న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు లావాదేవీలపై విధించిన మూలధన లాభాల పన్నుపై (ఎల్‌టీసీజీ) ఇన్వెసర్టలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత తమ వద్దనున్న షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలపై మాత్రమే ఎల్‌టీసీజీ అమలవుతుందని స్పష్టం చేసింది. కాగా, లాభాన్ని లెక్కించే విషయంలో షేర్ల కొనుగోలు రేటుకు ప్రామాణికత విషయానికొస్తే... జనవరి 31 నాటి ట్రేడింగ్ గరిష్ట ధర లేదా వాస్తవ కొనుగోలు ధర, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని లెక్కలోకి తీసుకుంటామని పేర్కొంది.
షేర్లను కొనుగోలు చేసిన తర్వాత ఏడాది తర్వాత విక్రయించినా (ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, బిజినెస్ ట్రస్ట్‌ల యూనిట్లు కూడా) ఆ లాభాలపై (రూ.లక్షకు మించితే) 10% ఎల్‌టీసీజీని 2018–19 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షేర్లను కొని, ఏడాదిలోపు విక్రయిస్తే... తద్వారా వచ్చే లాభాలపై 15% స్పల్పకాలిక మూలధన పన్ను (ఎస్‌టీసీజీ) మాత్రమే అమల్లో ఉంది. దీనికితోడు ప్రతి కొనుగోలు/అమ్మకం లావాదేవీపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ) కూడా ఇన్వెస్టర్లు చెల్లించాల్సి వస్తోంది.
ఎల్‌టీసీజీ విధింపుతో జంటపన్నులను (డబుల్ ట్యాక్సేషన్) కేంద్రం అమల్లోకి తీసుకొచ్చినట్లు లెక్క. వాస్తవానికి 14 ఏళ్ల క్రితం 20% మేర ఎల్‌టీజీసీ అమల్లో ఉండేది. దీన్ని తొలగించి అప్పుడు ఎస్‌టీటీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మోదీ సర్కారు మాత్రం ఎస్‌టీటీని యథాతథంగా కొనసాగిస్తూనే... మళ్లీ ఎల్‌టీజీసీకూడా తీసుకొచ్చింది. ఈ పన్ను ప్రభావంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడం... సూచీలు కుప్పకూలటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అనుమానాల నివృత్తి కోసం కేంద్రం వివరణను(ఎఫ్‌ఏక్యూ) విడుదల చేసింది. దీనిలో ముఖ్యాంశాలివీ...
♦ కొత్తగా విధించనున్న ఎల్‌టీసీజీ ప్రకారం... 2018 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత షేర్లను అమ్మితేనే (కొన్న తేదీ నుంచి ఏడాది పూర్తయితే) ఆ లాభాలపై 10 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. జనవరి 31 వరకూ వచ్చిన లాభాలపై (గాడ్‌ఫాదర్డ్) ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
♦ ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10లోని 30 క్లాజ్ కింద ఈ ఏడాది మార్చి 31 వరకూ షేర్ల విక్రయంపై ఎల్‌టీసీజీ మినహాయింపు పొందవచ్చు.
♦ ఏడాది తర్వాత షేరు లేదా ఫండ్ యూనిట్ అమ్మకం విలువ నుంచి కొనుగోలు విలువను తీసేస్తే వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం కింద లెక్కిస్తారు.
♦ 2018, జనవరి 31కి ముందు షేరును కొనుగోలుచేస్తే ఆ ధరను వాస్తవ రేటుగా పరిగణిస్తారు. అయితే, జనవరి 31 నా టి ట్రేడింగ్‌లో సంబంధిత షేరు గరిష్ట ధరనూ దీనికి ప్రామాణికంగా చూస్తారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ధర అయితే, దాన్ని లాభాల లెక్కింపులో కొనుగోలు ధరగా పరిగణిస్తారు.
♦ ఇక అన్‌లిస్టెడ్ యూనిట్ (బిజినెస్ ట్రస్టులకు సంబంధించినవి) విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరి 31 నాటి నికర అసెట్ విలువ(ఎన్‌ఏవీ)ను కొనుగోలు ధరగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ఈ యూనిట్లను గనుక విక్రయిస్తే... దీనిపై వచ్చిన లాభాలపై(రూ. లక్ష మించితే) 10 శాతం పన్నును కట్టాల్సి ఉంటుంది.
♦ ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 మధ్య తమ వద్దనున్న షేర్ల విక్రయం వల్ల తలెత్తిన దీర్ఘకాలిక మూలధన నష్టాలను పన్ను చెల్లింపు విషయంలో తగ్గించి చూపడానికి (సెట్‌ఆఫ్) లేదా బదలాయించుకోవడానికి (క్యారీ ఫార్వార్డ్) కుదరదు.
♦ 2018, ఏప్రిల్ 1 తర్వాత విక్రయించే షేర్లపై వచ్చే దీర్ఘకాలిక మూలధన నష్టాలను మాత్రం సెట్‌ఆఫ్ లేదా క్యారీఫార్వార్డ్ చేసుకోవడానికి వీలుంటుంది.
♦ కొన్ని కంపెనీలు తమవద్దనున్న మిగులు నిధులను కంపెనీ విస్తరణ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టకుండా షేర్లు, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అందుకే పెట్టుబడులను ఉత్పాదకతవైపు మళ్లించడం కోసమే ఎల్‌టీసీజీని విధించాల్సి వచ్చింది.
మినహాయింపులు తొలగించాకే 25 శాతానికి
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుపై ఆర్థిక మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: పరిశ్రమకిస్తున్న మినహాయింపులన్నీ ఎత్తివేసిన తర్వాతే కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించడం సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 30% స్థాయిలో ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో 25%కి తగ్గిస్తానంటూ 2015లో తాను హామీ ఇచ్చిన సంగతిని ఆయన ప్రస్తావించారు. అయితే, ఇది అమలు చేయాలంటే మినహాయింపులన్నీ ఎత్తివేయాల్సి ఉంటుందంటూ షరతు కూడా పెట్టినట్లు జైట్లీ చెప్పారు.
చాలా మటుకు సంస్థలు మినహాయింపులపై ఆధారపడి ఉన్నందున .. మధ్యలో వాటిని ఎత్తివేయడం సరికాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం రూ. 250 కోట్ల దాకా టర్నోవరు ఉండే సంస్థలపై ట్యాక్స్ రేటును 25%కి తగ్గించగా, దాదాపు 7,000 పైచిలుకు సంస్థలు 30% పరిధిలోనే ఉన్నాయి. అయితే, పన్ను మినహాయింపులన్నీ పరిగణనలోకి తీసుకుంటే వీటి ట్యాక్స్ రేటు 22%గానే ఉంటోం దని జైట్లీ పేర్కొన్నారు.
మరోవైపు, పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలోకి చేర్చడంపై రాష్ట్రాలు సుముఖంగా లేవని ఆయన చెప్పారు. జీఎస్‌టీ అమలయ్యే కొద్దీ క్రమంగా సహజ వాయువు, మొత్తం రియల్టీని దీని పరిధిలోకి తేవాల్సి ఉంటుందని.. ఏదో ఒక దశలో పెట్రోల్, డీజిల్‌ని కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని జైట్లీ పేర్కొన్నారు. ఇక ద్రవ్య లోటు కట్టడి లక్ష్యం 0.3% తేడాతో తప్పిపోవడం.. కేవలం గణాంకాలపరమైన అంశం మాత్రమేనని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment