రాజీవ్ ఈక్విటీ స్కీము కింద పన్ను మినహాయింపు ఎలా? | Investing in Rajiv Gandhi Equity Savings Scheme | Sakshi
Sakshi News home page

రాజీవ్ ఈక్విటీ స్కీము కింద పన్ను మినహాయింపు ఎలా?

Published Mon, Feb 15 2016 4:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

రాజీవ్ ఈక్విటీ స్కీము కింద పన్ను మినహాయింపు ఎలా?

రాజీవ్ ఈక్విటీ స్కీము కింద పన్ను మినహాయింపు ఎలా?

రాజీవ్‌గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్‌జీఈఎస్‌ఎస్) కింద రూ. 50,000 విలువైన అర్హమైన  షేర్లను కొన్నాను.
వీటిలో రూ. 49,000 విలువగల షేర్లకే లాక్‌ఇన్ వర్తించింది.
నేనేం చేయాలి? ఆర్‌జీఈఎస్‌ఎస్ కింద పన్ను మినహాయింపును నేను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
 - భాస్కర్, వరంగల్

 
మీ ప్రశ్న కొంచెం సందిగ్ధంగా వుంది. ఆర్‌జీఈఎస్‌ఎస్ కింద కొన్న అన్ని షేర్లనూ మీ డిపాజిటరీ లాక్‌ఇన్ చేయలేదని మీరు అడుగుతున్నారా? మీరు కొన్న షేర్లన్నీ ఆర్‌జీఈఎస్‌ఎస్ కింద అర్హమైనవే  అయితే...రూ. 50,000 విలువైన మీ షేర్లను ఎందుకు లాక్ చేయలేదో మీ డిపాజిటరీ వద్ద వాకబు చేయండి. ఆర్‌జీఈఎస్‌ఎస్ కింద మీ డీమ్యాట్ ఖాతాలో ఎంతైనా పెట్టుబడి చేయవచ్చు. కానీ ఒక అర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువైన షేర్లకే పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఆర్‌జీఈఎస్‌ఎస్ కింద అర్హమైన షేర్లను రూ. 50,000 విలువ వరకూ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ డిపాజిటరీ ఆటోమ్యాటిక్‌గా లాక్‌ఇన్ చేస్తుంది. అయితే ఈ స్కీము కింద మీరు కొన్న షేర్లలో లాక్‌ఇన్‌లో అట్టిపెట్టుకొనే షేర్లను ఎంపికచేసుకునే స్వేచ్ఛ మీకుంటుంది. ఆ ఏడాదిలో ఈ స్కీము కింద అట్టిపెట్టుకోదల్చని పెట్టుబడుల్ని/షేర్లను మీరు లావాదేవీ జరిపిన తర్వాత నెలరోజుల్లోపు ఫారమ్-బి ద్వారా మీ డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ఈ విషయమై మీరు సమాచారం అందించాల్సివుంటుంది. తద్వారా ఆ షేర్లను మీరు విక్రయించడం లేదా తనఖా చేసే హక్కు లభిస్తుంది.
 
నేను యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, బీఎస్‌ఎల్ టాక్స్ రిలీఫ్ 96 ఫండ్స్‌లోరూ. 40,000 చొప్పున పెట్టుబడి పెట్టాను. మరో రూ.40,000 వరకూ పెట్టుబడులు పెట్టగలను.   ఈ మొత్తాన్ని పన్ను ఆదా, అధిక రాబడుల కోసం ఎస్‌బీఐ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ)లలో గానీ, మరే ఇతర ఈఎల్‌ఎస్‌ఎస్‌లో గానీ ఇన్వెస్ట్ చేయమంటారా?                              
- ప్రసన్న, హైదరాబాద్

 
ఎన్‌ఎఫ్‌ఓలలో పెట్టుబడిని మేము సిఫార్సు చేయం. పనితీరును రుజువుపర్చుకోవాల్సి వున్న ఎన్‌ఎఫ్‌ఓకంటే ఇప్పటికే ట్రాక్ రికార్డు కలిగివున్న ప్రస్తుత స్కీమే పెట్టుబడికి ఉత్తమమన్నది మా విశ్వాసం.  మార్కెట్లో లేని వినూత్నమైన సదుపాయాన్ని ఏదైనా ఎన్‌ఎఫ్‌ఓ అందిస్తుంటే మాత్రం పెట్టుబడికి పరిశీలించవచ్చు. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ టాక్స్ రిలీఫ్ 96లలోనే మీరు పెట్టుబడి చేయడం శ్రేయస్కరం. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ స్కీము ఫైవ్ స్టార్ ఫండ్ కాగా, బిర్లా సన్‌లైఫ్ టాక్స్ రిలీఫ్ 96 తగిన ట్రాక్ రికార్డు కలిగిన ఫోర్ స్టార్ ఫండ్.
 
నేను ప్రభుత్వ ఉద్యోగిని. నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్‌పీఎస్)లో యాజమాన్య వాటాపై టాక్స్ రిబేటును పొందవచ్చా?
 - సుందర్, విశాఖ పట్టణం

 
ఎన్‌పీఎస్‌కు యాజమాన్య వాటాలో...ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ (2) కింద వేతనం (బేసిక్ ప్లస్ డీఏ) 10 శాతం వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే సెక్షన్ 80సీసీఈ కింద అనుమతిస్తున్న రూ. 1.5 లక్షల పరిమితిలో ఈ ఎన్‌పీఎస్ మినహాయింపు వుండదు. ఎన్‌పీఎస్‌లో యాజమాన్య వాటాపై అదనపు మినహాయింపును మీరు క్లెయిమ్ చేసుకోవాల్సివుంటుంది.
 
నా దగ్గర రూ.8 లక్షలున్నాయి. మరో ఐదేళ్ల వరకూ నాకు వీటితో అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఈక్విటీల్లో గానీ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నాకు ఎలాంటి అనుభవం లేదు. నేను స్టాక్ మార్కెట్‌కు, మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. మంచి రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్ చేయడానికి తగిన సూచనలివ్వండి.
 - రాజేందర్, నెల్లూరు

 
మీరు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇవి కనీసం 65 శాతం ఈక్విటీల్లో, మిగిలింది డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ కన్నా ఇవి కొంత తక్కువ ఒడిదుడుకులుగా ఉంటాయి. తొలిసారిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇవి మంచి ఎంపిక. ఏదైనా బ్యాంక్ అకౌంట్‌లో మీ డబ్బులను జమ చేయండి. తర్వాత ఏదైనా మంచి రేటింగ్ ఉన్న ఒకటి లేదా రెండు ఈక్విటీ బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
 - ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement