బాహుబలికి కళ్లెం..! | Budget 2025 share market fluctuations | Sakshi
Sakshi News home page

బాహుబలికి కళ్లెం..!

Published Sun, Feb 2 2025 4:56 AM | Last Updated on Sun, Feb 2 2025 7:22 AM

Budget 2025 share market fluctuations
  • నిరాశపరిచిన మూలధన వ్యయ కేటాయింపులు 
  • కలిసొచ్చిన వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు 
  • రోజంతా ఒడిదుడుకుల ట్రేడింగ్‌ 
  • చివరికి ఫ్లాటుగా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్‌ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌లో స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్‌ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది.  

మార్కెట్లో మరిన్ని సంగతులు 
కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్‌ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్‌ షేర్లకు భారీ డిమాండ్‌ లభించింది. కావేరీ సీడ్స్‌ , పారదీప్‌ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్‌ బయో–జీన్స్, బేయర్‌ క్రాప్‌సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్‌ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్‌ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో  చంబల్‌ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్‌ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. 
→ ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్‌లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్‌ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్‌ గ్లోబల్, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్‌ రియలిటి, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. 
→ లెదర్‌ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్‌వేర్‌ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్‌ 20% ఎగసి అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది. క్యాంపస్‌ ఆక్టివేర్‌ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్‌ 4%, లెహర్‌ ఫుట్‌వేర్స్‌ 3%, రిలాక్సో పుట్‌వేర్స్‌ ఒకశాతం పెరిగాయి.  

ట్రేడింగ్‌ సాగిందిలా...
స్టాక్‌ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్‌పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్‌ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.

వినిమయ షేర్లు పరుగులు 
ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్‌ షేర్లు పరుగులు పెట్టాయి.  
→ వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్‌ 13% పెరిగింది. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ 8%, హావెల్స్‌ 6%, వోల్టాస్‌ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్‌పూల్‌ 3% చొప్పున, టైటాన్‌ 2% ఎగిశాయి.  
→ ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్‌యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి.   
→ ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్‌ మోటార్స్‌ 4%, ఐషర్‌ మోటార్స్‌ 3.50%, బజాజ్‌ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి.  

మౌలిక రంగ షేర్లు డీలా  
ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక,  ఇంధన  ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్‌ షేర్లు డీలాపడ్డాయి. .  
→ రైల్వే రంగ షేర్లైన టెక్స్‌మాకో రైల్‌ ఇంజనీరింగ్స్, జుపిటర్‌ వేగన్స్‌ , టిటాఘర్‌ రైల్‌ సిస్టమ్స్‌ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్, రైల్‌ వికాస్‌ నిగమ్‌ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్‌సీటీసీ, రీట్స్‌ షేర్లు 3% నష్టపోయాయి.   
→ రోడ్లు, కస్ట్రక్షన్‌ షేర్లు ఎన్‌సీసీ 8%, ఎన్‌బీసీసీ, పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్‌ ఇ్రన్ఫా, ఐఆర్‌బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్‌అండ్‌టీ, అజాద్‌ ఇంజనీరింగ్స్‌ షేర్లు 3–6% క్షీణించాయి.

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం 
పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్‌ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్‌ లక్ష్యం.

బ్యాటరీల తయారీకి దన్ను 
ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్‌ బ్యాటరీల (మొబైల్‌ ఫోన్లకు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ పార్ట్‌నర్‌ సాకేత్‌ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్‌ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్‌ మహాజన్‌ చెప్పారు.  

బలమైన అడుగులు.. 
క్యాన్సర్‌ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.  ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్‌ టూరిజం, హీల్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు.  సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్‌లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది.  
– సతీష్‌ రెడ్డి, చైర్మన్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యా»ొరేటరీస్‌.

వైద్య సంరక్షణ కేంద్రంగా.. 
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్‌ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్‌ ఇన్‌ ఇండియా మిషన్‌ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్‌ను ఉంచు తుంది. 
– ప్రతాప్‌ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్‌.

పెట్టుబడులకు ఊతం.. 
వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్‌ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్‌టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. 
– సంజయ్‌ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్‌.

వృద్ధికి ఇంధనం.. 
తయారీ, గ్రీన్‌ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది.  ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్‌ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్‌ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్‌ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి.  
– పవన్‌ ముంజాల్, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, హీరో మోటోకార్ప్‌.  

కస్టమర్లకు ఉపశమనం లేదు.. 
విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్‌ గూడ్స్‌) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్‌ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్‌లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి.  
పంకజ్‌ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌.

ఇంధన శక్తిలో అగ్రగామిగా..  
ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్‌ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్‌ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్‌ మీటరింగ్‌ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. 
– నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement