ఇన్వెస్టర్లకు 'జై' ట్లీ | How corporate India reacted to Arun Jaitley's budget speech | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు 'జై' ట్లీ

Published Thu, Feb 2 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

ఇన్వెస్టర్లకు 'జై' ట్లీ

ఇన్వెస్టర్లకు 'జై' ట్లీ

విదేశీ ఇన్వెస్టర్లకు పన్నులపై స్పష్టతతో మార్కెట్‌ దూకుడు
28వేల పైకి సెన్సెక్స్‌.. 8,700 దాటిన నిఫ్టీ
486 పాయింట్ల లాభంతో 28,142 వద్ద ముగింపు
155 పాయింట్ల లాభంతో 8,716కు నిఫ్టీ


అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌కు స్టాక్‌ మార్కెట్‌ జై కొట్టింది. ద్రవ్య లోటుకు సంబంధించి క్రమశిక్షణ, విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుపై స్పష్టత మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 28 వేల పాయింట్లపైన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,700 పాయింట్ల పైన ముగిశాయి. సెన్సెక్స్‌ 486 పాయింట్లు లాభపడి 28,142 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 8,716 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 3 నెలల గరిష్ట స్థాయి. గతేడాది అక్టోబర్‌  తర్వాత స్టాక్‌ సూచీలు ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే తొలిసారి. పదేళ్ల కాలంలో(2005 తర్వాత) బడ్జెట్‌ రోజు సెన్సెక్స్‌ ఈ స్థాయిలో లాభపడడం కూడా ఇదే మొదటిసారి. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేంత వరకూ స్తబ్దుగా ఉన్న స్టాక్‌  మార్కెట్, బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి జైట్లీ చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి జోరందుకుంది. సెన్సెక్స్‌  ఇంట్రాడేలో 504 పాయింట్ల వరకూ లాభపడింది. ఆర్థిక, రియల్టీ షేర్లు జోరును చూపించాయి.

అన్నీ శుభ శకునములే...
దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుల్లో ఎలాంటి మార్పులు,  చేర్పులు చేయకపోవడం చాలా సానుకూల ప్రభావం చూపించింది.షేర్ల పరోక్ష బదిలీ సంబంధిత పన్నుల నుంచి కేటగిరీ వన్, కేటగిరీ టూ విదేశీ ఇన్వెస్టర్లను మినహాయించడం సెంటిమెంట్‌కు  మరింత జోష్‌నిచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు బలపడడం కలసివచ్చింది. ప్రభుత్వం తీసుకునే రుణాల లక్ష్యాన్ని తగ్గించడం వడ్డీరేట్లు మరింత తగ్గుతాయని సూచిస్తోందన్న అంచనాలు, ప్రపంచ మార్కెట్లు లాభాలు.. ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపాయి.

భయాలు తగ్గాయ్‌...
ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో మార్పు లేకపోవడం ఇన్వెస్టర్ల భయాలను తగ్గించిందని జియోజిత్‌ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌  వినోద్‌ నాయర్‌ చెప్పారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.2 శాతానికి తగ్గించడం మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. క్యాపిటల్‌ మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేనందున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగుతుందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీఎండీ దినేశ్‌ టక్కర్‌ చెప్పారు.

రియల్టీ షేర్ల జోరు..
రియల్టీ షేర్లు దుమ్ము రేపాయి. అందుబాటు ధరల గృహ రంగానికి మౌలిక హోదాని ఇవ్వడం, నిర్మాణం పూర్తయి, అమ్ముడుపోని గృహాల కోసం డెవలపర్లకు పన్ను రాయితీలు ప్రకటించడం, మౌలిక రంగానికి 3.96 లక్షల కోట్లు కేటాయించడంతో రియల్టీ షేర్లు కళకళలాడాయి.రియల్టీ షేర్లతో పాటు  హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంక్, సిమెంట్‌ కంపెనీల షేర్లు కూడా ఎగిశాయి.  డీఎల్‌ఎఫ్, గోద్రేజ్‌ ప్రొపర్టీస్, హెచ్‌డీఐఎల్, ఒబెరాయ్‌ రియల్టీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్, శోభ డెవలపర్స్, యూనిటెక్‌ షేర్లు 7 శాతం వరకూ లాభపడ్డాయి. గృహ్‌ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, కెన్‌ ఫిన్‌ హోమ్స్,  డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి.

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్ల పరుగు..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంక్‌లకు రూ.10,000 కోట్ల మూలధన నిధుల ప్రకటనతో ఆయా బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్, బీఓబీ, పీఎన్‌బీ, సిండికేట్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, ఐడిబీఐ బ్యాంక్‌  షేర్లు 6 శాతం వరకూ లాభపడ్డాయి. జనవరిలో అమ్మకాల జోరుతో మారుతీ షేర్‌ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.6,105)ను తాకి  4.6% లాభంతో రూ.6,172 వద్ద ముగిసింది.

రూ.1.71 లక్షల కోట్లు అప్‌
ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ బుధవారం ఒక్క రోజే రూ.1.71 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం ఇన్వెస్టర్ల సంపద రూ.114.27 లక్షల కోట్లకు చేరింది.

ఎఫ్‌పీఐ నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు(ఎఫ్‌పీఐ) ఊరట నిచ్చేలా ప్రభుత్వం కీలక సడలింపు చేసింది. కేటగిరీ 1, 2 ఎఫ్‌పిఐలను పరోక్ష బదిలీల కింద విధించే పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. దీంతో సరైన నియంత్రణ ఉన్న ఎఫ్‌పీఐలు భారత్‌లో పెట్టుబడి ఉపసంహరణ సందర్భంగా విదేశీ కంపెనీల్లో ఆస్తులు, షేర్లు విక్రయించినప్పుడు పన్ను చెల్లింపులు చేయాల్సిన పనిఉండదు. 2012లో చేసిన ఐటి సవరణలో ఈ లావాదేవీలను పన్ను పరిధిలోకి తెచ్చారు. దీనిపై ఎఫ్‌పీఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

వీరి ఆందోళనను దృష్టిలో ఉంచుకొని తాజాగా కేటగిరీ 1, 2 ఎఫ్‌పిఐలను పరోక్ష బదిలీ నిబంధననుంచి ఉపసంహరిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో తెలిపారు. కేటగిరీ 1 ఎఫ్‌పిఐల్లో సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు ఉండగా, కేటగిరీ 2లో మ్యూచువల్‌ ఫండ్స్, బ్యాంకులున్నాయి. ప్రస్తుత సడలింపు హైరిస్క్‌ విదేశీ మదుపరులకు, వ్యక్తిగత మదుపరులకు, హెడ్జ్‌ఫండ్స్‌కు వర్తించదు.  

 సాగు  షేర్లు కళకళ..
మంచి వర్షాలు కురియడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధి సాధించగలదని విత్త మంత్రి పేర్కొనడం, ఐదేళ్లలో వ్యవసాయాదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా చేసిన ప్రతిపాదనల ఫలితంగా సాగు సంబంధిత, ఎరువుల కంపెనీల షేర్లు దూసుకుపోయాయి. దీపక్‌ ఫెర్టిలైజర్స్, కోరమాండల్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్, ధనుక అగ్రిటెక్, జైన్‌ ఇరిగేషన్, 3–7% రేంజ్‌లో పెరిగాయి.

ఫార్మా షేర్ల వెలవెల..
జనరిక్‌ ఔషధాలను ప్రోత్సహించడం, ఔషధాల, కాస్మొటిక్స్‌ ధరలను తగ్గించేలా నియమ నిబంధనలను సవరించనున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఫార్మా షేర్లు నష్టపోయాయి. అరబిందో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, లుపిన్, వొకార్డ్, సన్‌ ఫార్మా, దివిస్‌ ల్యాబ్స్, తదితర షేర్లు 2 శాతం వరకూ కుదేలయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement