదాయం అప్పటికి రూ.40 వేల కోట్ల స్థాయికి చేరొచ్చని ఆయన అంచనా వేశారు.
ప్రధానంగా గాడ్‌ఫాదరింగ్ ప్రభావం (జనవరి 31 నాటికి ఉన్న లాభాలపై పన్ను మినహాయింపు) అప్పటికి పూర్తిగా తొలగిపోనుండటమే దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కేంద్రం ఎల్‌టీసీజీని ప్రవేశపెట్టడాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు. ‘కష్టార్జితంతో జీవించే ఉద్యోగులు 30 శాతం వరకూ ఆదాయపు పన్ను కడుతున్నప్పుడు... స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను కళ్లజూస్తున్న ఇన్వెస్టర్లను పన్ను పరిధిలోకి తీసుకురావడం కచ్చితంగా సరైన నిర్ణయమే’ అని అధియా వ్యాఖ్యానించారు.
కాగా, 2017–18 అసెస్‌మెంట్ సంవత్సరంలో దాఖలైన ఐటీ రిటర్నుల ప్రకారం రూ.3.67 లక్షల కోట్ల ఆదాయం...దీర్ఘకాలిక మూలధన పన్ను నుంచి మినహాయింపు పొందినట్లు అధియా వివరించారు. ఇప్పటికే షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మూలధన లాభాల లెక్కింపు అనేది ఈ ఏడాది జనవరి 31నాటి స్టాక్ ధర ఆధారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తొలి ఏడాది రూ.20 వేల కోట్లు...
ఎల్‌టీసీజీ విధింపు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం(2018–19)లో కేంద్ర ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల మేర ఆదాయం లభించవచ్చని.. ఆ తర్వాత ఏడాది(2019–20)లో గాడ్‌ఫాదరింగ్ ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఈ మొత్తం రెట్టింపై రూ.40 వేట కోట్లకు చేరనుందని అధియా చెప్పారు. షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఏడాదికి మించిన పెట్టుబడులపై రూ.లక్ష పైబడిన లాభాలకు 10 శాతం చొప్పున ఎల్‌టీసీజీని తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, జనవరి 31 వరకూ వచ్చిన లాభాలకు ఈ పన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. షేర్లను కొనుగోలు చేసిన తర్వాత ఏడాదిలోపు విక్రయిస్తే... తద్వారా వచ్చిన మూలధన లాభాలపై ప్రస్తుతం 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను(ఎస్‌టీసీజీ) అమలవుతోంది. ఇదికాకుండా షేర్ల కొనుగోలు/అమ్మకం లావాదేవీ విలువపై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ) కూడా కేంద్రం జేబుల్లోకి వెళ్తోంది. అంటే తాజాగా కేంద్రం విధించిన ఎల్‌టీసీజీతో స్టాక్ మార్కెట్ లావాదేవీలపై జంట పన్నులను (డబుల్ ట్యాక్సేషన్) కేంద్రం అమల్లోకి తీసుకొచ్చినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment