రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంకు పన్ను మినహాయింపులు ఎత్తివేత!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో చిన్న మదుపరుల వాటాను పెంచడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్‌జీఈఎస్‌ఎస్)పై అందుతున్న పన్ను ప్రయోజనాన్ని ఎత్తివేస్తున్నట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంపై అందుతున్న పన్ను ప్రయోజనం అసెస్‌మెంట్ ఇయర్ 2018–19 నుంచి ఉండదని వెల్లడించారు. స్టాక్ మార్కెట్‌లో తొలిసారి పెట్టుబడి పెట్టినవారు మూడు అసెస్‌మెంట్ ఇయర్స్‌లో పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు ఉండగా, 2018 ఏప్రిల్ 1 నుంచి రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంకు పన్ను మినహాయింపులు ఉండవని జైట్లీ తెలిపారు.
అసలు ఏంటీ పథకం: చిన్న మదుపరులే లక్ష్యంగా 2012 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా యూపీఏ ప్రభుత్వం ఈ స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం అంతకుముందెన్నడు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టని వారు.. తొలిసారిగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, అటువంటి వారి పెట్టుబడిని పన్నుమినహాయింపుగా చూపించే వెసులుబాటుని ఇస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీంలో గరిష్టపన్ను ప్రయోజనం రూ.50,000 కాగా, వార్షిక ఆదాయం రూ.10 లక్షలలోపు ఉన్నవారికే ఈ వెసులుబాటుని ఇచ్చింది. ఆ తరువాత 2013–14లో గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచింది. 80సీసీజీ కింద పెట్టుబడిలో 50 శాతాన్ని పన్ను మినహాయింపుగా పరిగణస్తూ, రూ.50,000 వరకు మాత్రమే డిడెక్షన్ ఇస్తూ ఆర్‌జీఈఎస్‌ఎస్ పథకాన్ని పొడిగించింది.