Rajiv Gandhi Equity Scheme
-
రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంకు పన్ను మినహాయింపులు ఎత్తివేత!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో చిన్న మదుపరుల వాటాను పెంచడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్జీఈఎస్ఎస్)పై అందుతున్న పన్ను ప్రయోజనాన్ని ఎత్తివేస్తున్నట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంపై అందుతున్న పన్ను ప్రయోజనం అసెస్మెంట్ ఇయర్ 2018–19 నుంచి ఉండదని వెల్లడించారు. స్టాక్ మార్కెట్లో తొలిసారి పెట్టుబడి పెట్టినవారు మూడు అసెస్మెంట్ ఇయర్స్‌లో పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు ఉండగా, 2018 ఏప్రిల్ 1 నుంచి రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీంకు పన్ను మినహాయింపులు ఉండవని జైట్లీ తెలిపారు. అసలు ఏంటీ పథకం: చిన్న మదుపరులే లక్ష్యంగా 2012 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా యూపీఏ ప్రభుత్వం ఈ స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం అంతకుముందెన్నడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టని వారు.. తొలిసారిగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, అటువంటి వారి పెట్టుబడిని పన్నుమినహాయింపుగా చూపించే వెసులుబాటుని ఇస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీంలో గరిష్టపన్ను ప్రయోజనం రూ.50,000 కాగా, వార్షిక ఆదాయం రూ.10 లక్షలలోపు ఉన్నవారికే ఈ వెసులుబాటుని ఇచ్చింది. ఆ తరువాత 2013–14లో గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచింది. 80సీసీజీ కింద పెట్టుబడిలో 50 శాతాన్ని పన్ను మినహాయింపుగా పరిగణస్తూ, రూ.50,000 వరకు మాత్రమే డిడెక్షన్ ఇస్తూ ఆర్జీఈఎస్ఎస్ పథకాన్ని పొడిగించింది. -
రాజీవ్ ఈక్విటీ స్కీము కింద పన్ను మినహాయింపు ఎలా?
రాజీవ్‌గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్జీఈఎస్ఎస్) కింద రూ. 50,000 విలువైన అర్హమైన షేర్లను కొన్నాను. వీటిలో రూ. 49,000 విలువగల షేర్లకే లాక్ఇన్ వర్తించింది. నేనేం చేయాలి? ఆర్జీఈఎస్ఎస్ కింద పన్ను మినహాయింపును నేను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? - భాస్కర్, వరంగల్ మీ ప్రశ్న కొంచెం సందిగ్ధంగా వుంది. ఆర్జీఈఎస్ఎస్ కింద కొన్న అన్ని షేర్లనూ మీ డిపాజిటరీ లాక్ఇన్ చేయలేదని మీరు అడుగుతున్నారా? మీరు కొన్న షేర్లన్నీ ఆర్జీఈఎస్ఎస్ కింద అర్హమైనవే అయితే...రూ. 50,000 విలువైన మీ షేర్లను ఎందుకు లాక్ చేయలేదో మీ డిపాజిటరీ వద్ద వాకబు చేయండి. ఆర్జీఈఎస్ఎస్ కింద మీ డీమ్యాట్ ఖాతాలో ఎంతైనా పెట్టుబడి చేయవచ్చు. కానీ ఒక అర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువైన షేర్లకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆర్జీఈఎస్ఎస్ కింద అర్హమైన షేర్లను రూ. 50,000 విలువ వరకూ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ డిపాజిటరీ ఆటోమ్యాటిక్‌గా లాక్ఇన్ చేస్తుంది. అయితే ఈ స్కీము కింద మీరు కొన్న షేర్లలో లాక్ఇన్లో అట్టిపెట్టుకొనే షేర్లను ఎంపికచేసుకునే స్వేచ్ఛ మీకుంటుంది. ఆ ఏడాదిలో ఈ స్కీము కింద అట్టిపెట్టుకోదల్చని పెట్టుబడుల్ని/షేర్లను మీరు లావాదేవీ జరిపిన తర్వాత నెలరోజుల్లోపు ఫారమ్-బి ద్వారా మీ డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ఈ విషయమై మీరు సమాచారం అందించాల్సివుంటుంది. తద్వారా ఆ షేర్లను మీరు విక్రయించడం లేదా తనఖా చేసే హక్కు లభిస్తుంది. నేను యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, బీఎస్ఎల్ టాక్స్ రిలీఫ్ 96 ఫండ్స్లోరూ. 40,000 చొప్పున పెట్టుబడి పెట్టాను. మరో రూ.40,000 వరకూ పెట్టుబడులు పెట్టగలను. ఈ మొత్తాన్ని పన్ను ఆదా, అధిక రాబడుల కోసం ఎస్బీఐ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ)లలో గానీ, మరే ఇతర ఈఎల్ఎస్ఎస్లో గానీ ఇన్వెస్ట్ చేయమంటారా? - ప్రసన్న, హైదరాబాద్ ఎన్ఎఫ్ఓలలో పెట్టుబడిని మేము సిఫార్సు చేయం. పనితీరును రుజువుపర్చుకోవాల్సి వున్న ఎన్ఎఫ్ఓకంటే ఇప్పటికే ట్రాక్ రికార్డు కలిగివున్న ప్రస్తుత స్కీమే పెట్టుబడికి ఉత్తమమన్నది మా విశ్వాసం. మార్కెట్లో లేని వినూత్నమైన సదుపాయాన్ని ఏదైనా ఎన్ఎఫ్ఓ అందిస్తుంటే మాత్రం పెట్టుబడికి పరిశీలించవచ్చు. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ టాక్స్ రిలీఫ్ 96లలోనే మీరు పెట్టుబడి చేయడం శ్రేయస్కరం. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ స్కీము ఫైవ్ స్టార్ ఫండ్ కాగా, బిర్లా సన్‌లైఫ్ టాక్స్ రిలీఫ్ 96 తగిన ట్రాక్ రికార్డు కలిగిన ఫోర్ స్టార్ ఫండ్. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్)లో యాజమాన్య వాటాపై టాక్స్ రిబేటును పొందవచ్చా? - సుందర్, విశాఖ పట్టణం ఎన్పీఎస్కు యాజమాన్య వాటాలో...ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ (2) కింద వేతనం (బేసిక్ ప్లస్ డీఏ) 10 శాతం వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే సెక్షన్ 80సీసీఈ కింద అనుమతిస్తున్న రూ. 1.5 లక్షల పరిమితిలో ఈ ఎన్పీఎస్ మినహాయింపు వుండదు. ఎన్‌పీఎస్‌లో యాజమాన్య వాటాపై అదనపు మినహాయింపును మీరు క్లెయిమ్ చేసుకోవాల్సివుంటుంది. నా దగ్గర రూ.8 లక్షలున్నాయి. మరో ఐదేళ్ల వరకూ నాకు వీటితో అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఈక్విటీల్లో గానీ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నాకు ఎలాంటి అనుభవం లేదు. నేను స్టాక్ మార్కెట్‌కు, మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. మంచి రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్ చేయడానికి తగిన సూచనలివ్వండి. - రాజేందర్, నెల్లూరు మీరు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇవి కనీసం 65 శాతం ఈక్విటీల్లో, మిగిలింది డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ కన్నా ఇవి కొంత తక్కువ ఒడిదుడుకులుగా ఉంటాయి. తొలిసారిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇవి మంచి ఎంపిక. ఏదైనా బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులను జమ చేయండి. తర్వాత ఏదైనా మంచి రేటింగ్ ఉన్న ఒకటి లేదా రెండు ఈక్విటీ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
తొలిసారి షేర్లు కొంటున్నారా?
ఒక పక్కేమో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. డిపాజిట్లపై వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. ఏంచేయాలి? ఇలా ఆలోచించేవారికిపుడు గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించని వారు కూడా కొత్తగా డీమ్యాట్ ఖాతాలు తెరిచే పనిలో పడుతు న్నారు. అయితే ఇలా తొలిసారిగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు మరో లాభం కూడా ఉంది. అది... పన్ను ప్రయోజనం. రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్జీఈఎస్ఎస్) ద్వారా వారు పన్ను లాభాలను కూడా అందుకోవచ్చు. రాజీవ్‌గాంధీ ఈక్విటీ స్కీమ్ కింద పన్ను ప్రయోజనాలు * వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉంటేనే వర్తింపు * మూడేళ్ల పాటు వరుసగా పన్ను లాభం పొందే అవకాశం * ఎంపిక చేసిన షేర్లు, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే... ఆర్జీఈఎస్ఎస్ అంటే... స్టాక్ మార్కెట్లో దేశీయ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్‌ను (ఆర్జీఈఎస్ఎస్) ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికి పన్ను ప్రయోజనం దీని ఉద్దేశం. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80 సీసీజీనీ ప్రత్యేకంగా చేర్చారు. అంటే ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను ప్రయోజనానికి అదనం. ఈ పథకం కింద ఎంపిక చేసిన షేర్లు, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఇలా గరిష్టంగా రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో సగాన్ని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు ఉంది. ఉదాహరణకు రూ. 50,000 ఇన్వెస్ట్ చేస్తే అందులో సగం రూ. 25,000 మీ ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. దీనివల్ల కనిష్టంగా రూ.2,500 నుంచి గరిష్టంగా రూ.7,500 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను లాభాలను పొందవచ్చు. వార్షికాదాయం రూ. 12 లక్షలు లోపు ఉండాలి. ఒకవేళ మూడేళ్ల మధ్యలో మీ వార్షికాదాయం రూ.12 లక్షలు దాటితే ఆ ఏడాది నుంచి ఈ ప్రయోజనాలు వర్తించవు. ఆర్జీఈఎస్ఎస్ వర్తించే కొన్ని ఈటీఎఫ్‌లు * బిర్లా సన్‌లైఫ్ నిఫ్టీ ఈటీఎఫ్ * గోల్డ్‌మన్ బ్యాంకింగ్ ఇండెక్స్ ఈటీఎఫ్ * గోల్డ్‌మన్ నిఫ్టీ ఈటీఎఫ్ * గోల్డ్‌మన్ నిఫ్టీ జూనియర్ * గోల్డ్‌మన్ ఎస్అండ్పీ సీఎన్ఎక్స్ నిఫ్టీ * ఐఐఎఫ్ఎల్ నిఫ్టీ ఈటీఎఫ్ * కోటక్ నిఫ్టీ ఈటీఎఫ్ * మోతీలాల్ ఎం50 ఈటీఎఫ్ * క్వాంటమ్ ఇండెక్స్ ఫండ్ * రెలిగేర్ నిఫ్టీ ఈటీఎఫ్ ఆర్జీఈఎస్ఎస్ ఫండ్స్ * బిర్లాసన్లైఫ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్ * బిర్లాసన్లైఫ్ ఆర్జీఈఎస్ఎస్ ఫండ్ * డీఎస్పీ బ్లాక్ రాక్ ఆర్జీఈఎస్ఎస్ * హెచ్డీఎఫ్సీ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్ * హెచ్డీఎఫ్సీ ఆర్జీఈఎస్ఎస్ * ఐసీఐసీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సిరీస్ * ఎల్ఐసీ నోమూరా ఆర్జీఈఎస్ఎస్ సిరీస్1 * యూటీఐ రాజీవ్‌గాంధీ ఈక్విటీ స్కీం * రిలయన్స్ సీఎన్ఎక్స్ 100 ఆర్జీఈఎస్ఎస్ వర్తించే పీఎస్‌యూ షేర్లు.. మహారత్న కోల్ ఇండియా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెయిల్ నవరత్న భారత్ ఎలక్ట్రానిక్స్, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, ఎంటీఎన్ఎల్, నాల్కో, ఎన్ఎండీసీ, నైవేలీ లిగ్నేట్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, షిప్పింగ్ కార్పొరేషన్. వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలి మీకు నచ్చిన కంపెనీ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ పన్ను ప్రయోజనాలు లభించవు. తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి రిస్క్ తక్కువగా ఉండే అతిపెద్ద కంపెనీల షేర్లు కొంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్జీఈఎస్ఎస్కు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కేవలం బీఎస్ఈ 100 , ఎన్ఎస్ఈ 100 ఇండెక్స్‌లో ఉన్న కంపెనీ షేర్లు లేదా ఈటీఎఫ్‌లు, ఆర్జీఈఎస్ఎస్ పరిధిలోకి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వరంగ మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చు. లేకపోతే ప్రభుత్వ వాటా 51 శాతంకన్నా తక్కువ కాకుండా, రూ.4,000 కోట్లపైన వ్యాపార పరిమాణం ఉన్న కంపెనీలు జారీ చేసే పబ్లిక్ ఇష్యూల్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్జీఈఎస్ఎస్ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. నిబంధనలు ఏమిటి? ఇంతవరకు ఎటువంటి స్టాక్ మార్కెట్ లావాదేవీలూ నిర్వహించని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే డీమ్యాట్ ఖాతా ఉండాలి. గతంలో ఎప్పుడో డీమ్యాట్ అకౌంట్ తెరిచినా.. అందులో ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, షేర్లను కేవలం డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లాకిన్ పీరియడ్ ఉందా? ఆర్జీఈఎస్ఎస్ పథకం కింద కొనుగోలు చేసిన షేర్లను మూడేళ్ల పాటు విక్రయించకూడదు. మూడేళ్ల కాలాన్ని లాకిన్ పీరియడ్‌గా పరిగణిస్తారు. అయితే ఇన్వెస్ట్ చేసిన ఏడాది తర్వాత నుంచి ఈ లాకిన్ ిపీరియడ్లో కొంత వెసులుబాటు కల్పించారు. రెండో ఏడాది నుంచి పన్ను మినహాయింపు పొందిన విలువకు సమాన మొత్తంలో షేర్లను ఉంచి, మిగిలిన యూనిట్లు లేదా షేర్లను విక్రయించవచ్చు. ఈ నిబంధన పాటించడంలో విఫలమైతే మీకు లభించిన పన్ను ప్రయోజనాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం